Wednesday, March 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహ్యాం రోడ్ల పేరుతో రూ.18 వేల కోట్ల కుంభకోణం

హ్యాం రోడ్ల పేరుతో రూ.18 వేల కోట్ల కుంభకోణం

- Advertisement -

– 4 రాష్ట్రాల ఎన్నికలకు ఆ మొత్తాన్ని పంపేందుకు ప్రణాళిక
– ఆ టెండర్లను రద్దు చేయాలి
– హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి : మీడియాతో చిట్‌చాట్‌లో హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో హ్యాం రోడ్ల పేరుతో రూ.18 వేల కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం తెరలేపిందని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి టి హరీశ్‌ రావు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో అసెంబ్లీలో మీడియాతో వారు చిట్‌చాట్‌ నిర్వహించారు. ఆర్‌ అండ్‌ బీ రూ.12 వేల కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖ రూ.ఆరు వేల కోట్లలో పది శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్సులు పెట్టారని అన్నారు. రూ.1,800 కోట్లు నేరుగా వస్తాయనీ, వాటిని నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు పంపేందుకు ప్రణాళిక రూపొందించారని చెప్పారు. జలయజ్ఞం కాదు ధనయజ్ఞమనీ, జేబులు దండుకుంటున్నారనీ, నాడు తెలుగుదేశం, రేవంత్‌రెడ్డి అంతటా ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కమీషన్ల కోసమే హ్యాం రోడ్ల పేరుతో రూ.వేల కోట్లు దండుకునేందుకు ప్రణాళిక వేశారని అన్నారు. దేశం మొత్తం జాతీయ రహదారులు సాధారణంగా 20 నుంచి 30 శాతం వరకు టెండర్లు తక్కువ ధరకు వెళ్తాయని చెప్పారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో 15 నుంచి 20 శాతం అధిక ధరకు వెళ్తున్నాయని వివరించారు. తేడా 50 శాతం వస్తోందన్నారు. సీఓటీకి వెళ్లకుండా నేరుగా శాఖాపరమైన కమిటీ ఆమోదించేలా చేశారని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొబిలైజేషన్‌ అడ్వాన్సుల విధానాన్ని రద్దు చేసిందని గుర్తు చేశారు. నాడు జలయజ్ఞంలో మూడు శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఉంటే… ఇప్పుడు పది శాతానికి పెంచారని వివరించారు. మొత్తం 34లో ఇప్పటి వరకు తెరిచిన 24 టెండర్ల సాంకేతిక బిడ్లు చూస్తే దాదాపు 16 టెండర్లలో ఇద్దరు మాత్రమే వేశారని చెప్పారు. ముందే రింగ్‌ అయ్యారని విమర్శించారు. కుమ్మక్కై ముందే మాట్లాడుకుని అధిక ధరకు టెండర్‌ వేసేలా చేశారని అన్నారు. ఇప్పటివరకు టెండర్‌ ధరలో ఐదు శాతం మాత్రమే ఎక్కువకు వెళ్లేలా సీలింగ్‌ ఉండేదనీ, ఇప్పుడు హ్యాం రోడ్లకు ఆ నిబంధనను ఎత్తేయడంతో ఎంత ఎక్కువకు అయినా వేసుకోవచ్చని చెప్పారు. హ్యాం రోడ్ల టెండర్లలో పెద్ద కుంభకోణం జరిగిందని విమర్శించారు. నల్లగొండలో రెండు కంపెనీలు మాత్రమే టెండర్లు వేశాయన్నారు. టెండర్లలో అవినీతి జరిగిందనీ, వాటిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. దీనిపై సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌కు, రిజర్వ్‌ బ్యాంకుకు ఫిర్యాదు చేస్తామన్నారు. టెండర్లలో పాలు పంచుకున్న అధికారులు, కాంట్రాక్టర్లపై బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బీ పద్దులు చర్చకు వచ్చినపుడు బీఆర్‌ఎస్‌ తరపున మరిన్ని ఆధారాలు బయటపెడతామని చెప్పారు. హైకోర్టు విచారణకు పట్టుబడతామని అన్నారు. సింగరేణి శ్రీరాంపూర్‌ టెండర్‌ వ్యవహారాన్ని తాము బయటపెట్టిన తర్వాత తక్కువ టెండర్‌కు పోయిందని గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -