నవతెలంగాణ-హైదరాబాద్: బెంగళూరు నగరంలో సోషల్ మీడియా రీల్ కోసం ఓ మహిళ తన తండ్రిని సంచిలో పెట్టి కొరియర్‌కు పంపే ప్రయత్నం చేయడం సంచలనం కలిగించింది. వైలికావల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కొరియర్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళ, ఆమె భర్త, అత్త, భర్త సోదరుడు కలిసి తండ్రిని సంచిలో పెట్టి కొరియర్ పంపేందుకు వచ్చారు. పార్సెల్‌లో ఏముందని అడిగిన సిబ్బందికి సరైన సమాధానం ఇవ్వకుండానే వారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పరిశీలించారు. అనంతరం సంచిలో నుంచి మహిళ తండ్రి బయటకు రావడంతో విషయం బయటపడింది. రంజాన్, ఉగాది సమయంలో ప్రయాణ టిక్కెట్లు దొరకడం కష్టమని, ఈ అంశంపై రీల్ వీడియో తీయడానికే ఇలా చేసినట్లు ఆ మహిళ వివరించింది. అయితే, కొరియర్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు కుటుంబ సభ్యులను స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారి చర్యపై కఠిన హెచ్చరిక జారీ చేసి, క్షమాపణ చెప్పేలా చేసి అనంతరం వారిని విడుదల చేశారు.



