- Advertisement -
యుద్ధభేరీల్లో కోకిలనాదాలు
మూగబోయాయి
మాంద్యం మబ్బుల్లో మావిచిగుర్లు
ఆవిరయ్యాయి
షడ్రుచులు చేదు పంచుతున్నాయి
పంచాంగం నిండా రాహుకేతువులే
సామ్రాజ్యవాదం ఆధిపత్యవాదం
పడగనీడలో
సగటు మానవుడు చతికిలపడ్డాడు
సమస్యల సాలెగూళ్లో ఉగాది పండుగ
కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది
యుద్ధమేఘాలు పోయి మానవత్వం
ఉదయిస్తేనే ఉగాదికి ఊపిరి..
ధనవంతుడికి ప్రతిరోజూ పండగే!
పేదవాడికి పండుగ పారమార్థిక చింతనెప్పుడూ ఓ చింతే!
పండగొచ్చినా ఆర్ధిక అసమానతలు
పండగ వాతావరణాన్ని ఛిద్రం చేస్తున్నారు
ఆశగా పరిగెత్తుకు రావడం
నిరాశగా నిష్క్రమించడం
పండుగలకు అలవాటైపోయిందేమో
గుడిసెల్లోకి ఎండొస్తుంది, వానొస్తుంది
ఉగాది మాత్రం రానంటోంది, అదేంటో!
- భీమవరపు పురుషోత్తమ్,
9949800253
- Advertisement -



