విదేశాంగ మంత్రి అరగ్చి స్పష్టం
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటరీ అలీ లారిజానీ హత్యతో ఇరాన్ రాజకీయ వ్యవస్థను అస్థిరీకరించలేరని విదేశాంగ మంత్రి అరగ్చి స్పష్టం చేశారు. ఈ హత్యకు కచ్చితంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రతీకారం తీర్చుకుంటుందని ప్రతిన చేశారు. ఒక వ్యక్తి ఉండడం లేదా లేకపోవడమనేది మొత్తంగా వ్యవస్థను ప్రభావితం చేసేలా ఉండదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇరాన్ మత పెద్ద అలీ ఖమేనీ హత్య కూడా మొత్తంగా ఇరాన్ వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘నాయకుడి కంటే ముఖ్యమైన వ్యక్తి మాకెవరూ వుండరు, అయితే ఆ నాయకుడే మరణించినా మొత్తంగా వ్యవస్థ తన పని తాను కొనసాగిస్తూ వుంటుంది. ఆ స్థానంలో వేరొకరిని తక్షణమే నియమిస్తుంది.” అని చెప్పారు. అమెరికా, ఇజ్రాయిల్ ఈ అంశాన్ని ఎందుకు ఇంకా అర్ధం చేసుకోలేదో తనకు తెలియడం లేదని అరగ్చి అన్నారు. స్పష్టమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలతో ఇరాన్‌కు బలమైన వ్యవస్థ వుందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం లారిజాని మృతిని ధృవీకరించిన అనంతరం ఆయన అల్జజీరాతో మాట్లాడారు.
ఐఆర్జీసీ సంతాపం
లారిజానీ మృతికి ఐఆర్జీసీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఆ అమరవీరుని రక్తం ప్రపంచ ఆధిపత్య ధోరణిని, అంతర్జాతీయ యూదువాదాన్ని ఎదుర్కొనడంలో జాతీయ జాగృతికి, బలానికి ఒక వనరుగా పనిచేస్తుందని పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.
హార్మ్ముజ్ను దాటిన 90 నౌకలు
పశ్చిమాసియాలో యుద్ధం చెలరేగినప్పటి నుండి చమురు ట్యాంకర్లతో పాటూ దాదాపు 90 నౌకలు హార్మూజ్ జలసందిని దాటాయి. ఈ జల మార్గం మూసివేయబడినప్పటికీ ఇప్పటికీ లక్షలాది బ్యారెళ్ళ చమురు ఎగుమతి అవుతోందని మారిటైమ్, వాణిజ్య డేటా వేదికలు వెల్లడించాయి. ఇలా వచ్చిన నౌకలన్నీ కూడా ‘డార్క్’ మోడ్‌లో వుంటూ ట్రాకింగ్ వ్యవస్థల కన్నుగప్పి ప్రయాణించినవేనని మారిటైమ్ డేటా సంస్థ లాయిడ్ లిస్ట్ ఇంటెలిజెన్స్ తెలిపింది. యుద్ధానికి ముందు రోజుకు దాదాపుగా వంద నుంచి 135 వరకు నౌకలు ప్రయాణించేవి.



