అందుకనుగుణంగా సమావేశాల రోజుల సంఖ్యను పెంచాలి : రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రజా ప్రాముఖ్యత ఉన్న సమస్యలపై లోతుగా చర్చించేందుకు చర్చలు అవసరమనీ, అందుకు వీలుగా సభా సమావేశాల సంఖ్యను పెంచాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. బుధవారం రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న 59 మంది ఎంపీలకు వీడ్కోలు పలికే ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ”పేదలు, సమాజంలోని అణగారిన వర్గాలు, రైతులు, కార్మికుల ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలపై చర్చించడానికి మరింత అవకాశం ఉండాలి. తరచుగా ఈ సమస్యలను లేవనెత్తినప్పుడు అధికార పార్టీ దానిని విమర్శగా భావించి, కనీసం వినకుండానే ఖండించడం ప్రారంభిస్తుంది. అయితే ప్రభుత్వం ప్రజల ఆందోళనలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలి” అని అన్నారు.
చట్టాల రూపకల్పనలో ప్రతిపక్ష సభ్యులు పాల్గొనేందుకు ఏ ఆటంకం కలిగినా అది పార్లమెంట్ వ్యవస్థను బలహీనపరుస్తుందని అన్నారు. ”పార్లమెంట్ సభ్యులకు అందుబాటులో ఉన్న పరిమిత అవకాశాలలో కూడా ముఖ్యమైన అంశాలు ప్రస్తావించినప్పుడు, ఆ వ్యాఖ్యలు పార్లమెంటరీ నియమాలకు విరుద్ధమైనవి కానప్పటికీ, వాటిని తరచుగా సభా కార్యకలాపాల నుంచి తొలగిస్తున్నారు. అని అన్నారు. ”రాజ్యసభ కార్య విధాన నియమావళి, సభా కార్యకలాపాల నిర్వహణపై కాలానుగుణ సమీక్ష అత్యవసరం. ఈ అంశం ప్రస్తుతం సాధారణ ప్రయోజనాల కమిటీ (జీపీసీ) పరిశీలనలో ఉంది. దీనిపై తీవ్రంగా చర్చించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో పాల్గొనే వారు ప్రజా జీవితం నుంచి ఎన్నడూ విరమించుకోరు. దేశ సేవ చేయాలనే వారి తపనలో వారు ఎన్నడూ అలసిపోరు” అని పేర్కొన్నారు.
రాజకీయాల్లో పుల్‌స్టాప్‌లు ఉండవు: ప్రధాని మోడీ
రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యులనుద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ, పదవీకాలం ముగిసినంత మాత్రాన ప్రజాసేవ ముగిసినట్టు కాదన్నారు. రాజ్యసభ మేధావుల వేదిక అని, ఇక్కడ లభించే జ్ఞానానికి విలువ కట్టలేమని తెలిపారు. పార్లమెంట్‌ను ఒక బహిరంగ విశ్వవిద్యాలయంగా పేర్కొంటూ పదవీ విరమణ చేసిన ఎంపీలు తమ జీవితాల్లో చురుకుగా ఉండాలని కోరారు. హెచ్డీ దేవెగౌడ, మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్ వంటి దిగ్గజ నేతల సహకారాన్ని మరువలేమని, సగానికి పైగా తమ జీవితాన్ని పార్లమెంటుకే అంకితం చేశారని ప్రశంసించారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు వారి నుంచి నేర్చుకోవాల్సినది ఎంతైనా ఉంటుందని సూచించారు.
మాతో ప్రేమ…మోడీతో పెండ్లి
మాజీ ప్రధాని దేవెగౌడను ఉద్దేశించి ఖర్గే వ్యాఖ్యలు
రాజ్యసభలో పదవీకాలం ముగిసిన సభ్యుల వీడ్కోలు సభలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కాసేపు నవ్వులు పూయించారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడను ఉద్దేశించి మాట్లాడుతూ, గత 54 ఏండ్లుగా ఆయన తనకు తెలుసని, ఆయనతో కలిసి పనిచేశానని చెప్పారు. ‘అయితే ఏమి జరిగిందో తెలియదు కానీ, ఆయన మాతో ప్రేమ సాగించి మోడీని పెండ్లి చేసుకున్నారు’ అంటూ చమత్కరించారు. దీంతో సభలో ఉన్న ప్రధాని మోడీతో సహా సభ్యులంతా నవ్వులు చిందించారు.
దేశానికి సేవ చేయాలనే తపన కలిగిన వారు రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఎన్నడూ అలసిపోరని ఖర్గే అన్నారు. కాగా, రాజ్యసభ సభ్యుల వీడ్కోలు సెషన్లో శరద్ పవార్, డీఎంకే నేత తిరుచ్చి శివతో తన అనుబంధాన్ని కూడా ఖర్గే గుర్తుచేసుకున్నారు. అయితే పవార్, తిరుచ్చి శివ తిరిగి రాజ్యసభకు రాబోతున్నారు. ఖర్గే తన ప్రసంగంలో కేంద్ర మంత్రి, ఆర్పీఐ(ఏ) చీఫ్ రామ్‌దాస్ అథవాలేపై కూడా చలోక్తులు విసిరారు. ‘ఆయన ఎప్పుడూ తన కవితల్లో మోడీని పొగుడుతుంటారు. ఆయనకు మరే ఇతర కవితలు తెలియవేమో’ అని చెప్పారు.



