Thursday, March 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'గంగదేవిపల్లి'ని జాతీయస్థాయికి తీసుకెళ్లిన ఘనత 'రాజమౌళి'ది

‘గంగదేవిపల్లి’ని జాతీయస్థాయికి తీసుకెళ్లిన ఘనత ‘రాజమౌళి’ది

- Advertisement -

– సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు ఎస్‌. వీరయ్య
– ఆయన ఆశయాలు కొనసాగిద్దాం : నేతలు
– ఘనంగా సంతాప సభ
నవతెలంగాణ -గీసుగొండ

గంగదేవిపల్లి గ్రామాన్ని జాతీయస్థాయిలో గుర్తింపు పొందేలా తీర్చిదిద్దిన ఘనత కూసం రాజమౌళిదేనని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌. వీరయ్య అన్నారు. బుధవారం గంగదేవిపల్లి మాజీ సర్పంచ్‌ కూసం రాజమౌళి సంతాప సభను పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామంలో తోగిటి బ్రహ్మచారి అధ్యక్షతన నిర్వహించిన సభకు వీరయ్య హాజరై, రాజమౌళి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో రాజమౌళి చూపిన కృషి అసాధారణమన్నారు. గ్రామ పంచాయతీలకు తగిన వనరులు లేకపోయినా ప్రజలను భాగస్వాములను చేస్తూ, స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు, దాతలు, వివిధ రాజకీయ పార్టీలను కలుపుకుని గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లారని వివరించారు. ప్లాస్టిక్‌ నియంత్రణ, ప్రతి ఇంటికీ మరుగు దొడ్లు, ఇంటింటికీ మంచినీరు వంటి కార్యక్రమాలను ఆ కాలంలోనే అమలు చేయడం రాజమౌళి దూరదృష్టికి నిదర్శనమని కొనియాడారు. గ్రామాన్ని ప్లాస్టిక్‌ రహిత గ్రామంగా మార్చడం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌, కేరళ రాష్ట్రాల్లో అమలవుతున్న స్థానిక స్వయంపాలన విధానాల నుంచి స్ఫూర్తి పొంది, అదే నమూనాను గంగదేవిపల్లిలో అమలు చేయాలని సంకల్పిం చారని తెలిపారు. రాజీవ్‌ గాంధీ హయాంలో తీసుకువచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణల ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ గ్రామపంచాయతీలకు అధికారాలు, వనరులు అవసరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో రాష్ట్రాల వనరులను కేంద్రీకరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా బలహీనపడుతున్నాయని విమర్శించారు. ముఖ్యంగా మహిళల సాధికారతకు రాజమౌళి చేసిన కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. గంగదేవిపల్లిలో సర్పంచ్‌, వార్డు సభ్యులుగా మహిళలకు అవకాశాలు కల్పించారని తెలి పారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి. నాగయ్య మాట్లాడుతూ రాజమౌళి ఈ ప్రాంత ప్రజల కోసం అనేక సేవలు చేశారని, ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ముందుండి పరిష్కరించేవారని గుర్తుచేశారు. చిన్న గ్రామాన్ని జాతీయస్థాయిలో నిలబెట్టిన మహానేతగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. రాజమౌళి ఆశయాలను కొనసాగిస్తూ ఆయన చూపిన ఎర్రబాటలో నడవాలని, గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయ కులు జి రాములు, కాంగ్రెస్‌ పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడ కొమరారెడ్డి, గ్రామ సర్పంచ్‌ కె. స్వరూప రమేష్‌, గ్రామ ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజమౌళికి ఘనంగా నివాళులర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -