Thursday, March 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకరీంనగర్‌ సీపీపై చర్యలు తీసుకోవాలి

కరీంనగర్‌ సీపీపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

మరిన్ని సంచలన విషయాలు బయట పెడతా : ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వ్యవహారశైలిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. కరీంనగర్‌లో పోలీసు వ్యవస్థ దిగజారిందని, సీపీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌లో జరిగిన ఫైరింగ్‌ ఘటనపై మంత్రి శ్రీధర్‌బాబు విచారణకు ఆదేశిస్తే.. ఆ సమయంలో తాను సెలవులో ఉన్నానని సీపీ ఒక లేఖను విడుదల చేశారని తెలిపారు. అయితే, ఆ లేఖపై ఎందుకు పెన్నుతో 19వ తేదీ అని రాశారని, దీనికి సీపీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ”సీపీకి సెలవు మంజూరు చేసే అధికారం డీజీపీకి ఉంటుంది. కానీ, ఇక్కడ ఐజీ సెలవు ఎలా ఇస్తారు? ఆ లేఖలోని లోపాలు దేనికి నిదర్శనం?” అని నిలదీశారు. ఫైరింగ్‌ జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను చెరిపివేసేలా ప్యాచ్‌ వర్క్‌ చేశారని, ఇది అక్రమాలకు నిదర్శనమని ఆరోపించారు. ”పోలీసులు రాజ్యాంగాన్ని, ప్రజల భద్రతను కాపాడాలి.. కానీ, పీకల్లోతు మద్యం తాగి పోలీసులు జల్సాలు చేస్తున్నారు. ఇలాంటి ‘దొంగ ఆఫీసర్ల’ వల్ల మొత్తం పోలీస్‌ వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది” అని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం కంటే, ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి హోంశాఖను కూడా నిర్వహిస్తున్నారని, ఈ వ్యవహారంపై ఆయన వెంటనే స్పందించాలని కోరారు. ”కాలయాపన చేస్తే చివరికి నష్టపోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. ఈ విషయంలో 30వ తేదీ లోపు చర్యలు తీసుకోకపోతే మరిన్ని సంచలన విషయాలు బయటపెడతాను” అని హెచ్చరించారు. తన ఆరోపణలు అబద్ధమని తేలితే, అసెంబ్లీ ముందు ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని సవాల్‌ విసిరారు. తనకు పోలీసు వ్యవస్థపై గౌరవం ఉందని, కానీ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న కరీంనగర్‌ సీపీతోపాటు, హుజూరాబాద్‌ ఏసీపీ, జమ్మికుంట రూరల్‌ సీఐలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించకుండా ప్రజలకు వాస్తవాలు చేరవేయాలని కోరారు.
చిట్‌చాట్‌లో కేటీఆర్‌ అర్ధరహితమైన మాటలు
ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‘చిట్‌ చాట్‌’ పేరుతో అర్ధరహితమైన, చెత్త మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యేలు నాగరాజు, మందుల సామేల్‌తో కలిసి ఆయన మాట్లాడారు. మూసీ నది ప్రక్షాళన పనులు పూర్తయితే, ఆ ప్రాజెక్టులో గతంలో జరిగిన అక్రమాలు వెలుగులోకి వస్తాయని, తద్వారా కేటీఆర్‌ రాజకీయంగా గల్లంతవుతారని ఆయన భయపడుతున్నారని చెప్పారు. మూసీ ప్రాజెక్టును అడ్డుకోవడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కేటీఆర్‌ ప్రయత్ని స్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ అధికారు లను కేటీఆర్‌ భయభ్రాంతులకు గురిచేస్తు న్నారన్నారు. ”బ్యూరోక్రసీని పట్టుకొని, అధికారుల పేర్లను పింక్‌ బుక్‌, రెడ్‌ బుక్‌ అంటూ భయపెడుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం నడుస్తుంటే, అధికారులను బెదిరించడం కేటీఆర్‌ అహంకారానికి నిదర్శనం” అని అన్నారు. రెండేండ్లుగా ఏ ఒక్క అధికారికీ ఇబ్బంది కలగకుండా, వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. కేటీఆర్‌ తన కుటుంబ గొడవల ప్రస్టేషన్‌ను అధికారులపై చూపిస్తు న్నారని విమర్శించారు. ”మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి డ్రగ్స్‌ పరీక్షలకు నమూనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా?” అని ప్రశ్నించారు. పైలెట్‌ రోహిత్‌రెడ్డిని కాపాడేందుకు కేటీఆర్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
కేటీఆర్‌ పెయిడ్‌ ఆర్టిస్టులా మాట్లాడారు
ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
కేటీఆర్‌ స్క్రిప్టు రాసుకొచ్చి పెయిడ్‌ ఆర్టిస్టులా మాట్లాడారని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలపై అడిట్‌ ఉందన్న సోయి కూడా వారికి లేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అబద్ధాలతో, అహంకారంతో మాట్లాడుతున్న వారిని రాష్ట్ర బహిష్కరణ చేయాలన్నారు. డ్రగ్స్‌ నిర్ధారణ పరీక్ష చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ వీరిని బహిష్కరణ చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో వరంగల్‌, హన్మకొండలో భూ కబ్జాలు అధికం గా చేశారని ఆరోపించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ కడతామంటే జాగా లేకుండా చేశారని అన్నారు. కార్పొరేటర్లను హత్య చేయించిన ఘనత మీదని, మీరు గుండాయిజం గురించి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. మహిళా సంఘాలకు నాలుగు వేల కోట్ల రూపా యలు మీరు ఎగ్గొట్టారని ఆరోపించారు. యూ ట్యూబ్‌ ఛానళ్లు పెట్టుకొని, స్క్రిప్ట్‌ రాసుకొచ్చి చదువుతున్నారని ఎద్దేవా చేశారు. తక్షణమే కేటీఆర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -