మహారాష్ట్ర నుంచి వలస
తోడు కోసం ఉమ్మడి కరీంనగర్ సహా 11 జిల్లాల్లో సుదీర్ఘ ప్రయాణం
తాజాగా కొడిమ్యాల రేంజ్ పరిధిలో పశువులు బలి.. సీసీ కెమెరాల్లో రికార్డు
సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్ సరిహద్దుల్లో భయాందోళనలో జనం
అటవీ శాఖ ముమ్మర గాలింపు
అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అటవీ ప్రాంత గ్రామాలను ‘పెద్దపులి’ వెంటాడుతోంది. సుమారు ఏడాది కాలంగా మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన ఓ పెద్దపులి.. ఏకంగా 11 జిల్లాలను చుట్టేసి మళ్లీ వెనక్కి మళ్లుతోంది. తాజాగా ఈనెల 17వ తేదీ మంగళవారం రాత్రి జగిత్యాల జిల్లా కొడిమ్యాల అటవీ రేంజి పరిధిలో రెండు ఆవులను హతమార్చిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇటీవల ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో పశువులపై దాడులు జరిగాయి. తాజా ఘటనలతో పశ్చిమ, తూర్పు డివిజన్ల పరిధిలోని జనం కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు.
ఆరు నెలలకుపైగా నిజామాబాద్ మొదలుకుని జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల ప్రజలను ఎప్పుడు ఏ వైపు నుంచి పులి వస్తుందోనన్న భయం వెంటాడుతోంది. ఈ నెల 17న రాత్రి జగిత్యాల జిల్లా కొడిమ్యాల అటవీ రేంజ్ పరిధిలోని గంగారాంతండా శివారులో రెండు ఆవులపై పులి దాడి చేసి చంపేసింది. పులి మహారాష్ట్ర వైపు వెళ్లిపోయిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో తిరిగి పశ్చిమ డివిజన్ పరిధిలోని అటవీ గ్రామాల్లో ప్రత్యక్షం కావడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. కొడిమ్యాల అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న కొండాపూర్, బొల్లోనిచెరువు, దమ్మయ్యపేట, సూరంపేట, తిర్మలాపూర్, రాంసాగర్ తదితర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
11 జిల్లాల సుదీర్ఘ ప్రయాణం.. వెళ్లిన దారిలోనే వెనక్కి
అటవీ అధికారుల అంచనా ప్రకారం.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వన్యప్రాణి అభయారణ్యంలోని పాండవ్ఖరా డివిజన్ నుంచి మూడున్నరేండ్ల జె-1 మగ పులి ప్రయాణం మొదలైంది. గతేడాది నవంబర్‌లో పెన్‌గంగ నదిని దాటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లోకి ప్రవేశించింది. అక్కడి నుంచి మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల మార్గాల ద్వారా కామారెడ్డిలోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత సిద్దిపేట, జనగాం మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి అటవీ ప్రాంతం వరకు వెళ్లింది. సుమారు నెలన్నర రోజులపాటు అక్కడే మకాం వేసిన పులి.. ఫిబ్రవరి మొదటి వారం నుంచి తన పాత మార్గంలోనే ఉత్తర దిశగా సొంత భూభాగానికి (టెరిటరీకి) తిరుగు ప్రయాణం ప్రారంభించింది. ప్రస్తుతం సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో తచ్చాడుతోంది.
తోడు కోసం అన్వేషణ.. రెండు పులుల జాడీ
సహజంగా పులులు ఒంటరిగా ఉండేందుకు మొగ్గు చూపుతాయి. అయితే సంతానోత్పత్తి సమయంలో (మేటింగ్ కోసం) తోడును వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తుంటాయని అటవీ శాఖ వర్గాల సమాచారం. ఇప్పుడు ఈ మగ పులి కూడా ఆడ పులి కోసమే రోజుకు సుమారు 50 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తోందని అధికారులు విశ్లేషిస్తున్నారు. అయితే, ఉమ్మడి కరీంనగర్ జిల్లా తూర్పు డివిజన్ అయిన మంథని అటవీ ప్రాంతంలోనూ మరో పెద్ద పులి (ఆడ పులిగా అనుమానిస్తున్నారు) సంచరిస్తున్నట్టు రైతులు గుర్తించారు. పశ్చిమ డివిజన్లో (సిరిసిల్ల, జగిత్యాల) మగ పులి, తూర్పు డివిజన్లో ఆడ పులి ఒకదానికొకటి ఎదురుచూస్తూ ప్రయాణిస్తున్నాయన్నది అటవీశాఖ అంచనా. ఒకవేళ ఈ రెండు పులులు కలుసుకుంటే ఇక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకుంటే పరిస్థితేంటన్న చర్చ నడుస్తోంది.
పశువులపై పంజా.. 20కి పైగా మూగజీవాలు బలి
మూడున్నరేండ్ల ఈ పులి తన సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడా మానవులపై దాడి చేయలేదు. కానీ, ఆకలి తీర్చుకునేందుకు దారి పొడవునా పశువులను లక్ష్యంగా చేసుకుంది. గత ఫిబ్రవరి 20న వేములవాడ మండలం చెక్కపెల్లి వద్ద ఆవును చంపింది. ఆ తర్వాత రుద్రంగి మండలం కొత్తపేట, కలికోట, కమ్మరిపల్లి అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ దాడులు చేసింది. తాజాగా నిజామాబాద్ – సిరిసిల్ల సరిహద్దుల్లోని కమ్మర్పల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోనూ రెండు ఆవులను, కథలాపూర్ మండలం కలికోట సూరమ్మ ప్రాజెక్టు వద్ద పశువులను హతమార్చింది. మొత్తంగా ఇప్పటివరకు ఈ పులి దాడిలో 20కి పైగా పశువులు మృత్యువాతపడ్డాయి.
అటవీశాఖ అప్రమత్తత..
ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) సువర్ణ నేరుగా రంగంలోకి దిగడంతో అటవీశాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. డ్రోన్లు, ట్రాకింగ్ కెమెరాలు, ప్రత్యేక బృందాలతో పులి పాదముద్రలను (పగ్ మార్క్స్) ఎప్పటికప్పుడూ గమనిస్తూ కదలికలను పసిగడుతున్నారు. జగిత్యాల డీఎఫ్‌వో రవిప్రసాద్, సిరిసిల్ల డీఎఫ్‌వో బాలమణి నేతృత్వంలో రెస్క్యూ టీమ్‌లు హైదరాబాద్, నిజామాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నాయి. అయితే, కొందరు కిందిస్థాయి అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పులి కదలికలపై గోప్యత పాటిస్తూ, ప్రజలను పూర్తిస్థాయిలో అప్రమత్తం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రజలకు అధికారుల సూచనలు
– రాత్రి వేళల్లో పశువుల కాపరులు, రైతులు ఒంటరిగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లరాదు.
– పులి కదలికలు గమనించినా, పాదముద్రలు కనిపించినా వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలి.
– అటవీ పరిసరాల్లో పెద్దపెద్ద శబ్దాలు చేయడం, టపాసులు పేల్చడం, గుంపులుగా వెళ్లడం చేయకూడదు.
– వన్యప్రాణి రక్షణ చట్టం-1972 ప్రకారం.. పులికి హాని కలిగించేలా కరెంట్ తీగలు, ఉచ్చులు, వలలు ఏర్పాటు చేస్తే కఠినమైన క్రిమినల్ చర్యలు తప్పవు.
పులి జాడ కోసం రెస్క్యూ టీం : జగిత్యాల డిఎఫ్ఓ రవిప్రసాద్
పులి జాడ కోసం రెస్క్యూటీం వెతుకుతోంది. గంగారం తండాలో ఆవులు నష్టపోయిన రైతులకు తక్షణ సాయం కింద రూ.5వేలు ఇచ్చాం. మిగతా వెటర్నరీ వైద్యుల అంచనాతో మిగతా పరిహారమూ ఇస్తాం. ఇప్పటివరకు పులి పశువులపైనే దాడులు చేసింది. అయినప్పటికీ మా శాఖ అధికారులు దాని జాడ కోసం గాలిస్తున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒంటరిగా ఎవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దు.
అదిగో పులి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



