Thursday, March 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసత్యదూరం అవాస్తవాలు

సత్యదూరం అవాస్తవాలు

- Advertisement -

– గవర్నర్‌ ప్రసంగాన్ని తిరస్కరిస్తున్నాం : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సత్యదూరం, అవాస్తవాలతో ఉన్న గవర్నర్‌ ప్రసంగాన్ని తిరస్కరిస్తున్నామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం శాసనమండలిలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్త సౌకర్యాల కల్పన చేయకపోగా, కాంగ్రెస్‌ సర్కారు ఉన్న సౌకర్యాలను తొలగిస్తున్నదనీ, ప్రజాపాలన పేరు చెబుతూ గ్రంథాలయాల్లో దూరి విద్యార్థులపై దమనకాండ చేస్తున్నదని ఆయన విమర్శించారు. తెలంగాణ వెలగడం లేదనీ, ఏడుస్తోందనీ, రక్తమోడుతోందని అన్నారు. కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్‌ మానవీయ పథకాలను కూడా కాంగ్రెస్‌ ఆపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భావదారిద్య్రంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేశారని తప్పుపట్టారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలు గురించి మాట్లాడకుండా 2034, 2047 నాటికి లక్ష్యమంటూ చెప్పడం ఐదేండ్లు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మభ్యపెట్టిందని విమర్శించారు. వికసిత భారత్‌ను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యతిరేకిస్తుంటే, గవర్నర్‌ ప్రసంగంలో వికసిత్‌ భారత్‌ ప్రేరణతో తెలంగాణ రైజింగ్‌ అంటూ వైరుధ్యం కనబరిచారని తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందనీ, అభివృద్ధిని హైదరాబాద్‌కే పరిమితం చేయాలనే ఆలోచనలు చేస్తున్నారనీ, ప్రభుత్వ ఆలోచనలన్ని భూమి చుట్టే తిరుగుతున్నాయనీ, కోర్టులు మొట్టికాయలు వేసిందన్నారు. వెలుగుమెట్లలోనూ పేదల భూములపై ప్రభుత్వం కన్నేసిందని విమర్శించారు. మూసీ పునర్జీవం ద్వారా 2.5 టీఎంసీల నీటిని గోదావరి నుంచి తెస్తామంటూ ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరం, మల్లన్నసాగర్‌ పదాలను ఉపయోగించలేదన్నారు. తెలంగాణను ధ్వంసం చేసిన సమైక్య పాలనలోని ముఖ్యమంత్రులను పొగుడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రిగా 24 గంటల కరెంట్‌ ఇచ్చిన కేసీఆర్‌ ను సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శిస్తున్నారని తెలిపారు. గద్దర్‌ గుండెల్లో గుండు దింపి, బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపి, చెరువులను ధ్వంసం చేసిన టీడీపీని గొప్ప పార్టీ అంటూ రేవంత్‌ రెడ్డి పొగుడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరంపరగా వచ్చినవే : జూపల్లి కృష్ణారావు
గతం నుంచి పరంపరగా వచ్చిన సమస్యల వల్లే తమ ప్రభుత్వంలో అక్కడక్కడా ఒకట్రెండు ఘటనలు జరిగాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగార్జునసాగర్‌ నిర్మాణంలో జరగలేదా? అని ఆయన ప్రశ్నించారు. అందరికి మేలు చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. తాను పాండిత్యాన్ని గౌరవిస్తాననీ, అలాగనీ మంత్రాలు చదివితే సమస్యలు పరిష్కారం కావని వ్యాఖ్యానించారు. అన్ని విషయాలు ఆర్థికంగా ముడిపడి ఉంటాయనీ, రాష్ట్ర ప్రభుత్వం రూ.70 వేల కోట్ల ఈఎంఐలు చెల్లిస్తున్నదని తెలిపారు.

పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి :తుమ్మల నాగేశ్వరరావు
వెలుగుమట్ల ఘటనపై పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌కు బదులిచ్చారు. కోర్టు ఆదేశాల మేరకే అక్కడ ఆ ఘటన జరిగిందని తెలిపారు. 70 లక్షల మంది రైతులకు ఒకేసారి రైతు భరోసా అందజేయబోతున్నట్టు తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆపేసిన రైతుభరోసాను కూడా కాంగ్రెస్‌ సర్కారు అందజేసిందని ఆయన గుర్తుచేశారు.

జోక్యం చేసుకోవద్దు :డిప్యూటీ చైర్మెన్‌ బండా ప్రకాశ్‌
దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్‌, డాక్టర్‌ బల్మూర్‌ వెంకట్‌ పదే పదే లేచి అడ్డు తగిలారు. గద్దర్‌, సిధారెడ్డి రాసిన పాటలతో పాటు తాను పాడిన మరో పాటను దేశపతి శ్రీనివాస్‌ సభలో పాడారు. ఆ సమయంలో దయాకర్‌, వెంకట్‌ లేచి అభ్యంతరం తెలిపారు. దీంతో డిప్యూటీ చైర్మెన్‌ బండా ప్రకాశ్‌ వారిని వారించారు. ఇతర సభ్యులు ఏం మాట్లాడాలో నిర్ణయించడానికి వీల్లేదని చెప్పారు. సభ్యులు మాట్లాడే సమయంలో మధ్యలో జోక్యం చేసుకోవద్దని సూచించారు. సభ్యులెవరైనా సరే వారి సమయం వచ్చినప్పుడు మాట్లాడాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -