ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం కన్వీనర్ అక్కెనపల్లి మీనయ్య
ఆమె స్ఫూర్తిని కొనసాగించేందుకే సేవా కార్యక్రమాలు
ఎంవీఎన్ ట్రస్ట్ సేవలను వినియోగించుకోవాలి : డాక్టర్ మల్లు అరుణ్ రెడ్డి
నవతెలంగాణ – నల్లగొండ టౌన్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం జీవితం అందరికీ ఆదర్శనీయమని, ఆమె పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం కన్వీనర్ అక్కెనపల్లి మీనయ్య అన్నారు. మల్లు స్వరాజ్యం 4వ వర్ధంతి సందర్భంగా ఆమె మనవడు, ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ మల్లు అరుణ్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సత్యవతి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి సహకారంతో సూర్యాపేట జిల్లాకు చెందిన జుట్టుకొండ వీరయ్యకు ఉచిత మోకాలు చిప్ప మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీనయ్య మాట్లాడుతూ.. మల్లు స్వరాజ్యం జీవితమంతా త్యాగాలమయమని, జీవితాంతం నిరుపేదల అభ్యున్నతి కోసం పరితపించారని గుర్తు చేశారు. ప్రతి యేటా ఆమె వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఉచిత మోకాలు మార్పిడి ఆపరేషన్‌ను పేదలు వినియోగించుకోవాలని కోరారు.
డాక్టర్ మల్లు అరుణ్‌రెడ్డి మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం తన జీవితాన్ని అట్టడుగు వర్గాల కోసం ధారపోసిన గొప్ప వనిత అన్నారు. మహిళా హక్కులు, ప్రజల హక్కులు, పేదల భూముల కోసం చివరి వరకు జీవించారని గుర్తుచేశారు. ఆమె పేరుతో ప్రతి యేటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గొప్ప వ్యక్తుల స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని భావిస్తున్నామన్నారు. ఇందుకు సంపూర్ణ సహకారం అందిస్తున్న సత్యవతి ఆస్పత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సత్యావతి ఆస్పత్రి ఎండి డాక్టర్ రాంమనోహర్ మాట్లాడుతూ స్వరాజ్యం స్ఫూర్తిగా సేవా కార్యక్రమాలు చేయడం సంతోషకరమన్నారు. అందులో తమ ఆస్పత్రి భాగస్వామ్యం కావడం ఇంకా సంతోషంగా ఉన్నదన్నారు. ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం కార్యనిర్వాహక కార్యదర్శి పి.నర్సిరెడ్డి మాట్లాడుతూ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రతినెలా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. డాక్టర్ అరుణ్‌రెడ్డి, సత్యవతి ఆస్పత్రి యాజమాన్యానికి ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చైతన్య, డాక్టర్ సంపద, సత్యవతి వైద్యశాల ఎండీ సత్యనారాయణ, కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఫ్యాకల్టీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



