రక్తపోటును తగ్గించే ప్రత్యేక పెప్టైడ్ అభివృద్ధి
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
ఉస్మానియా విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ సైన్స్, సూక్ష్మ జీవశాస్త్ర (మైక్రో బయాలజీ) విభాగానికి చెందిన ప్రొఫెసర్ సందీప్త బూర్గుల భారత్ పేటెంట్ సాధించారు. పరిశోధనలో భాగంగా రక్తపోటును తగ్గించే ప్రత్యేక పెప్టైడ్‌ను అభివృద్ధి చేశారు. ఈ మేరకు బుధవారం భారత్ పేటెంట్ వారు ఆమెకు ఆ పత్రాలు ప్రదానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత మరణాలకు ప్రధాన కారణాల్లో హైపర్‌టెన్షన్ (రక్తపోటు) ముఖ్యమైనది కావడంతో, సహజ వనరుల ఆధారంగా సురక్షితమైన చికిత్సామార్గాలపై ఆమె పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో చేపల మాంసంలో ఉన్న ఎంజైమ్‌లను సేకరించి ప్రయోగశాలలో ప్రత్యేక పెప్టైడ్‌ను అభివృద్ధి చేసి పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు. ఈ మేరకు బుధవారం పేటెంట్ ప్రదానం చేశారు. ప్రొఫెసర్ సందీప్త పరిశోధన బృందంలో పీహెచ్డీ విద్యార్థిని ఉషారాణి కేశపాగ, డాక్టర్ గులాం హుస్సేన్, డాక్టర్ రఘు గొగడ సభ్యులుగా ఉన్నారు. హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ పెప్టైడ్ రక్తపోటును గణనీయంగా తగ్గించినట్టు వారు వెల్లడించారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న యాంటీ-హైపర్టెన్సివ్ మందుల వల్ల పలు దుష్ప్రభావాలు ఉండటంతో సహజ వనరుల నుంచి సురక్షితమైన ప్రత్యామ్నాయాల కోసం పరిశోధనలు అవసరమవుతున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. కొత్తగా అభివృద్ధి చేసిన పెప్టైడ్ సాధారణంగా వాడే మందులతో సమానంగా ప్రభావం చూపినట్టు తెలిపారు.
ఈ ఆవిష్కరణ భవిష్యత్‌లో వైద్య రంగంలో ప్రీ-క్లినికల్ దశకు తీసుకెళ్లేందుకు తమ బృందం కృషి చేస్తుందని ప్రొఫెసర్ సందీప్త బూర్గుల తెలిపారు. ఆ పెప్టైడ్ పై లోతైన పరిశోధనలు జరపడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిధుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్టు చెప్పారు. ఇది ఒక ప్రయోగాత్మక పరిశోధన అన్నారు. ఈ పేటెంట్‌తో ఓయూ మరోసారి పరిశోధన రంగంలో తన ప్రతిభను చాటుకుంది. గత సంవత్సరం ప్రొఫెసర్ సందీప్త తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ అధ్యాపకురాలిగా, మలేషియాలో మణిపాల్ యూనివర్సిటీ కాన్ఫరెన్స్‌లో విమెన్ ఇన్నోవేటర్ అవార్డులందుకున్నారు. పేటెంట్ పొందిన ప్రొఫెసర్‌కు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఓయూ ప్రొఫెసర్ సందీప్త బూర్గులకు భారత్ పేటెంట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



