– ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మహలక్ష్మి పథకం ద్వారా 2023 డిసెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు ఆర్టీసీలో 279.97 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం శాసనమండలిలో విజయశాంతి, అద్దంకి దయాకర్, నెల్లికంటి సత్యం, తీన్మార్ మల్లన్న, నవీన్‌కుమార్ అడిగిన ప్రశ్నలకు అయన సమాధానం చెప్పారు. ఈ పథకం కింద 2024-25లో రూ.3866.30 కోట్లు, 2025-26 ఫిబ్రవరి వరకు రూ.2913.82 కోట్లను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 69 శాతం ఉన్న ఆక్యుపెన్సీ రేటు 98 శాతానికి పెరిగిందని గుర్తు చేశారు. ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు కొట్లాడుకుంటున్నట్టు సోషల్ మీడియాలో అవమానపర్చే విధంగా చిత్రీకరిస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం వల్ల ఆటో డ్రైవర్లకు జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గత పదేండ్లుగా ఆర్టీసీలో ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లల్లో 3,038 ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2,708 నూతన బస్సులు కొనుగోలు చేశామన్నారు. అలాగే కొత్త రూట్ కనెక్టివిటీని అందిస్తున్నామని చెప్పారు. 600 బస్సులకు మహిళలను యజమానులను చేశామమని గుర్తు చేశారు. 1,132 కారుణ్య నియామకాలు చేపట్టామని మంత్రి తెలిపారు. జిల్లా కేంద్రాల్లో ఒక్కొక్కటి చొప్పున 37 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలకు 100 శాతం పన్ను మినహాయింపులు ఇవ్వడం జరుగుతుందన్నారు. స్క్రాపింగ్‌ను ప్రోత్సహించడానికి లయబిలిటీల మాఫీ, పన్ను రాయితీలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
ఆర్టీసీలో 279 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



