Friday, March 20, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి'వీబీజీరామ్‌జీ'తో కూలీల అవస్తలు

‘వీబీజీరామ్‌జీ’తో కూలీల అవస్తలు

- Advertisement -

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెల్టూరు గ్రామంలో ఉపాధి కూలీ జయమ్మ ఐదు రోజులుగా కంటిపాపల (ఐరీస్‌ ఫొటో) రాక ఐదు రోజుల కూలి పోయింది. ఏటిగడ్డసంగంలో నాగమణి అనే కూలీ ఎండలో తమ హాజరు నమోదుకోసం ఎదురుచూసి కళ్లు తిరిగి పడిపోయింది. మరో చోటా కాలికి దెబ్బతగిలితే అందుబాటులో ఉండే మెడికల్‌ కిట్‌ లేక నెత్తురోడిన కాళ్లతో పనిచేస్తున్న కూలీ కనిపించాడు. ఇలా ఏ ఊరిలో చూసిన కూలీల బాధలు, వారు పడుతున్న గోసలు వర్ణణాతీతం. కూలీల పొట్టగొట్టే విధంగా తీసుకువచ్చిన ”విబిజీ రామ్‌ జీ” చట్టం అమలుతీరుపై సంగారెడ్డి జిల్లాలోని కూలీల వద్దకు వెళ్లగా అనేక విషయాలు బయటకొచ్చాయి. గతంలో కొలతల ప్రకారం ఉదయం వచ్చి కూలీలు పని చేసుకునే వారు. ఇప్పుడు ఉదయం ఫేస్‌ అటెండెన్స్‌ ఇవ్యాలి, మళ్లీ తిరిగి సాయంత్రం 4 గంటలకు హాజరు ఇవ్వాలి.

ఇది కూలీలకు ఎలా సాధ్యం? ‘పొమ్మనలేక పొగబెట్టినట్టు’ కూలీల పట్ల మోడీ కపట ప్రేమ ఏమిటో దీన్నిబట్టే అర్థమవుతుంది. కూలీ పనికంటే హాజరు వేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అనేక ప్రాంతాల్లో సిగ్న‌ల్‌ రాక కూలీలు గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి ఉంది. గతంలో తాగటానికి కనీసం మంచినీళ్లు ఇచ్చేవారు. ప్రస్తుతం అది కూడా లేదు. ఎండలు బాగా ఉండటంతో వెంట తీసుకొని పోయిన ఒక్క వాటర్‌ బాటిల్‌ అయిపోతే ఇక అంతే సంగతి. గత రెండు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎవరికీ చెప్పాలో కూలీలకు అర్ధం కాని పరిస్థితి. అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదు. గతంలో కూలీలకు వారం వారం పేమెంట్‌ వచ్చేది. ఇపుడు రెండు నెలలైనా పేమెంట్‌ రాలేదు. ఎందుకని నిలదిస్తే ‘ఉపాధి చట్టం మారింది. పైనుండి డబ్బులు రాలేదు’ అనే సమాధానం ఇపుడు అధికారుల నుంచి మెల్లగా వస్తోంది.

వామపక్షాలు, వ్యవసాయ కార్మిక సంఘం పోరాటం ఫలితంగా 2005లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంఎన్‌ఆర్‌ఈజిఎ)ను అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశంలో దీనిపై ఆధారపడి 30 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు. గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగ యువత ఈ చట్టం ద్వారా కనీస ఉపాధి పొందుతూ తమ జీవితాలను నిలబెట్టుకుంటున్నారు. కరోనా కాలంలో అత్యధిక మంది పట్టణాల నుంచి వలసొచ్చి బతికినది ఈ పథకం పైనే. ఉపాధిహామీ పథకానికి గతంలో కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులను కేటాయించేది. ఈ పథకంలో ఎవరైనా కూలీ తను పనికావాలని అడిగిన 15 రోజులలో కూలి ఇవ్వాలి. ఇవ్వనిచో వేతనంతో సహా డబ్బులు అతనికి చెల్లించాలని మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంలో ఉన్నది.

కొత్త చట్టంలో ఇవేమీ లేవు. ప్రభుత్వం దయాదాక్షిణ్యంపై బతకాలి.కానీ నేడు మోడీ ప్రభుత్వం పేదల నోటికాడి ముద్దను లాగేయ్యడానికి ఉపాధి చట్టానికి నిధులను 90 శాతం నుండి 60 శాతానికి తగ్గించింది. చట్టం పేరు మార్చింది. రాష్ట్రాలపై 40శాతం భారం మోపింది. గ్రామీణ ఉపాధి హామీ పేదల పనికి తూట్లు పొడుస్తోంది. పేదలకు అన్యాయం చేసే ఈ చట్టానికి ”విబి జీ రాంజీ” అని పేరు పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో 40లక్షల మంది కూలీలు దీనిపై ఆధారపడి ఉన్నారు. అత్యధిక మంది ఇబ్బందులు పడుతున్నారు. అనేక మందికి జాబ్‌కార్డ్సు పోయాయి. జాబ్‌కార్డులు కొత్తగా ఇవ్వడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులను సాధించుకోవాలి, కూలీ దినాలు కల్పించాలి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రతి కూలీకి రోజుకు రూ.600 కనీస కూలి చెల్లించేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జాబ్‌కార్డుపై 200 రోజులు పనివ్వాలి. పని ప్రదేశాల్లో టెంట్స్‌, మెడికల్‌ కిట్స్‌, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలి.

వారం వారం కూలీ డబ్బులు చెల్లించాలి. పని ముట్లు ఇవ్వాలి. అనేక గ్రామాలలో ఉదయం 7 గంటల నుండి ఉపాధి కూలీ దగ్గర ఫొటోలు దిగడం కోసం గంటల తరబడి టైం కేటాయించాల్సి వస్తోంది. ఏడు గంటల తర్వాత తిరిగి నాలుగు గంటలకు అటెండెన్స్‌ వేసుకోవడం కోసం మరికొన్ని గంటలు కేటాయించాల్సి వస్తోంది. పనికంటే ఫోటోలు దిగడానికే ఎక్కువ టైం పడుతోంది. ‘ఫొటో రాలేదు.. మా కూలి వస్తుందో రాదో’ అనే ఆందోళన అమాయకమైన కూలీల్లో కనబడుతోంది. ఫొటో కోసం గంటల తరబడి వేచి చూసి ఎర్రటి ఎండలో సొమ్మసిల్లి పడిపోతున్న పరిస్థితి నెలకొంది. ఎండలో కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదు. కిలోమీటర్ల దూరం వెళ్లినా నీళ్లు అందుబాటులో ఉండటం లేదు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఉపాధి కూలీలు ఇవే అవస్తలు ఎదుర్కొంటున్నారు. కనీస వసతులు కల్పించేందుకు కూడా కేంద్రం సిద్ధపడటం లేదు. అందుకే పేదల పొట్టకొట్టే విబి జీ రామ్‌ జీ పథకాన్ని రద్దు చేయాలి. రోజుకు ఉపాధి కూలీలకు రూ.800 పెంచి, రెండు వందల రోజుల పని కల్పించాలి. ఫొటో క్యాప్చర్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి.

గొల్లపల్లి జయరాజు 9490098706

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -