ప్రపంచీకరణ యుగంలో దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే ముఖ్యమైన సాధనాలుగా మారాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక శక్తుల్లో ఒకటైన అమెరికా, అభివృద్ధి చెందుతున్న పెద్ద మార్కెట్ భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు గత రెండు దశాబ్దాలుగా వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలు తమ మధ్య వాణిజ్యాన్ని విస్తరించడానికి ట్రేడ్ డీల్ వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని అభివృద్ధికి మార్గంగా చిత్రీకరిస్తున్నప్పటికీ, ఆర్థిక నిపుణులు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు మాత్రం దీని ప్రభావాలపై తీవ్రఆందోళన చెందుతున్నాయి, అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.ఈ ట్రేడ్ డీల్ కేవలం రెండు దేశాల మధ్య వస్తువుల మార్పిడి ఒప్పందం మాత్రమే కాదు. ఇది వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగాలు, ధరలు, పెట్టుబడులు, సాంకేతికత వంటి అనేక రంగాలపై ప్రభావం చూపగల సామర్థ్యం కలిగి ఉంది. ముఖ్యంగా పేద ప్రజలు, రైతులు, మధ్యతరగతి ఉద్యోగులు, కార్మికులు, అసంఘటిత రంగం, ఎంఎస్‌ఎంఇలు, నిరుద్యోగుల జీవన పరిస్థితులను ఇది ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
ట్రేడ్ డీల్ ప్రాథమిక లక్ష్యం రెండు దేశాల మధ్య దిగుమతి సుంకాలను తగ్గించడం, మార్కెట్లను పరస్పరం తెరవడం, పెట్టుబడులను పెంచడం. ఇది దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పబడుతుంది. కానీ వాస్తవంలో ఇది దేశాల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలను మరింత పెంచే ప్రమాదం కూడా కలిగి ఉంటుంది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య పోటీ సమాన స్థాయిలో ఉండదు. అమెరికాలో భారీ యంత్రాల వ్యవసాయం, పెద్ద పెట్టుబడులు, భారీ సబ్సిడీలు ఉంటాయి. భారతదేశంలో మాత్రం చిన్న రైతులు, చిన్న పరిశ్రమలు, పరిమిత మూలధనం ప్రధాన లక్షణాలు. ఈ పరిస్థితుల్లో మార్కెట్లు పూర్తిగా తెరవబడితే బలమైన ఆర్థిక వ్యవస్థలు బలహీనమైన వ్యవస్థలను అధిగమించే ప్రమాదం ఉంటుంది. వ్యవసాయ రంగం భారత దేశంలో అత్యంత కీలకమైనది. కోట్లాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు తమ జీవనాధారాన్ని వ్యవసాయం మీదే ఆధారపడి కొనసాగిస్తున్నారు.
అమెరికా వ్యవసాయం అధునాతన యంత్రాలు, సాంకేతికత, భారీ ప్రభుత్వ సబ్సిడీలతో పనిచేస్తుంది. భారత రైతులు మాత్రం చిన్న భూములు, అధిక ఉత్పత్తి ఖర్చులు, మార్కెట్ అనిశ్చితి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి చౌకైన వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్‌లోకి ప్రవేశిస్తే దేశీయ రైతులు తీవ్రమైన పోటీని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు పెరిగితే భారత రైతులకు లభించే ధరలు పడిపోవచ్చు. మార్కెట్ ధరలు తగ్గడం వల్ల రైతుల ఆదాయం తగ్గే ప్రమాదం ఉంటుంది. రైతుల ఆదాయం తగ్గడం అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతినడం. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న చిన్న వ్యాపారాలు, సేవలు అన్నీ వ్యవసాయ ఆదాయంపై ఆధారపడి ఉంటాయి.ఇక కార్మిక రంగాన్ని పరిశీలిస్తే, ట్రేడ్ డీల్‌లు సాధారణంగా కార్మిక మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతాయి. అంతర్జాతీయ పోటీని ఎదుర్కొనేందుకు కంపెనీలు ఉత్పత్తి ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తాయి. దీనివల్ల కార్మికుల వేతనాలపై ఒత్తిడి పెరుగుతుంది. కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెరుగుతాయి. కార్మిక హక్కులు బలహీనపడే అవకాశం ఉంది.
భారతదేశంలో ఇప్పటికే కార్మికుల్లో సుమారు తొంభై శాతం మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. చిన్న పరిశ్రమలు మూతపడితే లేదా ఉత్పత్తి తగ్గితే ఈ కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి నిరుద్యోగాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. ఎంఎస్‌ఎంఇలు అంటే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివి. దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్న ఈ పరిశ్రమలు కోట్లాది ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. కానీ, ఈ ట్రేడ్‌డీల్‌ల వల్ల అంతర్జాతీయ కంపెనీలు భారత మార్కెట్‌లోకి సులభంగా ప్రవేశించగలుగుతాయి. భారీ మూల ధనం, ఆధునిక సాంకేతికతతో వచ్చే ఈ కంపెనీలతో చిన్న పరిశ్రమలు పోటీ చేయడం కష్టం.దీంతో చిన్న పరిశ్రమలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఎంఎస్‌ఎంఇ రంగం బలహీనపడితే ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎందుకంటే పెద్ద కంపెనీల కంటే చిన్న పరిశ్రమలు సృష్టించే ఉద్యోగాలే ఎక్కువ.
ఇక పరిశ్రమల రంగాన్ని పరిశీలిస్తే, ఈ ట్రేడ్ డీల్ కొంతవరకు ఎగుమతులకు అవకాశాలు కల్పిస్తాయి. టెక్స్‌టైల్స్, ఫార్మాస్యూటికల్స్, లెదర్ వంటి రంగాలు విదేశీ మార్కెట్లలో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో దేశీయ మార్కెట్‌లో విదేశీ కంపెనీల పోటీ కూడా పెరుగుతుంది. దీని వల్ల స్థానిక పరిశ్రమలు ఒత్తిడిని ఎదుర్కొంటాయి. మధ్యతరగతి ప్రజలపై ఈ ట్రేడ్ డీల్ ప్రభావం ద్వంద్వ స్వభావం కలిగి ఉంటుంది. కొన్ని వస్తువులు చౌకగా లభించవచ్చు. కానీ, అంతర్జాతీయ మార్కెట్లపై అధికంగా ఆధారపడటం వల్ల ధరలు అస్థిరంగా మారే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే దేశీయ మార్కెట్‌లో కూడా ధరలు పెరుగుతాయి. నిరుద్యోగ సమస్య ఇప్పటికే భారతదేశంలో తీవ్రమైనది. ప్రతి సంవత్సరం లక్షలాది యువకులు ఉద్యోగాల కోసం మార్కెట్‌లోకి వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చిన్న పరిశ్రమలు మూతపడితే నిరుద్యోగం మరింత పెరిగే ప్రమాదం ఉంది.
కొంతమంది వాదన ప్రకారం ట్రేడ్ డీల్ వల్ల కొత్త పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు పెరుగుతాయి. కానీ వాస్తవంలో ఉద్యోగాలు సృష్టించే సామర్థ్యం పెద్ద కంపెనీల కంటే చిన్న పరిశ్రమలకే ఎక్కువగా ఉంటుంది. ఇక జియోపాలిటికల్ కోణం కూడా ఈ ట్రేడ్ డీల్ వెనుక ఉంది. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా-చైనా పోటీ పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశాన్ని ఒక వ్యూహాత్మక భాగస్వామిగా అమెరి కా చూస్తోంది. సరఫరా గొలుసులను చైనా నుంచి ఇతర దేశాలకు మార్చే ప్రయత్నంలో భారతదేశం కీలకపాత్ర పోషించగలదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రేడ్ డీల్‌ను కేవలం ఆర్థిక ఒప్పందంగా కాకుండా ఒక వ్యూహాత్మక భాగస్వా మ్యంగా కూడా చూడాలి. అయితే ఈ భాగస్వామ్యం భారతదేశం దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాలి. అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ ఒక ద్వంద్వ స్వభావం కలిగిన ఆర్థిక ఒప్పందం. ఒకవైపు ఇది ఎగుమతులు, పెట్టుబడులు, సాంకేతిక సహకారానికి అవకాశాలు కల్పించవచ్చు.
మరోవైపు రైతులు, చిన్న పరిశ్రమలు, కార్మికులు వంటి బలహీన వర్గాలపై ఒత్తిడిని పెంచే ప్రమాదం కూడా ఉంది.అందువల్ల ఈ ఒప్పందాన్ని అమలు చేసే సమయంలో ప్రభుత్వం దేశీయ వ్యవసాయం, ఎంఎస్‌ఎంఇలు, కార్మికులను రక్షించే విధానాలను రూపొందించడం అత్యంత అవసరం. లేకపోతే ఈ ట్రేడ్ డీల్ వల్ల ఆర్థిక అసమానతలు మరింత పెరిగి సామాజిక సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. చివరగా వాణిజ్య ఒప్పందాలు అభివృద్ధికి సాధనాలు కావచ్చు. కానీ, అవి దేశ ప్రజల జీవనోపాధిని కాపాడే విధంగా ఉండాలి. రైతులు, కార్మికులు, చిన్న పరిశ్రమలు బలంగా ఉన్నప్పుడే ఆర్థిక అభివృద్ధి స్థిరంగా ఉంటుంది. లేదంటే ట్రేడ్ డీల్‌లు కొంతమందికి మాత్రమే లాభం చేకూర్చి పెద్ద సంఖ్యలో ప్రజలను సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ ట్రేడ్ డీల్‌ను ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు, మధ్య తరగతి ఉద్యోగులు, అందరూ అర్ధం చేసుకోవాలి. రాబోయే ప్రమాదాన్ని గుర్తించి కేంద్రం చేసుకున్న ఈ దుర్మార్గమైన ట్రేడ్‌డీల్‌ను వెనక్కు తీసుకునేదాకా పోరాటాలకు సన్నద్ధమవ్వాలి.
ఎస్‌ఎస్‌ఆర్‌ఎ ప్రసాద్ 9490300867



