బ్రహ్మదేవునికి మన పర తేడాలేముంటాయి?! ట్రంప్ మహాశయుని నుదట ‘నోబెల్’ అనే మూడక్షరాలు రాసిపడేసి వుంటే ఈ పాటికి ఇరాన్‌లోనేమిటి, సమస్త భూమండలంలో దీపావళి పండుగ జేసుకుంటూండే వాడే! పహల్గాం ఘటన తర్వాత కత్తులు దూసిన భారత్, పాక్ సేనలను తానే అదుపు చేశానన్న ఆనందంలో నోబెల్ శాంతి బహుమతి రక్తపిపాసులక్కూడా ఇస్తారన్న పైత్యం ప్రకోపించి ”ప్రాణాలు కాపాడటం అంటే నాకు చాలాఇష్టం. ప్రాణాలు కాపాడుతుంటే చివరికి ఒక శాంతిమయ ప్రపంచంలో మనముంటామని మీరు అర్థం చేసుకోండి” ప్రపంచ ప్రజలకు ట్రంపోపాఖ్యానమది!
ట్రంప్ ముఠా చేతులు రక్తమోడుతున్నాయి. ఒక 2025లోనే వెయ్యిమంది ట్రంప్ సైన్యం చేతిలో హతమైనట్టు లెక్కలున్నాయి. రాయిటర్ సర్వేలో నలభైశాతం మంది అమెరికన్ పౌరులు ఈ ”శాంతి దూత” తమకెక్కడ దొరికాడురా అని నెత్తి బాదుకుంటున్నారు. రాజుల కోసం, రాజ్యాల కోసం నాటి కురుక్షేత్ర యుద్ధం జరిగితే, పెట్టుబడిదార్ల కోసం, వారి లాభాల కోసం నేటి చమురు క్షేత్ర యుద్ధం వారి కాపలాకుక్కలు చేస్తున్నాయి. అన్నింటిలో బలయ్యేది సామా న్యులే! యుద్ధాల్లో మంచి, చెడుల్లేవు. దాన్ని గ్రహించిన అనేకులు, అమెరికాతో సహా, అనేక దేశాల్లో యుద్ధాల్లో తాము పాల్గొనం అని చేస్తున్న జనాగ్రహం పెచ్చరిల్లుతోంది.
ఒక స్వతంత్ర దేశాధిపతిని ఆయన భార్యతో సహా ఈడ్చికెళ్లి తమ దేశంలో విచారణ జరపడం, మరో స్వతంత్ర దేశం ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించి అధినేతను అంతం చేయడం, వెనిజులా నుండి చౌకగా పెట్రోలియం ఉత్పత్తులు అందుకునే క్యూబా గొంతు నులిమేందుకు ప్రయత్నించడం, ప్రపంచానికి సోషలిస్టు ప్రత్యామ్నాయాన్ని అందకుండా చేయడం ఇదొక ‘త్రిముఖ వ్యూహం’. ఒకదానికొకటి అంతఃసంబంధమున్న అంశాలివి. ఇది ట్రంపోన్మాదమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చరిత్ర పుటల్ని తిప్పిచూస్తే సరిగ్గా 200 ఏండ్ల క్రితం, 1823 నాటి అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మన్రో అమెరికావైపు తిరిగి చూడకుండా మిగిలిన ఐరోపా దేశాలకు ఇచ్చిన వార్నింగది! తొండముదిరి ఊసరవెల్లి అయినట్లు, నేడు దీన్నే ‘హైపర్ ఇంపీరియలిజం’ అని విజయ ప్రసాద్ వంటి మేధావులంటున్నారు.
అత్యంత అరుదైన (రేర్) ఎర్త్‌ఎలిమెంట్స్ పుష్కలంగా వున్న నెదర్‌ల్యాండ్స్ అధీనంలోని గ్రీన్‌ల్యాండ్‌పై దాడి చేస్తానన్న ప్రకటన, తన పొరుగునే ఉన్న కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా చేసుకుంటానన్న ప్రకటన ఒకటి నాటి నాటో దేశంపై యుద్ధం చేస్తాననడం, మరొకటి మొట్టమొదటి ఫ్రీట్రేడ్ ఒప్పందాన్ని (నాఫ్తా) నార్త్ అట్లాంటిక్ ఫ్రీ ట్రేడ్‌ను కాలరాయడం ట్రంప్ వేస్తున్న సుంకాలు పెట్టుబడిదారీ విధాన స్వేచ్ఛా వాణిజ్య సూత్రాలకే భిన్నమైనవి. వాస్తవానికి ప్రపంచీకరణ ఉందా? చచ్చిందా? అన్న సందేహం అనేక మందికి వస్తోంది! వాస్తవానికి, నేటి అమెరికన్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో నుండే ట్రంప్ నేతృత్వం వచ్చింది. అతని విధానాలొచ్చాయి. తమదేశ సార్వభౌమత్వాన్ని నిలదొక్కుకోవాలనుకునే ఇరాన్ లాంటి మత రాజ్యమైనా, బొలివేరియన్ విప్లవ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న వెనిజులా లాంటి దేశాలైనా, చైనా, క్యూబా వంటి సోషలిస్టు దేశాలైన ఈ భూమండలంలో లేకుండా చేయాలనేది అమెరికా పన్నాగం.
ఈ విషయాన్నే మొన్న మ్యూనిచ్‌లో జరిగిన (తమ) భద్రతాసభలో అమెరికా విదేశాంగ మంత్రి మర్కోరూబియో ”మనం రెండవ కొలంబస్‌యుగంలోకి ప్రవేశించాలి” అన్నాడు. తమ శత్రువులు పశ్చిమదేశాల సాంస్కృతిక వారసత్వాన్ని ధ్వంసం చేస్తున్నాయన్నాడు. భగవంతుడ్ని తిరస్కరించే కమ్యూనిస్టులవల్లనూ, వలస వ్యతిరేక పోరాటాల వల్లనూ సుత్తీ కొడవలున్న ఎర్ర దుప్పటి కప్పేస్తున్నాయని వాపోయాడు. తమ సార్వభౌమత్వాన్ని నిలదొక్కుకునే వారు, తమకు ఎదురుతిరిగేవారు, ఆ ‘రోగాన్ని’ ఇతరులకు అంటించే వారు ప్రమాదకారులన్నాడు. ఖండాంతర వాసెవడో, మరో ఖండాంతర వాసిని కిడ్నాప్ చేస్తే మనకేమి? గ్రహాంతరాల్లో నుండి మరొకడ్ని ముక్కలు చేస్తే మనకేమి? అనుకునేవారు మన దేశంలో పుష్కలంగా ఉన్నారు!
నేడు యుద్ధం మన వంటింట్లోకి వచ్చింది. రోడ్డు పక్కన ఇడ్లీలమ్ముకునే బండిపై బాంబులు పడ్తున్నాయి. స్విగ్గీ, జొమాటో సరఫరాదారుల ఉపాధిపై ప్రభావం పడింది. రూపాయి బిళ్ల దొల్లుకుంటూ కిందికిపోతూనే ఉంది. పెరిగే ధరలకు అడ్డుకట్ట వేసే మార్గాలు మోడీ దగ్గరున్నాయా? చౌకగా దొరికే ఇరాన్, రష్యా చమురును మన దేశం ఎందుకు తగ్గించుకుందో మోడీ సర్కారు సమాధానం చెప్తుందా? చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు కుదేలు ఎందుకవుతున్నాయో చెప్పగలదా ఈ ప్రభుత్వం? కోట్లాదిమందికి ఉపాధి పోతూంటే అడ్డుకోగలదా? పొంచి వున్న ఎరువుల సంక్షోభం మాటేంటి సార్? ఈ సర్కార్ ఫాసిస్టు పద్ధతులకు ఒడిగడ్తే సినారే మాటలే మనకి బాట!
”అరుణోదయం ఊరుకోదు, కిరణాలను సారించనిదే!
వసంతోదయం ఊరుకోదు, పరిమళాలను పారించనిదే!…
…ప్రతిఘటించే మనసు ఊరుకోదు
ప్రశ్నలను ఎక్కుపెట్టనిదే!”
ఆయనే వుండి..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



