Friday, March 20, 2026
E-PAPER
Homeజాతీయంహైదరాబాద్‌ మెడికల్‌ టూరిజంపై యుద్ధ ప్రభావం

హైదరాబాద్‌ మెడికల్‌ టూరిజంపై యుద్ధ ప్రభావం

- Advertisement -

ఇక్కడకు వచ్చే విదేశీ రోగుల సంఖ్యలో తగ్గుదల
రద్దవుతోన్న శస్త్ర చికిత్సలు
ప్రకటనలకు పరిమితం.. ప్రణాళికలు శూన్యం
మోడీ సర్కారుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

న్యూఢిల్లీ : అమెరికా-ఇజ్రాయిల్‌ దాడులతో ఇరాన్‌లో యుద్ధం చెలరేగడంతో దాని ప్రభావం హైదరాబాద్‌ మెడికల్‌ టూరిజం సెక్టార్‌ పైనా పడింది. యుద్ధ పరిస్థితులతో హైదరాబాద్‌ మెడికల్‌ టూరిజం సెక్టార్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. ముందస్తు అంచనా లోపం, ప్రత్యామ్నాయ ప్రణాళికల లేమిపై కేంద్రంలోని మోడీ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న క్షణాల్లోనే స్పందించాల్సిన కేంద్రం ఆలస్యంగా కదిలిందనే విమర్శల నడుమ హైదరాబాద్‌ మెడికల్‌ టూరిజం దెబ్బతినడం ఆందోళన కలిగిస్తున్నది. గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చే రోగుల ప్రవాహం ఒక్కసారిగా తగ్గిపోవడం, విమాన రాకపోకలు నిలిచిపోవడం ఈ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని విశ్లేషకులు చెప్తున్నారు.

ప్రచారాలు ఘనం.. ఆచరణ శూన్యం
కేంద్రం ‘హీల్‌ ఇన్‌ ఇండియా’ అంటూ పెద్దగా ప్రచారం కల్పించింది. దానిని ఆచరణలో చూపెట్టటంలో మాత్రం విఫలమైంది. సంక్షోభ సమయం లో కేంద్రం నుంచి మాత్రం ఎలాంటి తక్షణ చర్యలూ కనిపించలేదని విశ్లేషకులు అంటున్నారు. అలాగే విదేశీ రోగుల కోసం ప్రత్యేక సహాయం లేదని వివరిస్తున్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో… కేంద్రం చేస్తున్న ప్రచారం, అమలు మధ్య అంతరం స్పష్టంగా కనబడుతోందని విశ్లేషకులు అంటున్నారు.

ఒక్కసారిగా కుప్పకూలిన రంగం
హైదరాబాద్‌ గత దశాబ్దంలో మెడికల్‌ టూరిజంలో వేగంగా ఎదిగింది. కానీ యుద్ధం మొదలైన కొన్ని రోజుల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇక్కడ సుమారు 30 శాతం శస్త్రచికిత్సలు రద్దయ్యాయి. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌ వంటి దేశాల నుంచి రోగుల రాక తగ్గింది. ఎమిరేట్స్‌, ఖతర్‌ ఎయిర్‌వేస్‌ వంటి ఎయిర్‌లైన్స్‌ సేవలు నిలిచి పోయాయి. ఒక నగర ఆర్థిక వ్యవస్థలో కీలక రంగం ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మోడీ సర్కారు నిర్లక్ష్య వైఖరి
ఇక్కడే కేంద్రంపై ప్రధాన విమర్శలు వినబడుతున్నాయి. వాస్తవానికి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొత్తవి కావు. అయినా కూడా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పరిస్థితులను అంచనా వేయలేదు. ఇది పూర్తిగా కేంద్రం నిర్లక్ష్య వైఖరేనని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రభుత్వ అలసత్వం ఇంత వరకు తీసుకొచ్చిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక విమాన మార్గాల ప్రత్యామ్నాయ ప్రణాళికలు లేవు. మెడికల్‌ టూరిజం సెక్టార్‌కు కలిగే నష్టం విషయంలో ఒక అంచనా కొరవడింది. ఇదంతా పాలనలో ప్రణాళికల లోపాన్ని చూపుతోందని నిపుణులు చెప్తున్నారు.

గల్ఫ్‌పై అధికంగా ఆధారపడిన ప్రభావం
హైదరాబాద్‌ మెడికల్‌ టూరిజం ఎక్కువగా గల్ఫ్‌ దేశాలు, పశ్చిమాసియా దేశాల మీదనే. అయితే ఇప్పుడు మధ్యప్రాచ్యంలో నెలకొన్న సంక్షోభం ఈ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. అయితే విభిన్న మార్కెట్లను అభివృద్ధి చేయడంలో కేంద్రం, రాష్ట్రం రెండూ విఫలమయ్యాయనీ, ప్రస్తుత పరిస్థితి ఇందుకు నిదరర్శనమని మేధావులు అంటున్నారు.

భారత్‌కు సదవకాశమే కానీ…
గల్ఫ్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్ వంటి నగరాల భద్రతపై నమ్మకం దెబ్బతిన్నది. యుద్ధంతో ప్రభావిత దేశాల్లో ఆరోగ్య వ్యవస్థలూ బలహీనమయ్యాయి. అయితే ఇది భవిష్యత్తులో భారత్‌కు కలిసి వచ్చే అవకాశమే. కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందా? అసలు ఈ విషయంలోనైనా ఒక ఆలోచన, ప్రణాళిక మోడీ సర్కారు వద్ద ఉందా? అనే ప్రశ్నలు అందరిలోనూ మెదులుతున్నాయి. ఇక మోడీ పాలనలో రూపాయి చాలా దారుణంగా పడిపోతోంది.

దీంతో విదేశీ రోగులకు ఇక్కడ చికిత్స చౌకగా మారింది. ఇది ఆర్థిక బలహీనతకు సంకేతం అని నిపుణులు చెప్తున్నారు. దీర్ఘకాలంలో ఇది భారత్‌కు చేటును తెస్తుందని అంటున్నారు. మొత్తానికి ప్రపంచ సంక్షోభాలు కేవలం సరిహద్దుల వద్ద ఆగవనీ, అవి స్థానిక ఆర్థిక వ్యవస్థలను కూడా కుదిపేస్తాయనడానికి హైదరాబాద్‌ మెడికల్‌ టూరిజం కథ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. కేంద్రం పెద్ద ప్రణాళికలను ప్రకటించడానికి మాత్రమే పరిమితం కాకుండా.. సంక్షోభ సమయాల్లో వాటిని అమలు చేయగల సామర్థ్యాన్ని కూడా చూపించాల్సిన అవసరం ఉందని వారు వివరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -