Friday, March 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రపంచ సినిమాకి హైదరాబాద్‌ వేదిక కావాలి

ప్రపంచ సినిమాకి హైదరాబాద్‌ వేదిక కావాలి

- Advertisement -

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

‘తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను ఇవ్వడం మా ప్రభుత్వం బాధ్యతగా భావించింది. హైదరాబాద్‌ అంటే కేవలం ఐటీ హబ్‌, ఫార్మా, హైదరాబాద్‌ బిర్యానీ మాత్రమే కాదు.. ఇదొక సినిమా హబ్‌కు కేరాఫ్‌’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఉగాదిని పురస్కరించుకుని తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవం గురువారం సాయంత్రం వైభవంగా జరిగింది. మాదాపూర్‌ హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ఈ వేడుకకు వేదికైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ‘హైదరాబాద్‌కు చార్మినార్‌కి ఉన్న చార్‌ మినార్స్‌ లాగా ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, రామా నాయుడు, కృష్ణ నలుగురు సినీ పరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాద్‌కి తరలించి, ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. రామోజీ రావు ఫిల్మ్‌ సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారు.

ప్రభాకర్‌ రెడ్డి సినీ కార్మికుల కోసం తన సొంత స్థలాన్ని ఇచ్చి ఆదుకున్నారు. ఆనాడు సినీ రంగంలో ఏ సమస్య వచ్చినా ముందుండే దాసరి నారాయణ రావుని స్మరించుకోవాల్సినా అవసరం ఉంది. హైదరాబాద్‌ను గ్లోబల్‌ సినీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌ తమ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. నెట్‌ఫ్లిక్స్‌ వచ్చిందంటే హైదరాబాద్‌కు హాలీవుడ్‌ వచ్చినట్టే. గద్దర్‌ ఒక చైతన్యం… ఒక స్ఫూర్తి. తన పాటతో వేలాది మందిలో చైతన్యం తీసుకువచ్చిన ఆయన పేరుతో ఈ అవార్డులు ఇవ్వడం సంతోషం. సినిమా అనేది మోస్ట్‌ పవర్‌ ఫుల్‌ వెపన్‌. సమాజాన్ని చైతన్యపరిచేందుకు సినిమాను సాధనంగా ఉపయోగించుకోవాలి. సామాజిక బాధ్యతను గుర్తెరిగి గద్దర్‌ స్ఫూర్తితో సామాజిక సమస్యలను పరిష్కరానికి సినిమా ద్వారా సందేశం అందించాలి’ అని తెలిపారు.

తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండి సిహెచ్‌ ప్రియాంక మాట్లాడుతూ, ‘ఇది కేవలం అవార్డుల ప్రదానోత్సవం మాత్రమే కాకుండా తెలంగాణ సృజనాత్మకతకి, ప్రతిభకి, సాంస్కృతిక విలువలకు గొప్ప వేదిక. ఈ అవార్డుల ఎంపిక ఎంతో నిస్పక్షపాతంగా జరిగింది. ఉగాది పర్వదినాన నిర్వహిస్తున్న ఈ అవార్డుల వేడుక ప్రతి ఏటా ఓ సంప్రదాయంగా ఉండాలని ప్రభుత్వం భావించింది. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధిని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. అలాగే హైదరాబాద్‌ని గ్లోబల్‌ ఫిల్మ్‌ హబ్‌ చేయాలనేది మన ప్రభుత్వ సంకల్పం. దీని ద్వారా యువ ప్రతిభకు, సాంకేతిక నిపుణులకు మరిన్ని అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది’ అని అన్నారు.

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, కథానాయకుడు చిరంజీవి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌రాజు, ఎఫ్‌డీసీ ఎం ప్రియాంక, టూరిజం శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు జ్యోతి ప్రజ్వలనతో గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల విశేషాలను తెలియజేసే ప్రత్యేక సంచికను టీఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌రాజు ఆవిష్కరించారు. అవార్డులను ఎంపిక చేసిన ఫీచర్‌ జ్యూరీ చైర్మన్‌ సంగీత దర్శకుడు మణిశర్మను దిల్‌రాజు గోల్డ్‌ మొమెంట్‌తోపాటు ప్రశంసా పత్రంతో సత్కరించారు. అలాగే రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా అందజేశారు. ఫీచర్‌ ఫిల్మ్‌ జ్యూరీ సభ్యులను కూడా గోల్డ్‌ మొమెంట్‌తోపాటు ప్రశంసా పత్రంతో సన్మానించారు. వీరికి లక్ష రూపాయల నగదు బహుమతిని అందించారు. వీరితోపాటు ఇతర విభాగాల జ్యూరీ చైర్మన్లతోపాటు సభ్యులకు కూడా గోల్డ్‌ మొమెంట్‌లను అందజేశారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ‘తెలుగు సినిమా కేవలం మన రాష్ట్రానికే పరిమితం కాకుండా యావత్‌ దేశానికే తలమానికంగా ఎదగాలనే సంకల్పంతో, పట్టుదలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అవార్డులను అందజేస్తున్నారు. గత ప్రభుత్వ హయంలో పది సంవత్సరాలు ఎటువంటి అవార్డులు లేవు. అలాంటి అవార్డులను తిరిగి ప్రవేశపెట్టి, దిగ్విజయంగా అందజేస్తూ దేశానికే కాదు ప్రపంచానికి పరిచయం చేశారు. నేడు తెలుగు సినిమా పరిధులు దాటి హాలీవుడ్‌స్థాయికి వెళ్ళింది. సినిమా అంటే కేవలం కళలల కోసం కాదు.. ప్రజల కోసం అని నిరూపించిన అనేక సినిమాలు వచ్చాయి. కేవలం సందేశాత్మక చిత్రాలుగానే కాకుండా వినోదాన్ని అందజేస్తూ కమర్షియల్‌గా మంచి విజయాలు సాధించిన సినిమాలూ ఉన్నాయి.

సత్యహరిచంద్ర, కన్యాశుల్కం, మరో ప్రపంచం, రోజులు మారాయి, కాలం మారింది, దానవీర శూరకర్ణ వంటి తదితర ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూనే, సమాజానికి మంచి మంచి సందేశాలను అందించాయి. అంతేకాదు సమాజ మార్పు కోసం కూడా నాంది పలికాయి. వ్యక్తిగా కాకుండా ఓ వ్యవస్థగా తెలంగాణ ఆటని, పాటని, ఆత్మని సందేశాత్మకంగా ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప మనిషి గద్దర్‌ పేరుమీద ఈ అవార్డులను అందజేయటం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన పేరుతో ఈ అవార్డులను అందజేస్తున్న మా ప్రభుత్వ ఆలోచనా విధానం ఏమిటో ప్రజలకు వేరే చెప్పక్కర్లేదు’ అని అన్నారు.

రష్మిక మందన్న మాట్లాడుతూ, ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ లాంటి సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు, అవార్డులతో ప్రోత్సహించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అని అన్నారు. హీరో నాగచైతన్య మాట్లాడుతూ,’నా కెరీర్‌లో ఇది బెస్ట్‌ మూమెంట్‌. ఇన్నేళ్ళ కెరీర్‌లో కొన్ని సినిమాలు వర్కవుట్‌ అయ్యాయి.కొన్ని కాలేదు. అయితే ‘తండేల్‌’ మాత్రం ఈ స్టేజ్‌ మీద నిలబెట్టింది. ఇలాంటి అవార్డులు మాలాంటి వారికి మరింత స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని అందిస్తాయి’ అని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి మల్లు విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌రాజు, టూరిజం శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగార్జున, రితేష్‌ దేవ్‌ముఖ్‌, జెనీలియా, ఖుష్బూ, రామ్‌చరణ్‌ చేతుల మీదుగా విజేతలు అవార్డులను అందుకున్నారు.

‘ఎక్కడైతే కళలు, కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం, దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే నానుడిలోని ఆంతర్యాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాగా గ్రహించారు. సినిమా తాలుకా ప్రభావం, ప్రతాపం ఏంటో ఆయన గ్రహించి, ఎంతో పట్టుదలగా ఈ అవార్డులను అందజేశారు. రాబోయే కాలంలో హైదరాబాద్‌ను గ్లోబల్‌ ఫిల్మ్‌ హబ్‌గా తయారు చేయాలన్నది ఆయన లక్ష్యం. అంతేకాదు ఇండియన్‌ సినిమా అంటే హైదరాబాదే గుర్తుకు రావాలన్నది ఆయన ధ్యేయం. దీన్ని వల్ల ఉపాధి పెరిగి రాష్ట్ర రెవిన్యూతోపాటు జీడీపీలోనూ పెరుగుదల ఉంటుంది. ఈ అవార్డుల తీరుని చూస్తుంటే సీనియర్లను గౌరవిస్తూ, యువతను ప్రోత్సహిస్తోంది. ఇలాంటి అరుదైన అవకాశాన్ని కల్పించిన జ్యూరీ సభ్యులకు అభినందనలు. ఈ అవార్డులను స్ఫూర్తిగా తీసుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సినిమాలకు ప్రోత్సహం కల్పించాలని కోరుకుంటున్నాను’. – చిరంజీవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -