రైతుల ప్రమేయం ఉండదా?
గడువు ముగిసినా ఏర్పాటు కాని కొత్త పాలకవర్గాలు
నామినేటెడ్ పదవుల భర్తీకి సిద్ధం కానున్న ప్రభుత్వం?
ఎన్నికల ద్వారానే అన్నదాతలకు సరైన న్యాయం
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
వ్యవసాయానికి ప్రాణం పోసి.. రైతులకు తక్కువ వడ్డీ రుణాలు ఇచ్చి ఆదుకునే వ్యవస్థ సహకార రంగం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతుల చేతుల్లో ఉండే స్వయం ప్రతిపత్తి సంస్థలు. రైతు ఆర్థిక స్వావలంబన, గ్రామీణాభివృద్ధి, ఆహార భద్రతకు ఈ సంఘాలు మూలాధారం. ఇంతటి ప్రాధాన్యత కల్గిన సహకార సంఘాల పాలకవర్గాల గడువు ముగిసి చాలా రోజులైంది. ఇవి ప్రస్తుతం ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నాయి. కొత్త పాలకవర్గాలు ఏర్పాటు కావాలంటే ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ప్రభుత్వం మరోరకంగా ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవస్థను అధికారుల చేతుల్లో పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. రైతులే పాలక మండళ్లుగా ఏర్పడి సొంత డబ్బులతో అభివృద్ధి చేసుకోవాల్సి ఉండగా.. సహకార సంఘాలకు ఎన్నికలు జరపకుండా నామినేటెడ్ ద్వారా భరీ చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అధికారులకు పీఐసీ విధానంలో సహకార సంఘాల్లో పదవులు కట్టబెడితే.. రైతులకు, సంఘాలకు ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోనుంది. ఇలాంటి నిర్ణయాల వల్ల సహకార వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం కావడమేగాక రైతులు భాగస్వామ్యాన్ని కోల్పోతారు. ఇప్పటివరకు సహకార సంఘాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో సరఫరా చేసి రైతులను ఆదుకుంటున్నారు. ఇటీవల మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకొని ఆన్‌లైన్ ద్వారా వ్యాపారాలు మొదలు పెట్టింది. 3 శాతానికే పంట రుణాలు ఇచ్చిన ఘనత సహకార సంఘాలది. రుణ మాఫీలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను రైతులందరికీ వర్తింపజేసి చేయూత నందిస్తున్నాయి. పెట్రోల్ బంకులు, సూపర్ మార్కెట్‌లు ఇలా ప్రతి రంగంలోనూ రాణించి వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూనే.. మరోవైపు ఇంకోరకంగా ఆలోచన చేయడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 9 డీసీసీబీలు, 908 సహకార సంఘాలు ఉన్నాయి. ఒక్కో సహకార సంఘంలో 13 మంది సభ్యుల చొప్పున 9,797 మంది ఉంటారు. సహకార సంఘం ద్వారా గెలిచిన అధ్యక్షులు డీసీసీబీ అధ్యక్షులను.. డీసీసీబీ అధ్యక్షులు టీజీకాబ్ అధ్యక్షులను ఎన్నుకుంటారు. 2013 తర్వాత కొత్తగా ఒక్క పీఏసీఎస్ ఏర్పాటు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 131 సంఘాలను ఏర్పాటు చేయాలని చూస్తోంది. మొత్తం 1039 అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా రూ.50వేల కోట్ల టర్నోవర్ ఉంటే ఒక మహబూబ్‌నగర్‌లోనే రూ.2500 కోట్ల టర్నోవర్ ఉంది. సొసైటీలకు డీసీసీబీ రుణాలు ఇస్తే.. డీసీసీబీలకు టీజీ కాబ్ రుణ సదుపాయం కల్పిస్తోంది. టీజీ కాబ్‌లకు నాబార్డ్ రుణం అందిస్తోంది. నాలుగు అంచెలుగా ఉండే సహకార రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
ఎన్నికలు లేకుండానే..
సహకార సంఘాలు, డీసీసీబీలు, టీజీకాబ్‌లకు ఎన్నికలు నిర్వహించకుండా కమిటీల్లోకి కొంత మంది రాజకీయ నాయకులను నామినేట్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే సహకార సంఘాల్లో రైతుల భాగస్వామ్యం పూర్తిగా కోల్పోతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. రైతుల భాగస్వామ్యం లేకుంటే.. తక్కువ వడ్డి రుణాలు, రుణమాఫీతో పాటు ఎరువుల సరఫరా వంటివాటిపై దృష్టి పెట్టే అవకాశాలు తగ్గుతాయి. ప్రధానంగా రైతులు షేర్ అమౌంట్‌తో ఏర్పాటు చేసుకున్న సహకార సంఘాల్లో ఇతరుల ప్రమేయం పట్ల విమర్శలు వస్తున్నాయి.
సహకార సంఘాల ద్వారానే రైతుల సంక్షేమం
సహకార సంఘాల ద్వారానే రైతులకు బ్యాంకుల ద్వారా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ప్రధానంగా తక్కువ వడ్డీతో రుణాలు ఇతర బ్యాంకులు ఇవ్వవు. సహకార సంఘాలు రుణమాఫీతో రైతులకు సహకరిస్తాయి. సహకార సంఘాలకు ఎన్నికల ద్వారానే రైతులకు నిజమైన భాగస్వామ్యం ఏర్పడుతుంది.
-భాస్కర్‌రెడ్డి, చిన్న మూన్నురు సింగిల్ విండో చైర్మెన్, నాగర్‌కర్నూల్ జిల్లా
రైతులకు భాగస్వామ్యం కల్పించాలి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి. రైతుల భాగస్వామ్యం లేకుండా సహకార సంఘాలు తమ లక్ష్యాన్ని నెరవేర్చలేవు. రైతుల సమస్యలు రైతుల చేత ఎన్నుకోబడిన వారికే తెలుస్తాయి. నామినేటెడ్ ద్వారా అధ్యక్షులను నియమిస్తే.. రాజకీయ జోక్యం పెరిగి రైతులకు న్యాయం జరగదు. దీర్ఘకాలిక నిర్ణయాల అమలు రైతులు చైర్మెన్‌లు అయితేనే న్యాయం జరుగుతుంది. -మామిళ్ల విష్ణువర్ధన్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మెన్, మహబూబ్‌నగర్



