Friday, March 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనర్మెట్టలో అత్యాధునిక ఆయిల్‌ రిఫైనరీ యూనిట్‌

నర్మెట్టలో అత్యాధునిక ఆయిల్‌ రిఫైనరీ యూనిట్‌

- Advertisement -

22న సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన
ఇది శుభపరిణామం : స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి
రైతులు పంటల వైవిధ్యం గురించి మరింత ఆలోచించాలి : మంత్రి తుమ్మల
ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ సందర్శన
రైతుమేళా ప్రారంభం

నవతెలంగాణ- నంగునూరు
భారతదేశంలోనే ఏకైక ఆయిల్‌ రిఫైనరీ యూనిట్‌ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి నర్మెట్టలో శంకుస్థాపన చేయనుండటం శుభ పరిణామమని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో నిర్మించిన ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీని ఈనెల 22న సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో 150 స్టాళ్లతో కూడిన రైతుమేళాను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్‌, మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, రైతు సంక్షేమ సంఘం చైర్మెన్‌ కోదండరెడ్డితో కలిసి గురువారం వారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే సిద్దిపేట ప్రాంతంలో అత్యాధునిక టెక్నాలజీతో ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ నిర్మాణం అయిందని, రిఫైనరీ యూనిట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఆయిల్‌ పామ్‌ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తాను శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డితో కలిసి సీఎంకు వివరిస్తామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏ శుభకార్యానికి వెళ్లినా ఆయిల్‌ పామ్‌ సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నారని అన్నారు. శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు పట్టుబట్టి ఈ ప్రాంతమే కాకుండా యావత్తు తెలంగాణ రైతుల సంక్షేమం కోసం ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేశారన్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులు పంటల వైవిధ్యం గురించి మరింత ఆలోచించాలని సూచించారు. తాను ఏ పార్టీలో ఉన్నా.. రైతుల సంక్షేమం గురించే ఆలోచి స్తానన్నారు. డిమాండ్‌ బాగా ఉండి.. లాబాలు వచ్చే పంటలసాగు వైపు రైతులు మళ్లాలని చెప్పారు. ఆయిల్‌పామ్‌ను మరింత ప్రోత్సహించా లని కేంద్రాన్ని కూడా అడిగినట్టు చెప్పారు. పామాయిల్‌ దిగుమతిపై పన్ను పెంచితే.. దేశంలో రైతులకు మేలుకలుగుతుందన్నారు. మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలోనూ ఆయిల్‌ పామ్‌ తోటల పెంపకం కోసం కృషి చేస్తామన్నారు. మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. ఆయిల్‌ పామ్‌ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు రూ.4200 అందిస్తోందని తెలిపారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా రైతు సంక్షేమం కోసం అందరం పాటుపడదామన్నారు.

గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం వల్లే.. ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిందన్నారు. ఖమ్మం జిల్లా తర్వాత సిద్దిపేట జిల్లాలోనే అత్యధికంగా ఆయిల్‌పామ్‌ సాగువుతోందని, ఆయిల్‌పామ్‌ సాగులో ఉత్తమ రైతు అవార్డు సిద్దిపేట జిల్లా వాసికి రావడం సంతోషకరమని చెప్పారు. ఆయిల్‌ పామ్‌ రైతుల సమస్యలను మంత్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్‌, డాక్టర్‌ వంటేరు యాదవరెడ్డి, టీజీ ఆయిల్‌ ఫెడ్‌ చైర్మెన్‌ జంగా రాఘవరెడ్డి, కమిషన్‌ సభ్యులు రాములు నాయక్‌, జిల్లా కలెక్టర్‌ కె.హైమావతి, ఆయిల్‌ పామ్‌ అధికారులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, స్థానిక సర్పంచ్‌ శనిగరం స్వాతిబాబు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -