పాలనా వైఫల్యాలతో విపక్షానికి బలం చేకూరే అవకాశం
తెలంగాణ భవన్లో పంచాంగ శ్రవణం : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతిపక్షం ఎదిగే పరిస్థితులు పుష్కలంగా ఉంటాయని పంచాంగ శ్రవణంలో పండితులు చెప్పారు. ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు, పాలనా వైఫల్యాలు కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగి, ప్రతిపక్షానికి గణనీయంగా బలం చేకూరే అవకాశం ఉంటుందని అన్నారు. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఉగాది పంచాంగ శ్రవణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ప్రముఖ పండితులు మృత్యుంజయ శర్మ, ఫణీంద్ర శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలతో ప్రతిపక్షానికి బలం పెరుగుతుందని పండితులు అభిప్రాయపడ్డారు.
విద్యా విధానంలో జరుగుతున్న మార్పులు విద్యార్థులకు నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. యువత పక్కదారి పట్టే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే నిరుద్యోగం మరింత పెరిగే అవకాశముందని అన్నారు. ఈ ఏడాది మంచి వర్షాలు కురిసే సూచనలున్నాయనీ, సమృద్ధిగా పంటలు పండే అవకాశం ఉంటుందని వివరించారు. ధాన్యం, పత్తి, మక్క వంటి పంటలు బాగా పండే అవకాశం ఉందనీ, రైతుల ఆత్మహత్యలు తగ్గే సూచనలున్నాయని చెప్పారు. అయితే బంగారం, వెండి, ఆహార ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందనీ, కూరగాయల ధరలు కొంతవరకు తగ్గొచ్చని అన్నారు. అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశముందని వారు హెచ్చరించారు.
పశుసంపద అభివృద్ధి గణనీయంగా ఉంటుందని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో తుపానులు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉన్నప్పటికీ, పాలకులు వాటిని సమర్థంగా ఎదుర్కొనే అవకాశముందని చెప్పారు. రైలు, విమాన, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయనీ, సినీ, రాజకీయ ప్రముఖులు కొంతమంది కనుమరుగయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు మానసికంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితులుండొచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతిపక్షం ఎదుగుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



