– ఈనెల 22న పీపీటీ ప్రవేశ పరీక్ష
నవతెలంగాణ – కామారెడ్డి
పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ (PPT) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత రెసిడెన్షియల్ విద్యాసంస్థలో ప్రవేశాల కోసం ఈనెల 22న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TS UTF) కామారెడ్డి జిల్లా కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ రోడ్ గల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల (ZPHS Boys), లో ఈ పరీక్ష ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వహించబడనుంది.
ఇప్పటికే మార్చి 15 వరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకావాలని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రగతి నగర్లో పీపీటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ విద్యాసంస్థలో అనాథ, పాక్షిక అనాథ, నిరుపేద కుటుంబాల పిల్లలకు 6వ తరగతి నుండి పీజీ వరకు ఉచిత విద్యను రెసిడెన్షియల్ విధానంలో అందిస్తున్నారని తెలిపారు. ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించబడతాయని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 45 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. పరీక్ష రాయనున్న విద్యార్థులు అర్ధగంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
ఈ ప్రవేశ పరీక్షలో తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్ విషయాల నుండి ప్రతి అంశంలో 20 ప్రశ్నల చొప్పున మొత్తం 80 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయని తెలిపారు. జిల్లా స్థాయిలో ఈ పరీక్షను టీఎస్ యుటిఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరింత సమాచారం కోసం టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆకుల బాబు (9866979686), ప్రధాన కార్యదర్శి సాయిలు (9676123207), కోశాధికారి టాప్ సింగ్ (9392013932), ఉపాధ్యక్షుడు నేరడి నారాయణ (9490172578)లను సంప్రదించవచ్చని సూచించారు.



