నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు గ్రామాలలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ క్రమంలో ప్రజలకు పలు అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల అందుతున్నాయా లేదా అని స్థానికులను అడిగి తెలసుకుకన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి పరిశీలించారు. నిర్మాణ నాణ్యత, పనుల వేగం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
త్వరగా పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తదనంతరం ఆక్సిజన్ పార్క్‌ను సందర్శించి అక్కడి అభివృద్ధి పనులను పరిశీలించారు. పార్క్‌లో వృక్షాల సంరక్షణ, ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ఆపై కేజీబీవీ విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా అన్నది పరిశీలించారు. ఈ రోజు మెనూలో క్యారెట్ కర్రీ, సాంబారు, టమాట చారు, కోడి గుడ్డు, పెరుగు, నెయ్యి అందిస్తున్నట్లు గమనించారు.
ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారితో ముచ్చటిస్తూ వారి విద్య, వసతి, ఆహారం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. బస్వాపూర్ ఎంపీయూపిఎస్ పాఠశాలలో గ్రామ సర్పంచ్ వాగ్మారే రమణ గొంగడి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ను సన్మానించారు. పాఠశాల విద్యార్థిని , విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఇందులో పీడీ హౌసింగ్ విజయపాల్ రెడ్డి, డీఈవో రాజు, డిపిఓ మురళి, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, తహసిల్దార్ మారోతి, డిప్యూటీ తహసిల్దార్ హేమలత, ఆర్ఐ రామ్ పటేల్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపిఓ రాము, జుక్కల్ జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయా గౌడ్, బస్వాపూర్ సర్పంచ్ రమణ సురేష్ గొండ , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయాగౌడ్, మాజీ సర్పంచ్ బొంపల్లి రాములు, బస్వాపూర్ జిపి కాంగ్రెస్ భరద్వాజ్, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.



