షైన్ హై స్కూల్ కరస్పాండెంట్ షేక్ అన్సర్ పాష
దమ్ముంటే ఆధారాలతో రండి, చర్చకు మేము సిద్ధం
షైన్ హై స్కూల్ భాగస్వామి ఎరమాల సంజీవరెడ్డి
భాగస్వాముల మధ్య మరింత ముదిరిన రచ్చ
నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోనే బోనకల్ మండల కేంద్రంలో గల షైన్ హై స్కూల్ భాగస్వాముల మధ్య శుక్రవారం మరింత తీవ్ర రూపం దాల్చి ముదిరిన వివాదం. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మీ హాయంలోనే అవినీతి, అక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు జరిగాయి అంటే కాదు కాదు మీ హాయంలోనే అవినీతి, అక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు జరిగాయి అంటూ ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో షైన్ హై స్కూల్ వివాదం రచ్చకెక్కింది. ప్రస్తుతం షైన్ హై స్కూల్ వివాదం పైనే మండల వ్యాప్తంగా చర్చ సాగటం విశేషం.
ఆ వివరాలు వారి ఇరువురి మాటలలోనే చూద్దాం..
మండల కేంద్రంలో షైన్ హై స్కూల్ గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది. ప్రస్తుతం ఆ షైన్ హై స్కూల్ తీవ్ర వివాదాలు, ఆరోపణల మధ్య కొట్టుమిట్టాడుతుంది. నేటి సమాజంలో ఆయా కార్పొరేట్లకు దీటుగా విద్యార్థులను వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణముగా విద్యను అందించడానికి మేము కృషి చేస్తున్నామని ప్రస్తుత షైన్ హై స్కూల్ కరస్పాండెంట్ షేక్ అన్సర్ పాష తెలిపారు.గతంలో ఈ పాఠశాల కొంతమంది భాగస్వామ్యంతో ఉండగా మేము అందులో జరిగిన అసాంఘీక, అశాస్త్రీయ, ఆర్థిక మోసాలకు సంబంధించిన విషయాలను తెలుసుకున్నప్పుడు, తోటి భాగస్వాములను తొలగించుటకు చర్చలు జరిపి తగు విధముగా చెల్లింపులు జరిపి భాగస్వామ్య వ్యవహారాన్ని ముగిoచటమైంది.
గతంలో ఆక్టివ్ భాగస్వామిగా ఉన్న గత మిత్రుడు మేము ప్రస్తుత షైన్ హైస్కూలను వాల్చుకున్న అనంతరం చాప క్రింద నీరులా పొగ పెట్టి మమ్మల్ని సాగానంపే కార్యక్రమాల కుట్రలో భాగంగా పకడ్భంది వ్యూహరచనతో సంస్థ యొక్క ప్రతిష్ఠను, ప్రస్తుత యాజమాన్య హక్కులను కాలరాసే విధంగా గ్లోబల్ ప్రచారం ప్రారంభించారు. నిత్యం తనుకున్న పూర్వ పరిచయాలతో మైత్రితో నిత్యం పాఠశాల పరిణామ క్రమాలను తెలుసుకొనే ప్రయత్నం ద్వారా విద్యా సంస్థ యొక్క స్ఫూర్తి, యాజమాన్యం కష్టపడే తత్వానికి వెన్ను పోటుగా, గొడ్డలిపెట్టుగా మారి అంతరరంగికంగా అనుకూల వాతావరణాన్ని సృష్టించుకున్నట్లు బలమైన ఆధారాలతో ముందుకు వెళ్తున్నాము.
ఈ విద్యా సంవత్సరం పరీక్షా సమయంలో ఒక యాజమాన్యానికి, ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థుల తల్లితండ్రుల మధ్య అలజడి సృష్టించే కుట్రలో భాగంగా మా మనో ధైర్యాన్ని దెబ్బతీయటానికి, కుట్రదారులు పత్రికా రూపంలో వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక, సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా వ్యవహరిసున్న తీరుని చైతన్యవంతం అయిన మేధావులు ఆలోచనపరులు అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాము.విద్యా సంస్థను తగు విధంగా తీర్చిదిద్దటంలో నిరంతరం కృషి చేస్తామని, మా మనో ధైర్యాన్ని లక్ష్య సాధన గమ్యాన్ని ఎవరు ఏ ప్రయత్నం చేసినా నీరు గార్చలేరని షేక్ అన్సర్ పాషా అంటున్నారు.రాజ్యంగo ప్రసాదించిన ఆర్టికల్ 14, 15, 19, 21. 29, 30 అండ్ 300(ఏ) ద్వారా సర్వ హక్కులు కల్గి ఉండే స్వేచ్ఛగా విద్యా సంస్థను నడుపుతున్నాము.
ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన ఎరమాల సంజీవరెడ్డి
షైన్ హైస్కూల్ యాజమాన్యం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న అంశాలు ముమ్మాటికీ అవాస్తవం, దురుద్దేశపూరితమైనవి అని, తాను షైన్ హైస్కూల్లో భాగస్వామిగా ఉన్నానని పేర్కొంటూ ఎరమాల సంజీవరెడ్డి నవతెలంగాణ కు తెలిపారు.తమ వైఫల్యాలను, గతంలో జరిగిన లోపాలను ఇతరులపైకి నెట్టివేసి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా దీనిని నేను పరిగణిస్తున్నాను.యాజమాన్యం తమ ప్రకటనలో “బలమైన ఆధారాలు” ఉన్నాయని పేర్కొంది. కేవలం మాటలతో కాకుండా, ఆ ఆధారాలను తక్షణమే బహిరంగ పరచాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నిజంగా తప్పు జరిగి ఉంటే, సాక్ష్యాలను ప్రజల ముందు లేదా చట్టం ముందు ఉంచాలి తప్ప ఇలాంటి గ్లోబల్ ప్రచారాలతో పక్కదారి పట్టించడం సరికాదన్నారు.గతంలో జరిగిన “అసాంఘిక, అశాస్త్రీయ, ఆర్థిక మోసాల” గురించి ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఒకవేళ అలాంటివి జరిగి ఉంటే, అప్పుడే చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? కేవలం తమ పరువును కాపాడుకోవడానికే పాత మిత్రులను భాగస్వాములను చేయడం వారి అసమర్థతకు నిదర్శనం అన్నారు.మీరు ప్రస్తావించిన ఆర్టికల్ 14, 19, 21 వంటివి కేవలం యాజమాన్యానికే కాదు, ప్రతి పౌరుడికీ వర్తిస్తాయి. చట్టాన్ని గౌరవించే వారెవరైనా తప్పుడు ఆరోపణలు చేయరు. ఒకవేళ మీరు చేస్తున్న కుట్రపూరిత ఆరోపణలు నిరూపించలేకపోతే, నేనే మీపై సివిల్, క్రిమినల్ డిఫమేషన్ కేసులు వేయడానికి వెనుకాడబోను.నిజం గడప దాటకముందే రూమర్ ఊరంతా చుట్టేస్తుంది” అని మీరు అన్న మాట మీకే వర్తిస్తుంది. దమ్ముంటే ఆధారాలతో రండి – చర్చకు మేము సిద్ధం అంటూ ఎరమాల సంజీవరెడ్డి ప్రస్తుత యాజమాన్యానికి సవాల్ విసిరారు.



