– తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా, నిరసన
నవతెలంగాణ- కమ్మర్ పల్లి
తమ గ్రామ శివారులోని బాగు నుండి అక్రమంగా ఇసుకను తీయొద్దని కోరుతూ వేల్పూర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామస్తులు శుక్రవారం తహసిల్దార్ అనిరుద్ కు వినతి పత్రం అందజేశారు. మా గ్రామం నుండి ఇతర గ్రామస్తులు ఇసుక తరలింపు చెయ్యొద్దని గ్రామ రైతులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా తహసిల్దార్ కార్యాలయానికి చేరుకొని, ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కులాల వారీగా రైతులు తహసిల్దార్ అనిరుద్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా వెంకటాపూర్ వనరు అయిన ఇసుకను తమ గ్రామాల నుండి ఇతర గ్రామాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇసుకను తీసుకువెళ్ల వద్దని, భూగర్భ జలాలు తీవ్రమైన కరువు ఏర్పడుతుందన్నారు. పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తీయడం వల్ల సాగునీరు, తాగునీరు, పశువులకు తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామస్తులకు, రైతులకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతున్న దృష్ట్యా అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకోవాలని కోరారు. ఇసుక రవాణాను తక్షణమే నిలిపివేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.
కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తా..
వెంకటాపూర్ గ్రామస్తుల వినతి మేరకు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తహసిల్దార్ అనిరుద్ తెలిపారు.వెంకటాపూర్ గ్రామ రైతుల సమస్యలని కలెక్టర్ కి చేరవేసి సమస్య పరిష్కారం కోసం తనవంతుగా కృషి చేస్తానన్నారు. ఇందుకు తనకు కొంత సమయం కావాలని వెంకటాపూర్ గ్రామస్తులు, రైతులను తహసిల్దార్ అనిరుద్ కోరారు.



