నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ‘ప్రగతి ప్రణాళిక ఆరోగ్య మిషన్ – 99 రోజులు’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భారీ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఆరు విభాగాల స్పెషలిస్ట్ వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు.
మాతా–శిశు సంరక్షణ, కిషోర బాలికల ఆరోగ్యం, వయోవృద్ధుల సంరక్షణపై ప్రత్యేకంగా సేవలు అందించడంతో పాటు 14 సంవత్సరాల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇచ్చారు. అలాగే బీపీ, మధుమేహం పరీక్షలు, క్షయవ్యాధి నిర్ధారణ, హెచ్‌ఐవి స్క్రీనింగ్ నిర్వహించారు. అంటు వ్యాధులు, వడదెబ్బ నివారణపై అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టారు.
ఈ శిబిరానికి మొత్తం 175 మంది రోగులు హాజరై వైద్య సేవలు పొందారు. డాక్టర్లు మోతీలాల్, గజపతి, ప్రియాంక, దివ్య, సైఫుద్దీన్, ఖదీర్ సేవలందించగా, జిల్లా అధికారుల పర్యవేక్షణలో శిబిరం విజయవంతంగా జరిగింది. ఇతర వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.



