Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా అనుకూల బడ్జెట్.. మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట

ప్రజా అనుకూల బడ్జెట్.. మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట

- Advertisement -

షబ్బీర్ అలీ ప్రశంసలు
– సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే బడ్జెట్‌గా అభివర్ణన
నవతెలంగాణ – కామారెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ 2026 – 27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమర్పించిన ఈ బడ్జెట్ ప్రజా అనుకూలంగా ఉండటంతో పాటు సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

మైనారిటీల సంక్షేమానికి రూ.3,769 కోట్లు కేటాయించడం పట్ల ఆయన స్వాగతం పలికారు. గత ఏడాదితో పోలిస్తే రూ.178 కోట్ల పెరుగుదల ఉండటం ప్రభుత్వ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. మైనారిటీ మహిళలకు 10,000 కుట్టు యంత్రాల పంపిణీ, 4,655 మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ వంటి కార్యక్రమాలు ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయని అన్నారు. బడ్జెట్‌లో మైనారిటీలను సంక్షేమ ప్రణాళికల కేంద్రంగా ఉంచి విద్య, వ్యాపారాభివృద్ధి, ఆర్థిక స్వతంత్రతపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. అలాగే రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6,000 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు లతోపాటు ఇతర వర్గాల యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించబడతాయన్నారు.

విద్యా రంగానికి ప్రాధాన్యతనిస్తూ ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 105 పాఠశాలలు ఏర్పాటు చేయబడుతుండగా, అందులో 79 పాఠశాలలకు అనుమతులు లభించాయని, 44 చోట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇది అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన, నైపుణ్య ఆధారిత విద్య అందించడంలో కీలకమని అన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి రూ.36,000 కోట్లకు పైగా కేటాయించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇందులో ఎస్సీలకు రూ.11,784 కోట్లు, ఎస్టీలకు రూ.7,937 కోట్లు, బీసీలకు రూ.12,511 కోట్లు కేటాయించడం సామాజిక న్యాయం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల విడుదలతో పాటు విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కార్యక్రమాల విస్తరణ ద్వారా వెనుకబడిన వర్గాలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యతను సాధించిందని, రైతులు, బలహీన వర్గాలు, యువతకు ప్రాధాన్యతనిచ్చిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్‌కు అనుగుణంగా సమగ్ర పాలనకు ఇది కొనసాగింపని తెలిపారు.

“ఇది రైతులకు, ప్రజలకు అనుకూలమైన బడ్జెట్. సామాజిక న్యాయాన్ని బలపరుస్తూ, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే దిశగా ముందడుగు,” అని షబ్బీర్ అలీ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -