ప్రారంభ మ్యాచ్‌లకు స్టార్క్ దూరం
సిడ్నీ: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్.. ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా స్టార్క్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సిఎ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత ఏడాదిగా మిచెల్ స్టార్క్‌పై తీవ్ర పనిభారం పడిందని, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల యాషెస్ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడాడని, బిగ్‌బాష్ లీగ్, టెస్ట్‌ల్లో అత్యధిక బంతులు విసిరిన బౌలర్ల జాబితాలో ముందున్నాడని సిఎ తాజాగా పేర్కొంది. టి20ల్లో అతడు వేసేది నాలుగు ఓవర్లే అయినా.. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
కొత్త బంతితో అద్భుతాలు చేసే స్టార్క్‌పై వర్క్‌లోడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జట్టు మేనేజ్మెంట్ భావించింది. అందుకే రాబోయే రోజుల్లో రిటర్న్ టు ప్లే ప్రొటోకాల్స్‌ను అనుసరించి క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి ఇవ్వనుంది. దాంతో తొలి వారంలో మ్యాచ్‌లకు అతను దూరమయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయని క్రికెటర్ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ టీ20లకు గతేడాది వీడ్కోలు పలికిన స్టార్క్.. టెస్ట్‌లు, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్ ఆడుతున్నాడు. మిచెట్ స్టార్క్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.11.75 కోట్లకు సొంతం చేసుకుంది.



