Saturday, March 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునీటిపారుదల రంగానికి కోత

నీటిపారుదల రంగానికి కోత

- Advertisement -

బడ్జెట్‌లో రెండేండ్లుగా తగ్గుతున్న కేటాయింపులు
గతేడాదికన్నా రూ.720 కోట్లు తగ్గింపు
మేడిగడ్డ ఊసెత్తని సర్కార్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి కీలకమైన నీటి పారుదల రంగానికి క్రమంగా కేటాయింపులు తగ్గుతున్నాయి. 2023 నుంచి మూడు బడ్జెట్లల్లో ఈ రంగానికి సర్కార్‌ కేటాయించిన నిధులే ఇందుకు నిదర్శనం. గతేడాది రూ.23,355 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది (2026-27) బడ్జెట్‌లో రూ.22,615, కోట్లను ప్రతిపాదించింది. గడిచిన ఏడాదితో పోల్చితే రూ.720 తగ్గాయి. అలాగే 2023-24లో రూ.29,766.00 కోట్లను కేటాయించగా, ఆ తర్వాత ఏడాది 2024-25లో 22,301 కోట్లు కేటాయించారు. రెండేండ్ల గణాంకాలు పరిశీలిస్తే సాగునీటి పారుదల రంగానికి రూ.7,151 కోట్ల కేటాయంపులు తగ్గాయి. ఇందులో ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు రూ.12 వేల కోట్ల వరకు ఖర్చు చేయాలని ప్రాథమికంగా సర్కార్‌ నిర్ణయించింది. మిగతా మొత్తం ప్రాజెక్ట్‌లకు తీసుకొన్న రుణాలకు అసలు, వడ్డీ తిరిగి చెల్లింపు, ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణకు వ్యయం చేయనున్నారు. గతేడాది పనులకోసం రూ.12,534 కోట్లు, అసలు, వడ్డీ చెల్లించడానికి, ఉద్యోగుల జీతాలు, నిర్వహణకోసం రూ.11,694 కోట్లు కేటాయించారు.

ప్రస్తుత బడ్జెట్‌లో రాష్ట్రంలోని 20కిపైగా ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని ప్రతిపాదించారు. పాలమూరు-రంగారెడ్డి, మహాత్మా గాంధీ కల్వకుర్తి, జవహర్‌ నెట్టెంపాడు, రాజీవ్‌ భీమా, ఉదయ సముద్రం, డిండి, జాన్పాడు, మోతె, జె.చొక్కారావు దేవాదుల, సీతారామ, చిన్న కాళేశ్వరం, మక్తల్‌ నారాయణపేట కొడంగల్‌ ఎత్తిపోతల పథకాలు, ఎలిమినేటి మాధవ రెడ్డి శ్రీశైలం ఎడమ గట్టు కాలువ, గౌరవెల్లి ప్రాజెక్టు, ఎర్రుపాలెం లిఫ్ట్‌ ఇరిగేషన్‌, త్రివేణిసంగమం, పులిమడుగువాగు, కొమరంభీం వాగు, చిక్మానువాగు, లెండిగూడ-జైనూర్‌ (మంటో), రోసీమాల్టా మినీ రిజర్వాయర్‌ ఇతర ముఖ్యమైన ప్రాజెక్ట్‌లను ప్రాధాన్యత క్రమంలో చేపడతామని సర్కార్‌ తెలిపింది. బడ్జెట్‌ ప్రతిపాదిత ప్రాజెక్ట్‌ల వ్యయానికి సర్కార్‌ కేటాయించిన నిధులకు పొంతన లేకుండా ఉంది. బడ్జెట్‌ ప్రసంగం ప్రతిపాదిత ప్రాజెక్ట్‌లు పూర్తి చేయాలంటే దాదాపు రూ.40 కోట్ల వ్యయం అవుతుందని భావిస్తున్నారు. అయితే కేటాయింపులు మాత్రం వాటికనుగునంగా లేవు. ఎప్పటి లాగే ఈ బడ్జెట్లో సైతం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్వహణపై సర్కార్‌ ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. కుంగిన మేడిగడ్డ పిల్లర్లను రిపేర్‌ చేయడంపై ప్రస్తావించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -