నవతెలంగాణ – హైదరాబాద్ : బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన ‘పనికిమాలినవాడు’, ‘నిరుద్యోగి’ అనే తీవ్రమైన వ్యాఖ్యలకు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తనదైన శైలిలో, హాస్యాన్ని జోడించి బదులిచ్చారు. తనపై కంగనా వ్యక్తిగత విమర్శలకు దిగడానికి కారణం, తాను “యువ హృతిక్ రోషన్‌లా కనిపించడమే” కావొచ్చని తన స్నేహితులు అంటున్నారని ఆయన చమత్కరించారు. ఇద్దరి మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంలో ఈ వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి.
ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖా దత్‌తో మాట్లాడుతూ సౌరవ్ దాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా కంగనా తనను లక్ష్యంగా చేసుకోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “నా స్నేహితులు నాకు టెక్స్ట్ చేసి ‘ఆమె నీ వెనుక ఎందుకు పడింది?’ అని అడుగుతున్నారు. వారిలో ఒకరు ‘నువ్వు బహుశా యువ హృతిక్ రోషన్‌లా కనిపిస్తున్నావేమో’ అని అన్నారు. ఇది నిజమేనా? ఈ గొడవ తర్వాత నా స్నేహితులు నాతో చెప్పింది ఇదే. నా లాంటి వ్యక్తిపై ఆమె ఎందుకు దాడి చేయాలనుకుంటుందోనని ఆశ్చర్యపోయాను” అని నవ్వుతూ చెప్పారు. అయితే, కంగనాపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదని ఆయన స్పష్టం చేశారు.
అభిప్రాయ భేదాలను వ్యక్తిగత దాడులతో కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సౌరవ్ దాస్ సూచించారు. “కంగనా రనౌత్‌పై నాకు వ్యక్తిగతంగా ఏమీ వ్యతిరేకత లేదు. తనే జెన్-జీ పైనా, ఇప్పుడు నాపైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను ఇప్పటికే నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చెప్పాను, ‘యో కంగనా, కాస్త శాంతించు. దీని గురించి మాట్లాడుకుందాం’ అని. ఈ దేశంలో ఉన్న సమస్యే ఇది. ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు. చర్చలు, సంప్రదింపులు తగ్గిపోయాయి. మనం ఒకరినొకరు గౌరవించుకుంటూ సంభాషణలు జరపగలగాలి” అని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులు దేశ యువత గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, వారి మాటలు నిరాశతో కూడుకున్నవిగా ఉన్నాయని అన్నారు. తాము ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.



