Saturday, March 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'చేయి' జారుతున్న జీవన్‌రెడ్డి

‘చేయి’ జారుతున్న జీవన్‌రెడ్డి

- Advertisement -

కాంగ్రెస్‌కు సీనియర్‌ నేత గుడ్‌బై!
ఈ నెల 25 లేదా 27న ముహూర్తం ఖరారు!
అసంతృప్తికి ఆజ్యం పోసిన ‘సంజయ్’ ఎపిసోడ్‌
ఢిల్లీ నుంచి గల్లీ దాకా బుజ్జగింపులూ విఫలం
కాంగ్రెస్‌తో 42 ఏండ్ల అనుబంధానికి బ్రేక్‌ ఖాయం
రాజకీయ వారసురాలిగా కోడలు చరిష్మారెడ్డి ఎంట్రీ!
బీఆర్‌ఎస్‌… బీజేపీ ఎటువైపు అనేది అస్పష్టత

నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ.. పార్టీ కష్టకాలంలోనూ అంటిపెట్టుకుని ఉన్న జగిత్యాలకు చెందిన మాజీ మంత్రి, సీనియర్‌ నేత టి.జీవన్‌రెడ్డి ఇప్పుడు ‘చేయి’ విడిచేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్ కుమార్‌ కాంగ్రెస్‌లో చేరడం, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన ఆధిపత్యం చెలాయించడాన్ని జీవన్‌రెడ్డి ఏమాత్రమూ జీర్ణించుకోలేకపోతున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఎదురైన పరాభవంతో రగిలిపోతున్న ఆయన.. అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏఐసీసీ పెద్దలు, రాష్ట్ర మంత్రులు బుజ్జగిస్తున్నా ఆయన వెనక్కి తగ్గలేదు. ఈ నెల 25న లేదా 27న కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, ఏప్రిల్‌ మొదటి వారంలో ‘గులాబీ’ గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు సమాచారం. ఇదే సమయంలో బీజేపీ కూడా జీవన్‌రెడ్డి ముందు పలు ఆఫర్లు పెట్టడం గమనార్హం.

అసంతృప్తికి ఆజ్యం పోసిన ‘సంజయ్’ ఎపిసోడ్‌
జీవన్‌రెడ్డి అసంతృప్తికి ప్రధాన కారణం జగిత్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్ కుమార్‌ కాంగ్రెస్‌లో చేరడమే. సంజయ్ రాకను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న జీవన్‌రెడ్డి.. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన పెత్తనాన్ని సహించలేకపోతున్నారు. ‘ఆయన అసలు ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియదు.. నాతో కలిసి పనిచేస్తానని ప్రకటించడం ఏంటి?’ అని జీవన్‌ రెడ్డి బహిరంగంగానే ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ప్రభుత్వంతో అభివృద్ధి పనుల్లో కలిసి వస్తే స్వాగతిస్తానని, కానీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చకూడదని ఆయన స్పష్టమైన షరతు విధించారు. దీనికి జగిత్యాల మున్సిపల్‌ ఎన్నికలు మరింత ఆజ్యం పోశాయి. తన అనుచరులకు పార్టీ టిక్కెట్లు ఇప్పించుకోలేని దయనీయ పరిస్థితిలోకి జీవన్‌రెడ్డి వెళ్లడం ఆయనను వేదనకు గురిచేసింది. తన వర్గాన్ని స్వతంత్రులుగా నిలబెట్టి గెలిపించుకున్నా.. చైర్‌పర్సన్‌ ఎన్నికల్లోనూ అధిష్టానం ఆయన ప్రతిపాదనలను ఖాతరు చేయలేదు. దీంతో పార్టీపై తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారించారు.

కాంగ్రెస్‌తో 42 ఏండ్ల అనుబంధానికి బ్రేక్‌..
జీవన్‌రెడ్డి 1980లో మల్యాల సమితి అధ్యక్షునిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, 1983లో టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారే మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఆ తర్వాత 1984 నుంచి కాంగ్రెస్‌ పార్టీతో సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలని నిర్ణయించకున్న ఆయన తన అనుచరులతో పార్టీలో తాను కొనసాగే ఆలోచన లేదని కుండబద్దలు కొట్టారు. ఏప్రిల్‌ 5 నుంచి 10వ తేదీ మధ్యన భారీ జన సమీకరణ (సుమారు 50 వేల నుంచి 70 వేల మంది) నడుమ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ సభకు స్వయంగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హాజరై, జీవన్‌రెడ్డికి పార్టీలో సెక్రెటరీ జనరల్‌ లాంటి కీలక పదవిని కేటాయించే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

ఫలించని రాయబారాలు..
జీవన్‌రెడ్డి చేజారుతున్నారన్న వార్తలతో కాంగ్రెస్‌ అధిష్టానం నష్టనివారణ చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ఫోన్లో చర్చలు జరపగా, ఏఐసీసీ సభ్యులు కత్తి వెంకటస్వామి ఈనెల 17న నేరుగా జగిత్యాలకు వెళ్లి అరగంటపాటు మంతనాలు జరిపారు. ‘నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడిని పార్టీ కోల్పోదు.. ఆయన ఆవేదనలో ఉన్నారు.. అధిష్టానానికి నివేదిస్తాను’ అని వెంకటస్వామి చెప్పారు. కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం సైతం పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ సూచనతో ఈనెల15న జగిత్యాలకు వెళ్లి జీవన్‌రెడ్డిని కలిశారు. అయితే, ‘పార్టీ నన్ను అవమానాలపాలు చేసింది.. ఇక కొనసాగేది లేదు’ అని జీవన్‌ రెడ్డి వారికి తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈనెల 17న మీడియాతో మాట్లాడుతూ.. సీఎల్పీ నేత, పీసీసీ చీఫ్‌ అయిన వారు సీఎం, డిప్యూటీ సీఎంలు అయినప్పుడు పదేండ్లుగా పార్టీలో కొనసాగిన తాను మంత్రి పదవి ఆశించడంలో తప్పులేదని జీవన్‌రెడ్డి సూటి ప్రశ్న సంధించడం గమనార్హం.

రాజకీయ వారసురాలిగా కోడలు చరిష్మారెడ్డి ఎంట్రీ!
ఇప్పటివరకు తన కుటుంబ సభ్యులను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంచిన ఆయన.. మారుతున్న సమీకరణాల నేపథ్యంలో తన చిన్న కోడలు చరిష్మారెడ్డిని బరిలోకి దించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రాబోయే నియోజకవర్గాల పునర్విభజనలో జగిత్యాల స్థానం మహిళలకు రిజర్వ్‌ అయ్యే అవకాశం ఉందన్న అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన చరిష్మారెడ్డి.. గత అసెంబ్లీ, లోక్‌సభ, మున్సిపల్‌ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి స్థానికంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవైపు బీఆర్‌ఎస్‌.. మరోవైపు రాజ్యసభ ఆఫర్‌తో వల వేస్తున్న బీజేపీ.. ఇలా రెండు పార్టీలు జీవన్‌రెడ్డి కోసం పావులు కదుపుతుండటం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -