Saturday, March 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎర్రజెండా నీడన కార్మిక గర్జన

ఎర్రజెండా నీడన కార్మిక గర్జన

- Advertisement -

ఏషియన్‌ పెయింట్‌ యాజమాన్యంపై డ్రైవర్ల చారిత్రాత్మక విజయం
31 రోజుల ధీరోదాత్త పోరాటం.. దిగొచ్చిన ట్రాన్స్‌పోర్ట్‌ యజమానులు
హమాలీ చార్జీలు, కిలోమీటర్‌ భత్యం పెంపునకు అంగీకారం
సమ్మె విరమించిన కార్మికులు

నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
న్యాయమైన హక్కుల కోసం, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం సదాశివపల్లి కేంద్రంగా సాగిన ఏషియన్‌ పెయింట్స్‌ ట్రాన్స్‌పోర్టు డ్రైవర్ల పోరాటం ఫలించింది. 31 రోజులుగా ఎండనక, వాననక రేయింబవళ్లు సమ్మె శిబిరంలో ఎర్రజెండా చేబూని పోరాడిన కార్మికుల పట్టుదల ముందు యాజమాన్యం తలొగ్గింది. సీఐటీయూ నాయకత్వంలో సాగిన ఈ సుదీర్ఘ పోరాటం, కార్మికవర్గ ఐక్యతకు నిలువుటద్దంగా నిలిచింది. దాంతో కార్మికులు సమ్మె విరమించారు.

ఏషియన్‌ పెయింట్స్‌ గోదాం వద్ద పనిచేస్తున్న డ్రైవర్లను పదేండ్లుగా అటు యాజమాన్యం, ఇటు ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్లు తీవ్రంగా వంచిస్తూ వచ్చారు. లోడింగ్‌, అన్‌ లోడింగ్‌ పనులను డ్రైవర్ల తోనే చేయించుకుంటూ, వారికి అందా ల్సిన హమాలీ చార్జీలను కాజేయడం, పైగా ప్రతి వాహనం నుంచీ అక్రమంగా రూ.2800 వసూలు చేయడం వంటి దోపిడీ పర్వం సాగింది. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో డ్రైవర్లు సమ్మె బాట పట్టారు.

పోరాటాన్ని మలుపు తిప్పిన జాన్‌వెస్లీ పర్యటన
ఫిబ్రవరి 26న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సమ్మె శిబిరాన్ని సందర్శించి, కార్మికులకు అండగా నిలవడంతో ఈ ఉద్యమం రాష్ట్ర స్థాయి దృష్టిని ఆకర్షించింది. ‘కార్మికుల శ్రమను దోచుకునే యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి’ అని ఆయన చేసిన హెచ్చరిక అధికార యంత్రాంగంలో కదలిక తెచ్చింది. అది ‘కార్మిక శాఖా లేక యజమానుల శాఖా?’ అని ఆయన సంధించిన ప్రశ్నలు కార్మికుల్లో నూతనోత్తేజాన్ని నింపాయి.

ఒప్పందంలో సాధించిన ప్రధానాంశాలు
సీఐటీయూ రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకు రావడంతో, దిగొచ్చిన గంప వెంకట్‌ లాజిస్టిక్స్‌, దుబ్బ భూషణం ట్రాన్స్‌పోర్ట్‌ యాజమాన్యాలు కార్మికుల డిమాండ్లకు తలొగ్గాయి. లోడింగ్‌, అన్‌ లోడింగ్‌ కోసం ఒక్కో కార్మికుడికి రూ.8 చెల్లించేందుకు అంగీకరించాయి. కిలోమీటరుకు రూ.2 చొప్పున ట్రాన్స్‌పోర్ట్‌ భత్యం (అదనపు చార్జీలు) చెల్లించేలా ఒప్పందానికి వచ్చాయి. గతంలో వసూలు చేసిన అక్రమ సొమ్ముపై స్పష్టత, భవిష్యత్‌లో అటువంటి వసూళ్లు ఉండవని హామీ ఇచ్చాయి.

ఈ ఒప్పందాలన్నింటినీ తక్షణమే అమలు చేస్తూ అధికారికంగా లిఖితపూర్వకంగా ఇచ్చాయి. కార్య క్రమంలో యూనియన్‌ అధ్యక్షులు కామల్ల మహిపాల్‌, కార్యదర్శి కీసర మల్లేశం, కోశాధికారి వెంకటేష్‌, సహాయ కార్యదర్శి మూగ తిరుపతి, వెంకట్‌ రెడ్డి, రమేష్‌ మహేష్‌, వెంకటేష్‌, నాయక్‌, శ్రీకాంత్‌ ,సాయి ,అనిల్‌ , రాజశేఖర్‌, మధు మోహన్‌ ,లక్ష్మణ్‌, కుమార్‌, సాగర్‌ సంజయ్ ,రాజు, విజయ్, తదితరులు పాల్గొన్నారు.

ఐక్యతే మా ఆయుధం
ఇది డ్రైవర్ల విజయం మాత్రమే కాదు.. ఎర్రజెండా ఆశయాల విజయం. సీఐటీయూ జెండా పట్టుకుంటే ఏదైనా సాధ్యమని మరోసారి నిరూపితమైంది. లారీ డ్రైవర్లు, టాటా ఏసీ డ్రైవర్లు, రైస్‌ మిల్‌ ఆపరేటర్లు చూపిన సంఘీభావం అమోఘం. కార్మికులకు ఎక్కడ సమస్య వచ్చినా సీఐటీయూగా తాము చేసే పోరాటాలకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఆ దిశగా పోరాటమూ సాగిస్తున్నాం. -పున్నం రవి, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -