Saturday, March 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు

తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు

- Advertisement -

అవసరమైన గ్రామాల్లో కొత్త బావులు తవ్వండి
నీటి సరఫరాపై సర్పంచ్‌ల ఫీడ్‌బ్యాక్‌ తీసుకోండి : అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో మిషన్‌ భగీరథపై శుక్రవారం హైదరాబాద్‌లోని బీఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయం లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరా పరిస్థితి, నీటి నిల్వల స్థాయి, పంపిణీ వ్యవస్థపై అధికారులు వివరించారు. ప్రధాన రిజర్వాయర్లు, సోర్స్‌ పాయింట్ల వద్ద తగిన నీటి నిల్వలు ఉన్నాయనీ, ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి కొరత తలెత్తే అవకాశాలు లేవని అన్నారు.

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ”సమ్మర్‌ స్పెషల్‌ డ్రైవ్‌” విజయవంతంగా పూర్తి చేసామనీ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా అంతరాయం లేకుండా సాగుతోందని తెలిపారు. గ్రామ స్థాయిలో మిషన్‌ భగీరథ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని వివరించారు. సర్పంచులతో నేరుగా సంప్రదింపులు జరుపుతూ రోజువారీ తాగునీటి సరఫరా పరిస్థితిని తెలుసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 శాతం మంది సర్పంచులతో మాట్లాడి ఫీడ్‌బ్యాక్‌ సేకరించామనీ, వారందరూ తాగునీటి సరఫరాపై సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎక్కడైనా పైపులైన్‌ మరమ్మతులు లేదా ఇతర పనులు చేయాల్సి వస్తే, గ్రామస్తులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచించారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను సమర్థవంతంగా నిర్వహించాలని ఆమె స్పష్టం చేశారు. మిషన్‌ భగీరథ వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రాని గ్రామాలు, మారుమూల ఆదివాసీ గూడాల్లో తాగునీటి కోసం బావులు తవ్వాలనే ప్రజల అభ్యర్థనలు వస్తున్నాయని మంత్రి తెలిపారు. అటువంటి ప్రాంతాల్లో ప్రజల అవసరాలను గుర్తించి, తక్షణమే బోర్లు, బావులు తవ్వే ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా పాండ్స్‌ను తవ్వాలని సూచించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ప్రతి గ్రామానికి నిరంతర నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్‌ శాఖ డైరెక్టర్‌ దివ్య దేవరాజన్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కృపాకర్‌ రెడ్డి, చీఫ్‌ ఇంజినీర్లు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -