కొచ్చిలోని సుభాష్ చంద్రబోస్ పార్కులో పరిశోధన
జీవ పర్యవేక్షణ ఏజెంట్లుగా పనిచేస్తాయని వెల్లడి
కొచ్చి : కొచ్చిలోని సుభాష్ చంద్రబోస్ పార్కులో 20కి పైగా లైకెన్ జాతులను గుర్తించినట్లు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడించింది. 11.5 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ పార్కు లైకెన్లకు ప్రధాన కేంద్రంగా నిలిచింది. మహారాజా కళాశాలలోని నేచర్ క్లబ్, వృక్షశాస్త్ర విభాగం, అలాగే కాలడిలోని శ్రీ శంకర కళాశాల భూమిత్రసేన క్లబ్ సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. జీవవైవిధ్య డాక్యుమెంటేషన్ కార్యక్రమంలో భాగంగా ఈ పరిశోధన జరిగింది. పార్కులోని వివిధ రకాల చెట్ల బెరడుపై పెరుగుతున్న లైకెన్లను ఈ అధ్యయనంలో నమోదు చేశారు. శిలీంధ్రం, ఆల్గే లేదా సైనోబాక్టీరియం మధ్య సహజీవన సంబంధం ద్వారా ఏర్పడే సంక్లిష్ట జీవి లైకెన్. వీటిని తరచుగా శిలీంధ్రాలుగా తప్పుగా భావిస్తారు. ఇవి కొన్నిసార్లు బూజులా కనిపిస్తాయని అందుకే పట్టించుకోరని వారు తెలిపారు.
లైకెన్లు అంటే ఏమిటి?
లైకెన్లు అనేవి శిలీంధ్రాలు, కిరణజన్య సంయోగక్రియ జరిపే జీవులు. సాధారణంగా ఆల్గే లేదా సైనోబాక్టీరియా మధ్య ఏర్పడే ఒక ప్రత్యేకమైన సహజీవన సంబంధం ద్వారా ఏర్పడే సంక్లిష్ట జీవులు. ఈ సంబంధంలో, శిలీంధ్రం ఆల్గే లేదా సైనోబాక్టీరియాకు రక్షణ, స్థిరమైన వాతావరణాన్ని అందిస్తుంది, అయితే ఆల్గే లేదా సైనోబాక్టీరియా కిరణజన్య సంయోగక్రియ ద్వారా శిలీంధ్రానికి ఆహారాన్ని (చక్కెరలు) ఉత్పత్తి చేస్తుంది. అలాగే లైకెన్లు పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. వాయుకాలుష్య సూచికలుగా పని చేస్తాయి. ఇవి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి కార్బన్ సీక్వేస్ట్రేషన్‌కు సహాయ పడతాయి. ముఖ్యంగా కొన్ని రకాల లైకెన్ జాతులు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు. అలాగే వీటి నుండి సహజ రంగులను కూడా ఉత్పత్తి చేస్తారు.
జీవ పర్యవేక్షణ ఏజెంట్లు
లైకెన్లు జీవ పర్యవేక్షణ ఏజెంట్లుగా కీలక పాత్ర పోషిస్తాయని మహారాజా కళాశాల వృక్షశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్, లైకెన్ టాక్సానమీ, ఎకాలజీ నిపుణుడు స్టీఫెన్ సెక్వెరా తెలిపారు. ఆయన మార్గదర్శకత్వంలోనే ఈ అధ్యయనం జరిగింది. స్టీఫెన్ మాట్లాడుతూ, ”కొచ్చికి పచ్చని ఊపిరితిత్తులుగా పరిగణించే మంగళవనం తర్వాత, సుభాష్ పార్కు, దానిలోని స్థానిక చెట్ల సమృద్ధి కారణంగా, ఒక ముఖ్యమైన పట్టణ ఒయాసిస్‌గా ఖచ్చితంగా పరిగణిస్తుంది.” అని అన్నారు. ఈ అధ్యయనం భవిష్యత్ పర్యావరణ పర్యవేక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ కార్యక్రమాలకు విలువైన ప్రాథమిక డేటాను కూడా అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ పరిశొధనలో ఇరినేరియా, పోరినా, గ్రాఫిస్, ఆర్థోనియా వంటి 20 రకాల కొత్త లెకెన్‌లను గుర్తించారు. కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ పరిశోధన, అభివృద్ధి విభాగమైన సెంటర్ ఫర్ హెరిటేజ్, ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ (సి-హెచ్‌ఇడి) అనుమతితో ఈ కార్యక్రమం నిర్వహించారు.



