ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు లావుడియ రాజు..
నవతెలంగాణ – భువనగిరి
పేద విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలలపై అపనిందలు మోపుతూ వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు లావుడియ రాజు తీవ్రంగా డిమాండ్ చేశారు. శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు లావుడియ రాజు మాట్లాడుతూ… ప్రవచనాల పేరుతో పిల్లలపై అసభ్యంగా, అవమానకరంగా మాట్లాడిన గరికపాటి వ్యాఖ్యలు పూర్తిగా అమానవీయమైనవన్నారు.
ముఖ్యంగా విద్యార్థులను “శోభనం పెళ్లికొడుకు”తో పోల్చడం అనేది విద్యార్థి లోకాన్ని అవమానించడమేనన్నారు. పేద పిల్లలు కేవలం కోడిగుడ్డు కోసమే బడికి వస్తున్నారని చెప్పడం వారి పేదరికాన్ని ఎగతాళి చేయడమేనని విమర్శించారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల హాజరు పెరగడానికి, డ్రాపౌట్ తగ్గించడానికి, పౌష్టికాహార లోపాన్ని తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తున్నదని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. స్వయంగా సుప్రీంకోర్టు ఈ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అలాంటి పథకాన్ని అవహేళన చేస్తూ మాట్లాడటం గరికపాటి అజ్ఞానాన్ని, బాధ్యతారాహిత్యాన్ని బయటపెడుతుందన్నారు.
దేశంలో సుమారు 84% మంది తల్లులు, పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న సమయంలో, విద్యార్థులకు అందించే గుడ్డును “గాడిద గుడ్డు”గా వ్యాఖ్యానించడం ఆకలిని, పేదరికాన్ని కించపరచడమేనని తీవ్రంగా ఖండించారు. విద్యార్థులకు ఉచిత భోజనం, పుస్తకాలు, యూనిఫాంలు అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని, దానిని “బిచ్చం”గా అభివర్ణించడం సిగ్గుచేటని విమర్శించింది. కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే లక్షల కోట్ల రాయితీలపై ఎప్పుడూ స్పందించని గరికపాటి, పేద పిల్లలకు అందించే భోజనంపై విషం కక్కడం దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ హెచ్చరించారు.



