బడ్జెట్ ప్రతులు దగ్ధం
నవతెలంగాణ – కంఠేశ్వర్
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక నాందేడ్ వాడలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయం వద్ద బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో విద్యారంగంపై చేసిన ప్రకటనలు వాస్తవ పరిస్థితులకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) జిల్లా కమిటీ తీవ్రంగా విమర్శించింది. ఆర్ధిక మంత్రి ప్రసంగంలో భారీ హామీలు, గొప్ప పదజాలం వినిపించినా, క్షేత్రస్థాయిలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపలేదు. బడ్జెట్ ప్రసంగంలో నాణ్యమైన విద్య, అంతర్జాతీయ ప్రమాణాలు, డిజిటల్ అభివృద్ధి, వంటి మాటలు పదే పదే వినిపించినా, అవి కేవలం అంకెల గారడీ మాత్రమేనని ఎస్.ఎఫ్.ఐ అభిప్రాయపడింది.
వాస్తవానికి మొత్తం రాష్ట్ర బడ్జెట్ 3,24,234 కోట్లలో లో విద్యారంగానికి కేటాయించిన వాటా 26,674 కోట్లు (8.22%) ఇది కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో మొదటి బడ్జెట్లో 15% కేటాయింపు చేస్తామని ఇచ్చిన హామీని పూర్తిగా ఈ బడ్జెట్లో కూడా విస్మరించింది కనీసం 10 శాతానికి కూడా చేరుకోకపోవడం ప్రభుత్వం మాటలకూ, చేతలకూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బహిర్గతం చేస్తోంది. ప్రభుత్వం యూనివర్సిటీల అభివృద్ధిపై గొప్పలు చెప్పుకుంటున్నా, ఉస్మానియా, కాకతీయ వంటి విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కొరత తీవ్రమైన స్థాయిలో ఉంది. గత బడ్జెట్‌లో ప్రకటించిన నిధులు కూడా విడుదల కాలేదు. నేడు మళ్లీ అదే యూనివర్సిటీలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం అనడం విద్యార్థులను మోసం చేయడమేనని ఎస్.ఎఫ్.ఐ భావిస్తోంది.
బడ్జెట్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలపై ప్రభుత్వం 4,343కోట్లు కేటాయింపు చేస్తామని చెప్పారు కానీ గత బకాయిలు భారీగా పేరుకుపోయిన వాటి గురించి ప్రస్తావన లేదు. ఈ సంవత్సరం ఫీజులు మళ్ళీ అదనంగా ఉంటాయి.సుమారు రూ. 9,500 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయినా, వాటి చెల్లింపుపై స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటమేనని ఎస్ఎఫ్ఐ విమర్శిస్తుంది. ఉపాధి అంశంలోనూ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఎస్.ఎఫ్.ఐ ఆరోపించింది. బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన నియామకాల సంఖ్యలు వాస్తవానికి గతంలో ప్రారంభమైన ప్రక్రియలే తప్ప కొత్త అవకాశాలు కావని స్పష్టం చేసింది.
ఇంటర్ విద్యార్థులు మధ్యాహ్నం భోజనం., 118 ఎసిటి(ఐటిటి )విద్యార్థులకు నెలకు 2000/- స్కాలర్ షిప్స్ సాయం,బాగానే ఉన్నా ఆచరణలో అమలు చేయాలని అన్నారు. తక్షణమే బడ్జెట్ సవరించి విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 30% నిధుల కేటాయింపులు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల తక్షణ చెల్లింపులు చేయాలి.ప్రభుత్వ యూనివర్సిటీలకు తక్షణ నిధుల విడుదల చేసి, ఖాళీగా ఉన్న టీచర్, మరియు అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా మాటలకే పరిమితం కాకుండా, విద్యార్థుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి చక్రి, సుజిత్, కిరణ్, జాన్, దాస్ , నవీన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.



