Sunday, March 22, 2026
E-PAPER
Homeకవర్ స్టోరీఅరచేతిలో అబ్రకదబ్ర

అరచేతిలో అబ్రకదబ్ర

- Advertisement -

టీచరమ్మ ఇంట్లో మంచం మీద కూర్చుని పేపర్లు దిద్దుతోంది. ఆ రోజు తరగతిలో పిల్లలతో రాయించిన వ్యాసాలు అవి. ‘దేవుడు కనపడి వరం కోరుకోమంటే ఏం అడుగుతావు?’ అనే అంశం మీద రాశారు పిల్లలు. టీచరమ్మ ఉన్నట్లుండి వెక్కి వెక్కి ఏడవ సాగింది. ‘ఏమైంద’ని భర్త అడిగాడు. ఒక కుర్రాడి పేపరు చదివి వినిపించిందామె. దేవుడు ఏం వరం కావాలని అడిగితే ‘నన్ను మా అమ్మానాన్నల చేతుల్లో స్మార్ట్‌ ఫోన్‌గా మార్చేయమంటాను. వాళ్ళకి ఫోన్‌ మీద ఉన్న ప్రేమ నా మీద లేదు. ఎప్పుడూ ఫోన్‌ పట్టుకునే ఉంటారు.

ఫోన్లో మాట్లాడేటపుడు నేను దగ్గరి కెళితే దూరంగా తోసేస్తారు. బయటే కాదు బాత్రూమ్‌లోకీ ఫోన్‌ తీసికెళతారు. ఫోన్‌ మోగిందంటే పరిగెడతారు. అదే నేను పడిపోయి ఏడ్చినా పట్టించుకోరు. ఫోన్‌ పక్కన పెట్టుకొని పడుకుంటారు. తెల్లారే లేవగానే కళ్ళు తెరిచి ముందుగా ఫోన్‌నే చూస్తారు. నేను ఫోనుగా మారితే ఇరవై నాలుగు గంటలూ వారి చేతుల్లోనే ఉంటానుగా!’ ‘ఎంత బాధపడి రాశాడో! రాసిందెవరు?’ అడిగాడు భర్త. ‘మన అబ్బాయే!’ అంది టీచరమ్మ కళ్ళు తుడుచుకుంటూ.

ఇప్పుడు అందరి అర చేతుల్లో ప్రపంచమంతా తిప్పి చూపే మొబైల్‌ ఫోన్‌ ఉంది. పక్కనే ఉన్న మనిషి బాధలను, భావాలను పట్టించుకునే తీరిక మాత్రం ఎవరికీ లేదు. టెక్నాలజీ మనుషుల్ని దగ్గర చేసింది. ఆత్మీయతలు దూరం చేసింది. స్మార్ట్‌ఫోన్‌గా సెల్‌ఫోన్‌ ఇప్పుడు అందరికీ అందిన అబ్రకదబ్ర! ఈ రోజుల్లో పెద్దలు చెప్పింది పిల్లలు వినరు. వారు ఏది చేస్తే పిల్లలు అది చేస్తారు. ఏదైనా పెద్దలను చూసి నేర్చుకుంటారు. మొబైల్‌ ఫోన్‌ అలవాటూ అలాంటిదే. అన్నం తినని పిల్లల ఏడుపు ఆపడానికి,

తమ పనులకు అడ్డు రాకుండా ఉండడానికి పిల్లలకి ఫోన్లు ఇచ్చి ఊరుకోబెడుతున్నారు పేరెంట్స్‌. ఇది పిల్లలకు ఒక పరికరాన్ని ఇవ్వడం కాదు. ఒక అపరిమితమైన, నియంత్రణ లేని ప్రపంచానికి వారిని పరిచయం చేయడమే. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ పిల్లల చేతుల్లో టైమ్‌ బాంబ్‌ అయి కూర్చుంది. మొబైల్‌కు అడిక్ట్‌ అయిన పిల్లల జీవితాలు డేంజర్‌ జోన్లో పడిపోతున్నాయి. ఇరవై నాలుగు గంటలూ మొబైల్లో మునిగిపోయి పిల్లలు ఆడుకోవడం, మాట్లాడడం మరిచిపోతున్నారు. లక్షల కొద్దీ వీడియోలు, కోట్ల కొద్దీ పాటలు. ఇదే ఇప్పటి పిల్లల ప్రపంచం! ఆరు అంగుళాల స్క్రీన్‌లో బాల్యం బందీ అయిపోతుంది.

మొబైల్‌ గుప్పెట్లో పిల్లలు
స్క్రీన్‌ టచ్‌ చేసిన ప్రతిసారీ పిల్లల మెదడులో సంతోషాన్ని ఇచ్చే రసాయనం ‘డోపమైన్‌’ విడుదలవుతుంది. అయితే అది వెంటనే తగ్గిపోతుంది. దాని కోసం మరో వీడియో కావాలి. ఇంకో గేమ్‌ కావాలి. ఇంకో రీల్‌ కావాలి. అలా మొబైల్‌ వలయంలో పిల్లలు చిక్కుకుపోతున్నారు. పిల్లల వ్యక్తిత్వం రూపుదిద్దుకునే దశ ఇది. త్వరగా గ్రహించడం, అడాప్ట్‌ చేసుకోవడం ఈ దశ లక్షణం. మంచి కన్నా చెడుకి ఎక్కువ ఆకర్షితులయ్యే వయసు! మొబైల్‌ పిల్లల మస్తకాన్ని లాగేసింది. పుస్తకాన్ని చింపేసింది. యూట్యూబ్‌ వీడియో మధ్యలో యాడ్‌ వస్తుంది. పిల్లలు ‘స్కిప్‌ నొక్కుతారు. యాడ్‌ వెళ్ళి పోతుంది. ఇలా బ్రెయిన్‌ అలవాటు పడుతుంది. ఒక్క ‘క్లిక్‌’లో పనులు అయిపోవాలనేది పిల్లలు నేర్చుకుంటారు. జీవితంలో ఒక్క ‘క్లిక్‌’ సమయంలో పని జరగనపుడు పిల్లలు తట్టుకోవలేరు. డిప్రెస్‌ అయిపోతారు.

స్మార్ట్‌ ఫోన్‌ డ్రగ్స్‌ కంటే ప్రమాదకరం
సేల్‌ ఫోన్‌ సిగల్స్‌తో వచ్చే రేడియేషన్‌ వల్ల పిల్లల్లో మెదడు సంబంధ వ్యాధులు వస్తున్నాయి. డిజిటల్‌ అడిక్షన్‌ వల్ల మానవ సంబంధాలు అడుగంటి పోతున్నాయి. సెల్‌ఫోన్‌ స్క్రోలింగ్‌ మూలంగా పిల్లలకి పెన్సిల్‌ పట్టుకునే గ్రిప్‌ కూడా ఉండటం లేదు. ఇంకా కంటిచూపు దెబ్బ తింటుంది. ఒబేసిటీ వస్తుంది. న్యూరలాజికల్‌ నెట్‌వర్క్‌ పాడయిపోతుంది. సర్వేకల్‌ సమస్యలు వస్తాయి. చిరాకు, అసహనం, కోపం, నిర్లక్ష్యం వంటి లక్షణాలు పెరుగుతాయి. పిల్లల్లో సెన్సివిటీ తగ్గుతుంది. మొబైల్‌ అడిక్షన్‌ డ్రగ్స్‌ కంటే ప్రమాదకరం!

పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే
పిల్లల్ని పట్టించుకోండి. వారిని సెల్‌ఫోన్ల పెంపకంలో వదిలేయకండి. లాప్టాప్‌ల ప్రాపకంలో విడిచి పెట్టకండి. పిల్లల్ని మరలు, యంత్రాల పాలు చేయకండి. వాళ్ళు రోబోలు కాదు. పాలుగారే పసివాళ్లు. పిల్లలకి మొబైళ్ళ ఒంటరి గదుల్లోంచి విముక్తి కలిగించండి. వారికి స్నేహం విలువ తెలియాలి. త్యాగం, ఔన్నత్యం గురించి గుర్తెరగాలి. నలుగురితో పంచుకొని స్నేహాన్ని పెంచుకొనే మంచిని వారు ఆస్వాదించాలి. పది, పదిహేనేళ్ళ తర్వాత పిల్లల్లో వచ్చే మానసిక అనారోగ్య సమస్యల్ని ఆపగల అవకాశం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. కానీ, ‘నేను చాలా బిజీ. నా పని చాలా ముఖ్యం, టైమ్‌ లేదు. అందుకే నా బిడ్డని కామ్‌ చేయడం కోసం మొబైల్‌ని చేతికి ఇస్తున్నాను’ అని సాకు చెప్పకండి. అది చాలా పెద్ద తప్పిదం. పిల్లల కోసం డబ్బు కాదు. టైమ్‌ ఇన్‌వెస్ట్‌ చేయండి. బాల్యం ఒక్కసారే వస్తుంది. అది మిస్‌ అయితే మళ్లీ రాదు. స్టీవ్‌ జాబ్స్‌ సెల్‌ఫోన్‌ కనిపెట్టి ఈ ప్రపంచంలో ఒక సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు. ఒక బిలియన్‌ కంటే ఎక్కువ ఫోన్లు రోజూ సేల్‌ అవుతున్నాయి.

కానీ, ఆయన తన పిల్లల్ని ఐఫోన్‌ వాడనివ్వ లేదు. దానికి అలవాటు పడితే ఏమవుతుందో ఆయనకి బాగా తెలుసు. ఫేస్‌బుక్‌ సిఇవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ తను ఓన్‌ చేసిన ఫేస్బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రాంలలో టైమ్‌ పాస్‌ చేస్తూ కూర్చోడు. తనకు తెలుసు వాటి వల్ల ఏం లాభం లేదని, సేల్స్‌ పెంచడం ఎలాగా? అని నిత్యం ఆలోచిస్తుంటాడు. ఎదుగుతున్న వయసులో పిల్లలకి మొబైల్‌ ఫోన్‌ అవసరం లేదు. పుస్తకాలు ఉండాలి. యాక్టివిటీస్‌ చేయాలి. కనెక్టివిటీ కావాలి. సోషల్‌ స్కిల్స్‌ నేర్వాలి. పిల్లలు గంటల తరబడి మొబైల్‌ ఫోన్‌ చూస్తుంటారు. కాని, అటు వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ రాదు. రియాక్షన్‌ ఉండదు. అందువల్ల పిల్లలల్లో కమ్యూనికేషన్‌ పెరగదు. మాట్లాడడం రాదు. పిల్లలతో కలసి ఆడుకుంటేనే ఆటపాటల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెరుగుతాయి. మానవ సంబంధాలు బల పడతాయి.



స్టోరీ టెల్లింగ్‌ ఒక్కటే మార్గం
స్మార్ట్‌ ఫోన్‌ అడిక్షన్‌ నుండి పిల్లల్ని దూరం చేయాలంటే నిషేధం కాదు. ప్రత్యామ్నాయం కావాలి. అది ‘స్టార్ట్‌ లెర్లింగ్‌’ మాత్రమే! మొబైల్‌ని పూర్తిగా తీసేయ లేము. కథలు చెప్పే ప్రక్రియతో దాని ప్రభావాన్ని తగ్గించగలం. కథలు చెప్పడం – లైవ్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌! కథలు పిల్లల మెదళ్ళలో విజువల్‌ స్క్రీన్‌ని సృష్టిస్తాయి. సరైన విధానంలో చెపితే ఫోన్‌ స్క్రీన్‌ ఇచ్చే ‘కిక్‌’ కథ కూడా ఇస్తుంది. పిల్లలు కథలు వినటమే కాదు అనుభూతిస్తారు. కథల వల్ల పిల్లలు ఆలోచిస్తారు. ఊహిస్తారు. కథలో లీనమై పోతారు. మొబైల్‌ని మరిచి పోతారు. ‘స్టోరీ టెల్లింగ్‌’ గొప్పదనం అదీ! స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్‌ కన్నా మన ముఖం, కళ్ళు, చేతులు ఎక్కువగా ఆకట్టుకుంటాయి. కట్టి పడేస్తాయి. వీటిని సమర్థవంతంగా వాడడం నేర్చుకోవాలి. అది ‘స్టోరీ టెల్లింగ్‌’ వల్లనే సాధ్యం! కథలు చెప్పడం కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కి పునాది. హ్యూమన్‌ రిలేషన్స్‌ అభివృద్ధి పరిచే వారధి. మొబైల్‌ అడిక్షన్‌ను అధిగమించే పదునైన ఆయుధం!

రీల్స్‌కి రివర్స్‌ గేర్‌ కథలు
కథలు చెప్పడం ఒకప్పటిలా కాదిప్పుడు. చిటికెలో అయిపోవాలి. అంతా ఇనిస్టెంట్‌! చాటింగ్‌లా ఒక్క ముక్కలో చెప్పాలి. యూట్యూబ్‌ షార్ట్స్‌లా అర నిమిషంలో టాలెంట్‌ చూపించాలి. ఇనిస్టాలో రీల్స్‌లా అలా వచ్చి ఇలా వెళ్ళి పోవాలి. సెల్‌ ఫోన్‌లో బందీలైన పిల్లలకి పవర్‌ ఫుల్‌ కథలు చెప్పండి. వారిని మనుషుల వైపుకి, చదువుల వైపుకి, ఆటల వైపుకి దారి మళ్ళించండి. మంచి ఫలితాలు వస్తాయి.

అమ్మా నాన్నలకు తీరిక ఉండదు. మామ్మ, తాతయ్యలు దగ్గరలో ఉండరు. టీచర్లు సిలబస్‌ పూర్తి చేసేందుకు పాఠాలే చెపుతారు. మరి పిల్లలకు కథలు ఎవరు చెపుతారు?! దీంతో పిల్లలు స్మార్ట్‌ఫోన్‌, టాబ్‌, కంప్యూటర్‌లనే దోస్తులుగా చూసుకుంటున్నారు. వాటితో అనుబంధం పెంచుకుంటున్నారు. వాటికి అడిక్ట్‌ అవుతున్నారు. సోషల్‌ మీడియా ఊబిలో కూరుకుపోతున్నారు. తప్పు ఎవరు చేస్తున్నా, కారణాలు ఏవైనా చివరికి బలి అవుతున్నది బాల్యమే! పిల్లలే!!

పిల్లలకి GREAT వాల్యూస్‌ నేర్పండి
G – Giving – ఇవ్వడం నేర్పండి – ప్రపంచానికి ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది.
R- Reading – పుస్తక పఠనం – అది ఇచ్చే విజ్ఞానం అపరిమితం
E – Express – భావ ప్రకటన – కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచండి
A – Appreciate – ప్రశంసించండి – పిల్లలు వికసిస్తారు
T – Telling Stories – కథలు చెప్పండి – అభివృద్ధికి అవే మూలం

లుక్‌ కల్చర్‌ విజృంభిస్తోంది
పిల్లలకు కథలు చెప్పే కళని ఒక సామాజిక విలువగా భావించాలి. కథలు వినడం వల్ల ఒక జాతి తాలూకు సంస్కృతిని అర్థం చేసుకుంటారు. సమాజంలోని మొత్తం విలువలు అవగాహనలోకి వస్తాయి. నిజానికి కథలు వినడం ‘ఒక విద్యా పరికరం.’ ‘సామాజిక బంధపు’ భావాన్ని రేకెత్తించడానికి కథలు చాలా అవసరం. కథలు పిల్లల్లోని ఊహాశక్తికి రెక్కలు మొలిపిస్తాయి. కంప్యూటర్‌ గేమ్స్‌, స్మార్ట్‌ఫోన్స్‌ ఆ పని చేయలేవు. ఇప్పుడు మెదడుకి మేత తగ్గింది, కళ్ళకు శ్రమ పెరిగింది. బుక్‌ కల్చర్‌ తగ్గింది. లుక్‌ కల్చర్‌ పెరిగింది..

‘చెప్పేది వినడం’ వ్వక్తిత్వ వికాసంలో ముఖ్యమైన అంశం. ఈ లక్షణాన్ని చిన్నతనం నుంచే పిల్లలకి నేర్పాలి. ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వినడం, విని గుర్తు పెట్టుకోవడం గొప్ప కళ. కథలు వింటూ పెరిగిన పిల్లలు పెద్దయ్యాక క్రమశిక్షణతో ఉంటారు. ‘మా మాట వినరా బాబు!’ అని పెద్దలతో చెప్పించుకొనే దుస్థితిలో ఉండరు. మనకు ‘మాట్లాడ’ డానికి శిక్షణ ఇచ్చే సంస్థలు ఉన్నాయి. కాని ‘వినడం’ నేర్పడానికి సంస్థలు లేవు. అందుకే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకి కథలు చెప్పాలి. అందుకు వారికి సమయం కేటాయించాలి.

మీ పిల్లలకి సమయం ఇవ్వండి
ఒక వ్యాపారవేత్త నెలల తరబడి బిజీగా ఉండేవాడు. తన ఆరేళ్ళ కూతురిని పట్టించుకునేవాడు కాదు. ఒక రోజు ఇంటికి వచ్చిన తండ్రి గంట నుంచి ఫోనులో మాట్లాడుతూ ఉన్నాడు.
‘నాన్నా! నీవు గంటకి ఎంత సంపాదిస్తావు?’ అంది పాప.
”వెయ్యి రూపాయలు” అన్నాడు తండ్రి.

పాప పరుగున వెళ్లింది. తన కిడ్డీ బ్యాంక్‌ తెచ్చింది. దానిలోంచి తాను దాచుకున్న అయిదు వందల అయిదు వందల రూపాయిల చిల్లర తండ్రి ముందు పోసింది.
‘నాన్నా! ఈ అయిదు వందలు తీసుకుని నా కోసం ఒక అరగంట సమయం ఇవ్వు. ఈ వేళ నా పుట్టిన రోజు’ అంది. తండ్రి గుండె జల్లుమంది. వెంటనే పాపని గుండెలకి హత్తుకున్నాడు.
పిల్లలకు కథలు చెప్పే ఓపిక లేని తల్లిదండ్రులు తమ పిల్లల భవితవ్యాన్ని కంప్యూటర్లు, టాబ్‌లు, స్మార్ట్‌ ఫోన్లకు వదిలేయకండి. మొబైల్‌ అడిక్షన్‌కు బలై మానసిక రోగులుగా, మేధకులుగా మారేలా చేయకండి. ‘మేం వారి కోసమే కదా ఇంత కష్టపడుతున్నాం’ అనే సాకులు చెపుతూ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. వారి భవిష్యత్తును నాశనం చేయకండి.

ఒంటరిగా ఉన్నపుడు, ఒత్తిడిలో ఉన్నపుడు ఫోన్‌ స్క్రీన్‌ మనకు తోడులా అనిపిస్తుంది. పిల్లలే కాదు అరవై ఏళ్ళ వృద్ధులు సైతం ఒంటరితనం పోగొట్టుకోవడానికి స్మార్ట్‌ఫోన్‌ని చూస్తున్నారు. నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గటం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే పనికి రాని చెత్త సందేశాలు, అబద్ధాల సమాచారంతో మీ కళ్ళను, బుర్రను నింపుకోకండి, స్క్రీన్‌ టైమ్‌ తగ్గించుకోండి. రీల్స్‌పై కాకుండా రియల్‌ లైఫ్‌ మెరుగుదలపై దృష్టి పెట్టండి. ఆన్‌ లైన్‌ ఆమోదాల కన్నా ఆఫ్‌లైన్‌ ఉన్నతి ముఖ్యం. సోషల్‌ మీడియా వినియోగాన్ని కట్టడి చేయండి. అందుకు ‘కథలు చెప్పడం’ ఒక్కటే సులువైన మార్గం!

‘నాకు కథలు రావు. చెప్పడం చేత కాదు. అంత టైమ్‌ కేటాయించ లేను’ అని వెనకడుగు వేయకండి. పూర్వం రోజుల్లో లాగా గంటల తరబడి కథలు చెప్పే అవసరం లేదు. రోజంతా చదువులతో అలసి పోయిన పిల్లలు కథలు మొదలు పెట్టగానే అయిదు నిముషాల్లో నిద్రపోతారు. నిమిషం కథలు, అర నిమిషం కథలు, పావు నిమిషం కథలు.. పుస్తకాలు మీ కోసం చాలా సిద్ధంగా ఉన్నాయి. వాటిని తిరగేయండి. మీ మానసిక ఆహ్లాదంతో పాటు మీ పిల్లలకి సమయం కేటాయిస్తున్న తృప్తి కలుగుతుంది. మీ పిల్లలూ మిమ్మల్ని ప్రేమిస్తారు. ఆ ప్రేమలోని మాధుర్యాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదిస్తారు. అంతకు మించి మీకేం కావాలి?

‘క్లాస్‌ రూమ్‌ స్టోరీ టెల్లింగ్‌’ అంటే?
ఈ డిజిటల్‌ యుగంలో టీచర్లు ఎదుర్కొనే పెద్ద సమస్య.. పిల్లల్ని తరగతి గదిలో కూర్చోబెట్టడం. పిల్లల దృష్టి గజిబిజిగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌, రీల్స్‌, డిజిటల్‌ గేమ్స్‌, టాబ్‌ వంటి ఆకర్షణల్లో కూరుకు పోయివుంటారు. అయితే పిల్లలకి పాఠాలు చెప్పడం కష్టం కాదు. వారి మనసుల్ని క్లాసులో ఉంచడం కష్టం. ఇక్కడే ‘స్టోరీ టెల్లింగ్‌’ ఒక శక్తివంతమైన సాధనంగా పని చేస్తుంది. ‘క్లాస్‌ రూమ్‌ స్టోరీ టెల్లింగ్‌’ అంటే కథలు, కబుర్లు చెప్పి టైమ్‌ పాస్‌ చేయడం కాదు. పాఠాల్ని కథలుగా మార్చి చెప్పటం. కథతోనే తరగతి ప్రారంభించాలి. ప్రతి సబ్జెక్టును కథలా రూపుదిద్దాలి. కథల్ని స్మార్ట్‌ ఫోన్‌ కంటే ఆసక్తికరంగా మార్చాలి. పిల్లల చేతిలోని మొబైల్‌ పోవాలంటే వారి మనసుల్లోకి కథలు దూరాలి. పిల్లలు పాఠాలను కాదు అనుభవాలను గుర్తు పెట్టుకుంటారు. మీ అనుభవాలను కథలుగా చెప్పండి. అపుడే పాఠాలు ప్రాణాలు పోసుకుంటాయి. పిల్లల్లో వినే ఆసక్తి పెరుగుతుంది. టీచర్‌ మాటకి విలువ పెరుగుతుంది.

పిల్లలు ఆసక్తిగా కథలు వింటారు
రాకేష్‌ పెంచుతున్న కుక్క పిల్లకి జ్వరం వచ్చింది. డాక్టరు సిరప్‌ రాసిచ్చాడు. రెండు పూటలా కుక్కకి తాగించమన్నాడు. ఇంటి దగ్గర కుక్క పిల్లకి సిరప్‌ తాగించబోయాడు. అది గిలగిల లాడింది. బలవంతంగా నోరు తెరిచి పోయాలను కున్నాడు. కుదర లేదు. మొరాయించింది. తల విదిలించింది. సీసా కింద పడింది. పగిలి పోయింది. సిరప్‌ నేలపై ఒలికి పోయింది. రాకేష్‌కి కోపం వచ్చింది. తన గదిలోకి వెళ్ళాడు. తలుపులు వేసుకున్నాడు. కాసేపటికి కోపం తగ్గింది. బైటకి వచ్చి చూశాడు. కుక్క పిల్ల నేల మీద ఒలికిన సిరప్‌ని నాకుతోంది. అపుడు రాకేష్‌కి అర్థమయింది. కుక్క పిల్ల మందుకి వ్యతిరేకం కాదు. వేసే పద్ధతికే వ్యతిరేకయని.

అలాగే పిల్లలు కథలు వినడానికి వ్యతిరేకం కాదు. కథ చెప్పే పద్ధతికి మాత్రమే వ్యతిరేకం. ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా కథ చెపితే ఎవరు వినరు చెప్పండి? కథ చెప్పేటపుడు మనం కథల్లోని పాత్రల్ల్లో దూరి పోవాలి. ఆయా పాత్రల్లా మాట్లాడాలి. పరాక్రమం, భయం, ఆశ్చర్యం, కరుణ రసాలను కంఠంలో పలికించాలి. దానికి బాడీ లాంగ్వేజ్‌ ఉపయోగించాలి. పిల్లలు కథల్లో ఎంతగా లీనమై పోతారంటే – ప్రతి క్షణమూ వాళ్ళు స్పందిస్తునే ఉంటారు. ఒక కథను ఎన్ని సార్లయినా విని పించండి..వారు వింటారు. అందుకే పేరెంట్స్‌, టీచర్స్‌ కథలు చెప్పడం నేర్చుకోండి. కథల ద్వారా మనసులను గెల్చుకోండి. మన సంస్కృతిని, పిల్లల్ని కథలు కాపాడతాయి. పిల్లల్ని మొబైల్‌ అడిక్షన్‌ నుంచి తప్పించడానికి ఇపుడు కథల అవసరం మరింత పెరిగింది.

ఒక టీచరు కథ చెపితే – తరగతి గది మారుతుంది.
ఒక పేరెంట్‌ కథ చెపితే – పిల్లలు మారతారు.
ఒక మనిషి కథ చెపితే – సమాజం మారుతుంది.

చొక్కాపు వెంకటరమణ,
కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత
‘మాస్టర్‌ స్టోరీటెల్లర్‌’ మెజీషియన్‌
9246520050

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -