చలనచిత్ర రంగంలో సైలెంట్ చిత్రాల కాలం నుండి కూడా తరచి చూసిన కొద్ది తరుణి జీవితమంతా కూడా బాధా మయంగానే కనిపిస్తుంది. వెండితెర పై కనిపించి తమ ఆశలు కలలను నిజం చేసుకోవాలనే ప్రయత్నంలో వారు ఎదుర్కొన్న సమస్యలు, ఆటుపోట్లు అన్నీ కూడా వారిని ఊహలకు అందకుండా ఏ మూలకో నెట్టివేయబడతారు. అలాంటి వారు సినిమా పరిశ్రమకు, ఆ తర్వాత ఈ ప్రపంచానికి కూడా దూరమైపోతారు. ఆ కోవకు చెందిన తొలితరం కథానాయకనే కమలా కోట్నీస్.
ఇంగ్లీషులో గ్లామర్, శృంగారం, ఊంఫ్ అన్నా పదాలకు తెలుగులో అర్థాలుగా సరైన పదాలు ఉన్నవో లేవో కానీ వాటికి మొట్టమొదటి కనిపించే ఉదాహరణగా సినీ రంగంలో కమలాకోట్నీస్‌ను చెప్పుకుంటారు. కమలాకోట్నీస్‌ది కేవలం ఒక దశాబ్దపు సినీ జీవితం. సినిమాలలో ఆమె ఉన్నది తక్కువ కాలమే అయినా ఒక ప్రసిద్ధ చలనచిత్ర నటిగా చరిత్రకెక్కింది. ఆమె ప్రత్యేకత ఏమిటంటే తొలితరం మహిళా నిర్మాతలలో ఆమె కూడా ఒకరు. ఆంగ్లో ఇండియన్ అయిన ఈమె 1940-50ల మధ్య కాలంలో పలు తెలుగు, హిందీ చిత్రాలలో నటించింది. 1946లో బాలీవుడ్ నటుడు దేవానంద్‌కు తొలి హీరోయిన్‌గా నటించడం ఈమె ప్రత్యేకత.
అసలు పేరు కమల. ఇప్పటివరకు అందరూ ఆమెను కర్నూలులో పుట్టినట్లుగా పేర్కొంటున్నారు. కానీ ఆమె 1928లో హైదరాబాదులో జన్మించింది. ఆమెది మిశ్రమ వారసత్వం. తల్లి రెల్లి సామాజిక వర్గానికి చెందిన పళ్ళ వ్యాపారం చేసే తెలుగు వనిత. తండ్రి బ్రిటిష్ జాతీయుడు. సైన్యంలో పని చేసేవాడు. కొద్దికాలం తర్వాత అతను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయాడు. ఈ కారణం చేత బాల్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో వుండే ఒక జమిందార్‌కు దత్తత ఇవ్వబడింది. తదనంతరం కమలాబాయిగా మారింది. జమీందారు పెంపకంలో ఆమె విలాసవంతంగా పెరిగింది. ఆమె శాస్త్రీయ సంగీతం, నత్యాలతో పాటు ఉన్నత విద్యను అభ్యసించింది.
ఈ రెండూ ఆమె సినీ కెరీర్‌కు మార్గం సుగమం చేసినవి. కమల ఆధునిక స్ఫూర్తికి, తన స్వతంత్ర జీవనశైలితో నలుగురి నోళ్ళలో నానేది. మహిళలకు నాటి సమాజంలో ఆంక్షలు అమలు అవుతున్న ఆ రోజులలో అరుదుగా స్త్రీలు స్వతంత్రంగా జీవనం గడిపే కాలంలో ఆమె కార్లు నడపేది. మోటార్ సైకిళ్ళపై రైడింగ్ చేసేది. ఇవన్నీ కూడా కమలకు ఫ్యాషన్ ప్రపంచపు రాణిగా గుర్తింపు తెచ్చినవి. ఈ ఆధునిక జీవన శైలి వలననే కమల సినిమా రంగంలోకి అత్యంత సునాయాసంగా ప్రవేశించగలిగింది. సినిమా పరిశ్రమలోకి ప్రవేశించాలంటే ఆనాడు కూడా అందం ఆకర్షలణే తొలి అర్హతలుగా ఉండేవి. అవన్నీ కమలలో పుష్కలంగా ఉన్నవి.
విమెన్స్ లిబ్, బ్రా బర్నింగ్ ఇవన్నీ పాశ్యత్య సమాజానికి తెలియని ఆకాలంలోనే కమలాకోట్నిస్ ఒక ‘లిబరేటేడ్ వుమెన్’ గా ప్రచారంలోకి వచ్చింది. కమలా లక్ష్మణ్ సినీ జీవితంలో మైలురాళ్ళు అనదగిన కాలం 12 సంవత్సరాల చిన్న వయసులోనే ప్రారంభమైంది. ఆమె కెరీర్ స్వల్పకాలికంగానే ఉన్నప్పటికీ ప్రభావవంతమైన నటిగా చెప్పుకోబడింది. అది దాదాపు ఒక దశాబ్దం పాటు కొనసాగింది. 1940లో ‘జీవన జ్యోతి’ చిత్రంలో నటించడం ద్వారా సినిమారంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాలో రెండవ హీరోయిన్‌గా ఆమె సైకిల్ సుందరిగా ప్రేక్షకులను ఇట్టే ఆకర్షించింది. ఆ తర్వాత 1943లో చిత్తూరు నాగయ్య తీసిన ‘భాగ్యలక్ష్మి’ సినిమాలో కమలాకోట్నిస్ ”తిన్నె మీది చిన్నోడా” అంటూ పాడుతూ చేసిన నత్యం అలరించింది. ఇది ఆర్. బాల సరస్వతిదేవి తొలి నేపధ్య గీతం. ‘భాగ్యలక్ష్మి’ తెలుగు సినిమా చరిత్రలో నూరో సినిమా. దీనికి ముందు జెమిని వారి ‘బాలనాగమ్మ’ (1942)లో కూడా ఆమె నటించింది.

కమలాకోట్నీస్ నట జీవితంలో ఒక మైలురాయి అనదగిన సినిమా ‘చెంచులక్ష్మి’ (1943). ”ఏరి ఏరి నాసరి సమానులిక ఏరి” అంటూ చెట్టు పుట్టలలో తిరుగాడుతూ అడవిని గాలించే చెంచు పిల్లగా ఆమె నటనను చూసి అది నిజంగా చెంచులక్ష్మే అని భ్రమ పడినవారు ఎందరో. నిజానికి కమలా కోట్నిస్ మనస్తత్వాన్ని ప్రతిబింబించిన పాత్ర అని సినిమా విమర్శకులు వాకచ్చారు. చెంచులక్ష్మితో ఆమె హీరోయిన్‌గా స్థిరపడింది. ఆ తర్వాత కమలాకోట్నీస్ నటించిన తెలుగు సినిమాలు రెండే. వై.వి. రావు దర్శకత్వంలో 1944 వచ్చిన ‘తాసిల్దార్’లో ఆమె ఆధునిక పోకడలతో కనిపించే యువతిగా నటించింది. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తొలుత నటించిన ‘సీతారామ జననం’లో కైక పాత్రలో నటించి తనలోని విభిన్నమైన నటనను ఆవిష్కరించింది. ‘చెంచులక్ష్మి, తాసిల్దార్’ చిత్రాలలో కమల నటన చూసిన తర్వాత ఉత్తరాది సినీ దర్శకులు ఆమెను హిందీ చిత్ర రంగానికి ఆహ్వానించారు. ఇదే విషయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకున్నారు.
”నన్ను దేవకి బోస్ కలకత్తా పిలిపించారు. అక్కడ ఒక సినిమాలో నేను హీరోయిన్‌గా నటించి మద్రాసు వచ్చేసరికి పూనా ప్రభాత్ కంపెనీ బాబురావు తాలూకు మనిషి శేషాద్రి అనే అతను వచ్చి నన్ను వాళ్ళ సినిమాకు బుక్ చేసుకొని పునాకు తీసుకువెళ్లాడు. నాకు హిందీ బాగా వచ్చును. రాష్ట్ర భాష పరీక్షలో పాస్ అయ్యి ఉన్నాను. వీటికి తోడు ఈత, గుర్రపు స్వారీ, కారు డ్రైవింగు చిన్నప్పుడే నేర్చుకున్నాను. నాట్యం కూడా మైలాపూర్ గౌరీ అమ్మాళ్ దగ్గర కొంతకాలం శిక్షణ తీసుకున్నాను. అయితే ఎక్కడ నేను నాట్య ప్రదర్శనలు ఇవ్వలేదు. సంగీతము సుతారం రాదు. అయితే జీవనజ్యోతిలో ఒకే ఒక పాట పాడాను. అదే నా మొదటిది, చివరిది. నారాయణరావు, కృష్ణవేణి తో కలిసి సైకిల్ పాట పాడినట్లు గుర్తు.”
”పూనాలో ఐదారేళ్ళు ఉన్నాను వసంతరావు పెయింటర్ డైరెక్షన్లో కొన్ని మంచి సినిమాల్లో కూడా నేను నటించాను. అక్కడ నా మొదటి చిత్రం సంతోషి దర్శకత్వం వహించిన ‘హమ్ ఏక్ హై’ (1946). అందులో హీరో దేవానంద్. ఆయనకు ఇదే మొదటి సినిమా”. అట్లా హిందీ చిత్ర రంగంలో ఆ తర్వాత ఒక గొప్ప హీరోగా వెలుగొందిన దేవానందుకు తొలి నాయికగా కమలాకోట్నీస్ చరిత్రలో నిలిచిపోయింది. ఆ తర్వాత కమలాకోట్నీస్ మొత్తం అరడజను హిందీ సినిమాలలో నటించింది వాటిలో 1946 లో వచ్చిన ‘గోకుల్’ చిత్రంలో తాను రాధగా నటించగా అనంత మరాఠీ కృష్ణుడిగా నటించాడు. అమియా చక్రవర్తి తెలుగులో బియన్ రెడ్డి ‘స్వర్గసీమ’ కథాంశంతో తీసిన ‘మేరా సుహాగ్’ లో నటించింది.
ఈ సినిమా గురించి తన అనుభవాన్ని ఆమె – ”ఇందులో నేను వేయవలసినది భానుమతి పాత్ర, కానీ అంతకు ముందు నటిస్తున్న సినిమాలో విలన్ బలంగా తోసినప్పుడు కిందపడి చేతి ఎముక విరిగిపోయింది కనుక నేను నాట్యం చేయలేక పోవడం వల్ల ఆ వేషం సులోచనా చటర్జీకి ఇచ్చి, నా చేత హీరో భార్యవేషం వేయించారు. అయితే ఈ సినిమా నేను వాంపు వేషం వేయనందుకే ఫెయిల్ అయిందని పెయింటర్ తరచు నాతో హాస్యం ఆడేవాడు” అని చెప్పుకుంది. ఆ తర్వాత కమలా కొట్నీస్ ‘ఆగే బడో'(1947) చిత్రంలో నటించింది. అయితే తనకు 1949లో నటించిన ‘సీధా రాస్తా’ అన్న సినిమాలో నటించిన అమాయకురాలైన గొల్ల పిల్ల వేషం బాగా ఇష్టమని చెప్పుకునేది. ఈ సినిమాలో ఒక గొల్ల పిల్ల కాలేజీ అబ్బాయిని ప్రేమించి అతనిచే తల్లి కాబడి అష్ట కష్టాలు పడి చివరికి జీవితాన్ని సుఖాంతం చేసుకోవడం కథాంశం. ఆమెకు నటించడానికి బాగా స్కోప్ ఉన్న వేషం ఈ సినిమాలోనే దక్కింది.
కమలాకోట్నీస్ నిర్మాతగా మారి 1949లో ‘సతి అహల్య’ అన్న చిత్రాన్ని నిర్మించింది. కానీ ఆ రోజుల్లో మతకలహాల సమయంలో ఈ సినిమా విడుదలై నష్టాలను మూటగట్టుకుంది. ఆ తర్వాత ఆమె నిర్మాతగా ప్రభాత్ వారితో కలిసి తెలుగులో నిర్మించిన ‘సామ్రాట్ విక్రమార్క’ పలు కారణాలవల్ల చాలా కాలం తర్వాత 1958 ఫిబ్రవరి 8న విడుదలై పరాజయం పాలయింది. ఈ సినిమాలో ఆమె సౌగంధి వేషం వేసింది. ఈ సినిమాకు దర్శకుడు ఆమె భర్త పి.ఎస్.కోట్నీస్. కమలా కోటీస్ వ్యక్తిగత జీవితం ఏమాత్రం సజావుగా సాగలేదు. తండ్రి చిన్నతనంలోనే వదిలి వెళ్ళడం, తల్లి తనను వేరొకరికి దత్తు ఇవ్వడము, ఆ తర్వాత జీవితం కొంత సినిమా రంగంలో సజావుగానే నడిచినా, వైవాహిక జీవితం ఒడిదుడుకుల మయంగా సాగింది.
మొదటి వివాహం 1941లో ఆమె ప్రముఖ సినిమాటోగ్రాఫర్ డి.ఎస్. కోట్నీస్, ప్రముఖ డాక్టర్ ద్వారకానాథ్ కోట్నిస్ (చైనాలో హీరోగా మారిన వైద్యుడు)ల సోదరుడు పాండురంగ్ కోట్నిస్‌ను వివాహం చేసుకుంది. ఈ వివాహం ద్వారానే ఆమె ‘కోట్నిస్’ అనే ఇంటిపేరును పెట్టుకున్నది. అయితే 1960 ప్రాంతంలో కమలా కొట్నీస్ తన భర్తతో విడిపోయింది. ఆమె మొదటి వివాహం ముగిసిన తర్వాత ఆమె ఒక పేరున్న పారిశ్రామికవేత్త చంద్ర దేవ్ ప్రకాష్ సిన్హాను వివాహం చేసుకున్నది. ఆయన వెంబడి పలుసార్లు విదేశీ పర్యటనలు చేసిన ఆమె లండన్ క్లబ్లో టెన్నిస్ నేర్చుకున్నది. దురదష్టవశాత్తు 1966లో జరిగిన ఒక ప్రమాదంలో (నీటిలో మునిగి) సిన్హా మరణించారు. ఆమెకు సంతానం కూడా కలిగినట్లు లేదు.
ఈమె చిన్న చెల్లెలు ‘లీల’కు రామనాథపురం (తమిళనాడు) ఎస్టేట్ వారసునితో పెళ్ళి జరిగింది. 1970-80 లనాటి ప్రముఖ తెలుగు, తమిళ నటి లత (అందాల రాముడు సినిమా ఫేం), రాణీ రాజేశ్వరీ నాచియార్‌లు ఇరువురూ కమలా కొట్నీస్‌కు స్వయాన చెల్లెలి కూతుర్లు. మద్రాసు నగరంలో నివాసం ఏర్పరచుకున్న ఆమె 1970లలో విజయచిత్ర సినీ మాసపత్రికకు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ- ”ఇక సినిమాలు తీద్దామని గానీ వేషాలు వేద్దామని గాని లేదు. ఇల్లు వాకిళ్లు ఉన్నాయి.
ఇక మా సొంత ఊరు కర్నూలు దగ్గర తుంగభద్ర ఒడ్డున ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి అనాధ శిశువులకు, దిక్కులేని స్త్రీలకు ఆశ్రయమిద్దామని ఆశ. ఆ తర్వాత అంతా ఇష్ట దైవం శ్రీరాముని దయ” అంటూ తన అభిలాషను వ్యక్తపరిచింది. కానీ ఆమె కోరికలేవీ ఆ తర్వాత నెరవేరినట్లు లేదు. మద్రాసు నగరంలో చివరి రోజులు గడుపుతూ 72వ ఏట 2000 సంవత్సరంలో కమలా కోట్నీస్ కన్ను మూసింది. వెండితెరపై వెలిగిపోయి ఒక విలాసవంతమైన జీవితాన్ని గడిపి నటనలో తనదంటూ ప్రత్యేక ముద్రను వేసిన కమలా కోట్నీస్ తన వ్యక్తిగత జీవితంలో మసక బారిన దీపంలా ఆరిపోవడమే విషాదం.
హెచ్ రమేష్ బాబు,
గద్దర్ ఫిలిం అవార్డు గ్రహీత
7780736386



