సాధారణంగా తొమ్మిదేళ్ల వయసులో పిల్లలు ఆటపాటలతో, స్కూలు హోంవర్క్‌లతో గడుపుతుంటారు. కానీ భోపాల్‌లోని దుర్గానగర్ మురికివాడకు చెందిన ముస్కాన్ అహిర్వార్ ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉండేవి. ఆ ప్రాంతంలోని నిరుపేద పిల్లలకు చదువుకోవాలనే ఆశ ఉన్నా, సరైన పుస్తకాలు అందుబాటులో లేకపోవడం ఆమెను కలచివేసింది. పాఠశాలలు కేవలం పాఠాలు నేర్పుతాయి, కానీ పుస్తకాలు ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. ఆ ప్రపంచాన్ని తన స్నేహితులకు కూడా చూపించాలని ముస్కాన్ నిర్ణయించుకుంది. అలా పుట్టిందే ఈ ”బాల్ పుస్తకాలయ్”. ఇది కేవలం పుస్తకాల సేకరణ మాత్రమే కాదు, ఓ చిన్నారి చేస్తున్న అక్షర సేద్యం. తన చుట్టూ ఉన్న పిల్లల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం. చిన్న వయసులోనే ఇంత పెద్ద ఆలోచన చేయడమంటే, ఆమెలో ఉన్న సున్నితత్వానికి, తోటి పిల్లల పట్ల ఆమెకున్న ప్రేమకు నిదర్శనం.
ముస్కాన్ నివసించే ప్రాంతంలో ఆర్థిక పరిస్థితులు చాలా దయనీయంగా ఉంటాయి. అక్కడ తల్లిదండ్రులు దినసరి కూలీలుగా పనిచేస్తుంటారు. చాలా మంది కుటుంబాలు పోషకాహారం కూడా సరిగ్గా అందించుకోలేని పరిస్థితిలో ఉంటాయి. ఇలాంటి చోట పిల్లలకు పాఠశాల చదువు కూడా ఒక విలాసంగా అనిపించడం సహజం. అలాంటి స్థితిలో పుస్తకాల పట్ల ఆసక్తిని పెంచడం సామాన్యమైన విషయం కాదు. కానీ ముస్కాన్ ఇలాంటి సవాళ్లను అధిగమించడానికి సిద్ధపడింది. ఆమె మరియు ఆమె అక్క నేహా కలిసి ఒక వినూత్నమైన ఆలోచన చేశారు.
పెద్ద పెట్టుబడి అవసరం లేదు, గొప్ప భవనం అవసరం లేదు. వారు తమ ఇంటి బయట ఉన్న ఒక తాడుకు రంగురంగుల కథల పుస్తకాలను క్లిప్పులతో వేలాడదీశారు. ఇదీ అంతా. అలా కట్టిన పుస్తకాలు గాలికి ఊగుతూ, అటుగా వెళ్లే పిల్లలను అయస్కాంతం లాగా ఆకర్షించడం మొదలుపెట్టాయి. రంగురంగుల కవర్లు, ఆకర్షణీయమైన బొమ్మలు, వాటిని చూసిన ప్రతి చిన్నారి ఆగి చూడక తప్పేది కాదు. ఆ పుస్తకాలే ఆ మురికివాడలో ఒక కొత్త విప్లవానికి నాంది పలికాయి. ఈ చిన్న ప్రయత్నం ఎంతటి గొప్ప మార్పుకు దారితీస్తుందో ఆ సమయంలో ఎవరూ ఊహించి ఉండరు.
సాయంత్రం వేళ అక్షరాల పండుగ: ప్రతిరోజూ స్కూలు అయిపోగానే, ముస్కాన్ కొత్త ఉత్సాహంతో ఇంటికి పరుగెత్తుకుంటుంది. తన చిన్ని చేతులతో ఇంటి ముందు ఒక చాప పరిచి సిద్ధంగా ఉంటుంది. సాయంత్రం సరిగ్గా 4 గంటలకు ఆమె లైబ్రరీ మొదలవుతుంది. చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ అక్కడ గుమిగూడుతారు. అది వారికోసమేనన్న భావన వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ముస్కాన్ కేవలం పుస్తకాలను అరువు ఇవ్వడమే కాదు. చదవడం రాని చిన్న పిల్లలకు ఆమె స్వయంగా కథలను బిగ్గరగా చదివి వినిపిస్తుంది.
ఆమె గొంతులో ఉన్న స్పష్టత, కథలు చెప్పే విధానం, పాత్రలకు ప్రాణం పోసే తీరు పిల్లలను కట్టిపడేస్తాయి. ముస్కాన్ లైబ్రరీలో ఎటువంటి కఠినమైన నిబంధనలు ఉండవు. ఇవ్వాల్సిన ఫీజు లేదు, కచ్చితమైన సమయం లేదు, ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు కూర్చోవచ్చు. కేవలం పుస్తకాలతో స్నేహం చేయడం తప్ప మరో బాధ్యత లేదు. ఇది ఆ పిల్లలందరికీ ఒక అభయారణ్యంలా మారింది. అక్కడ వారు తమ పేదరికాన్ని, ఇంటి సమస్యలను కొన్ని క్షణాల పాటు మర్చిపోయి కథల లోకంలో విహరిస్తారు. చిన్ని చిన్ని కథల ద్వారా వారు పెద్ద పెద్ద నేర్చుకుంటున్నారు.
కమ్యూనిటీ హబ్, సామాజిక మార్పు: ముస్కాన్ చేస్తున్న ఈ పని కేవలం పుస్తక పంపిణీకి మాత్రమే పరిమితం కాలేదు. అది క్రమంగా ఒక ‘కమ్యూనిటీ హబ్’గా మారింది. పిల్లలు అక్కడ కలిసి కూర్చుని పుస్తకాల గురించి చర్చించుకుంటారు. కథల్లోని పాత్రల గురించి వాదించుకుంటారు. తమకు తెలియని పదాల గురించి, కొత్త విషయాల గురించి ముస్కాన్ ను ప్రశ్నలు అడుగుతారు. ముస్కాన్ వారికి ఒక టీచర్‌లా కాకుండా, ఒక స్నేహితురాలిలా అన్నీ వివరిస్తుంది.
ఈ లైబ్రరీ వల్ల ఆ మురికివాడలోని పిల్లల్లో ఒక కొత్త క్రమశిక్షణ పెరిగింది. ఇంతకు ముందు స్కూల్ మానేసి వీధుల్లో తిరిగే పిల్లలు, ఇప్పుడు సాయంత్రం వేళ ముస్కాన్ లైబ్రరీకి చేరుకుంటున్నారు. గంటల కొద్దీ పుస్తకాలు చదువుతూ సమయం గడుపుతున్నారు. చదవడం వల్ల వారి భాషా జ్ఞానం పెరిగింది, ఆలోచనా స్ఫూర్తి పెరిగింది. ఇది ఒక చిన్నారి తన పరిమితుల లోపే సమాజంలో ఎంతటి గొప్ప మార్పును తీసుకురాగలదో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క చిన్నారి జీవితాన్ని ఎలా మారుస్తుందో ముస్కాన్ చర్యలే రుజువు.

సవాళ్లు, సహాయ సహకారాలు: ప్రారంభంలో ముస్కాన్ వద్ద కేవలం 25 పుస్తకాలు మాత్రమే ఉండేవి. ఆమె చిన్ని ప్రయత్నం గురించి మాటలు వ్యాపించాయి. ‘రూమ్ టు రీడ్’ వంటి అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఆమె చేస్తున్న కషిని గుర్తించి ముందుకు వచ్చాయి. వారు మరిన్ని పుస్తకాలను అందించడమే కాకుండా, ఆమెకు అవసరమైన ప్రోత్సాహం కూడా అందించారు. బొమ్మలతో కూడిన రంగురంగుల పుస్తకాలు రావడంతో పిల్లల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ఆమెకు చేయూతనందించాయి.
”ఈ పుస్తకాల్లో బొమ్మలు చాలా బాగుంటాయి, అక్షరాలు పెద్దగా ఉండి చదవడానికి సులభంగా ఉంటాయి” అని కొత్త పుస్తకాలు అందుకున్న సందర్భంగా ముస్కాన్ ఎంతో సంతోషంగా చెబుతుంది. ఆమెకు రాష్ట్ర విద్యా శాఖ నుండి కూడా గుర్తింపు లభించింది. అనేక మంది దాతలు, సామాన్య పౌరులు కూడా ఆమె లైబ్రరీకి పుస్తకాలను అందించడానికి ముందుకు వచ్చారు. ఏ సంపదా లేని ఒక చిన్నారికి తన వద్ద ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవాలనే గుణం ఉండటమే ఆమెను గొప్ప నాయకురాలిని చేసింది. ఆమె సంపాదించింది డబ్బు కాదు, గౌరవం మరియు అభిమానం.
ముస్కాన్ కథ మనకు నేర్పే పాఠాలు: ముస్కాన్ జీవితం నుండి మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ఆమె కథ మనకు అద్దం పడుతుంది. మన చుట్టూ ఏమి జరుగుతుందో చూసుకోమని, మన వంతు బాధ్యత నిర్వర్తించమని సందేశమిస్తుంది. ఆమె మనకు నేర్పే కొన్ని ముఖ్యమైన పాఠాలు:
మొదటిది, మార్పు మీ నుండే మొదలవ్వాలి. ఏదో జరుగుతుందని, ప్రభుత్వం చేస్తుందని, ఎవరో పెద్దలు వచ్చి సాయం చేస్తారని ఎదురుచూడకుండా, మనకున్న పరిమిత వనరులతోనే మార్పును ప్రారంభించాలని ముస్కాన్ నిరూపించింది. తన వద్ద ఉన్న కొన్ని పుస్తకాలతోనే ఆమె ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.
రెండవది, నాయకత్వానికి వయసుతో పనిలేదు. నాయకత్వం అంటే కేవలం పెద్ద పెద్ద హోదాల్లో ఉండటం కాదు, పెద్ద పెద్ద పదవులు చేపట్టడం కాదు. అది బాధ్యతను తీసుకోవడం, ఇతరులకు మార్గదర్శిగా నిలవడం. 9 ఏళ్ల వయసులోనే ఆమె ఒక సామాజిక మార్పుకు నాయకత్వం వహించడం ఈ మాటను నిరూపిస్తుంది.
మూడవది, విద్యే నిజమైన ఆయుధం. పేదరికాన్ని పారద్రోలడానికి, సమాజంలో మార్పు తీసుకురావడానికి విద్య కంటే గొప్ప ఆయుధం మరొకటి లేదని ఆమె గుర్తించింది. తన తోటి పిల్లలను ఆ దిశగా నడిపించడానికి ప్రయత్నిస్తోంది.
నాల్గవది, పంచుకోవడంలోనే నిజమైన ఆనందం ఉంది. తనకున్న కొద్దిపాటి పుస్తకాలను అందరితో పంచుకోవడం ద్వారా ఆమె పొందే మానసిక తప్తి వెలకట్టలేనిది. డబ్బుతో కొనలేని సంతోషం అది. పుస్తకాలు ఇచ్చిన ప్రతి పిల్లాడి ముఖంలో ఆమె చూసే చిరునవ్వే ఆమెకు దొరికే నిజమైన ప్రతిఫలం.
అక్షర యోధురాలు – ముస్కాన్ అహిర్వార్: ముస్కాన్ అహిర్వార్ కేవలం ఒక చిన్నారి మాత్రమే కాదు, ఆమె ఒక ఆశాకిరణం. అక్షరజ్ఞానం లేని ఆ లోకంలో అక్షరాల పందిరి వేసిన అపర మేధావి ఆమె. ఆమె తన చర్యల ద్వారా ప్రపంచానికి ఒక సందేశం పంపుతోంది. ”మనకు ఏమీ లేదు, మనం ఏమీ చేయలేము” అని బాధపడే వారందరికీ ఆమె జీవితం ఒక స్ఫూర్తి. ”మన దగ్గర ఉన్నదానితోనే గొప్పగా ఎలా జీవించాలి, ఇతరులకు ఎలా సహాయపడాలి” అని ఆమె చాటి చెబుతోంది.
భవిష్యత్తులో ఐఏఎస్ అధికారి కావాలనేది ముస్కాన్ కల. ఆమె కచ్చితంగా తన లక్ష్యాన్ని చేరుకుంటుందని, అధికారిణిగా మరిన్ని జీవితాల్లో వెలుగులు నింపుతుందని మనం ఆశించవచ్చు. ఆమె ప్రయాణం ఇలా కొనసాగాలి, ఆమెకు అందరి నుండి సహాయ సహకారాలు లభించాలి. ఎందుకంటే ముస్కాన్ లాంటి చిన్నారులే మన భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పులు. వారి ప్రయత్నాలను గౌరవించడం, ప్రోత్సహించడం మనందరి బాధ్యత. ముస్కాన్ అహిర్వార్ పేరు ఇప్పుడు భోపాల్‌కే పరిమితం కాలేదు. ఆమె కథ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇంత చిన్న వయసులో ఇంతటి కషి చేస్తున్న ఆమెకు అభినందనలు తెలపడమే కాదు, ఆమె నుండి నేర్చుకోవడం మనందరి విధి.
- డా|| రవికుమార్ చేగొని, 9866928327



