ఉరికొయ్యను ఊయలగా ఊగిన వేళ..భారతమాత నుదుట నెత్తుటి తిలకం దిద్దిన వేళ..మరణాన్ని నవ్వుతూ ముద్దాడిన ఆ ముగ్గురు అమరత్వానికి అసలైన చిరునామాలు!భగత్ సింగ్.. ఆలోచనల అగ్నిపర్వతం!రాజ్ గురు.. ధైర్యానికి పర్యాయపదం! సుఖ్‌దేవ్.. దేశభక్తికి నిలువుటద్దం!
వయసులో పసివారే అయినా.. ఆశయాల్లో హిమాలయ శిఖరాల కంటే ఉన్నతులు!నల్ల చట్టాల గుండెలు అదిరేలా.. చెవిటి పాలకుల చెవుల్లో పిడుగులు కురిసేలా.. అసెంబ్లీ హాలులో పేలిన ఆ బాంబు ధ్వనినేటికీ వినిపిస్తోంది ”ఇంక్విలాబ్ జిందాబాద్” అంటూ!లాఠీ దెబ్బలకు నేలకొరిగిన కేసరి కోసం.. పగతో రగిలిన ప్రతీకార జ్వాలలు వారు! జైలు గోడల మధ్య అక్షరాలతో విప్లవం రాసిజ్ఞానానికి, ధైర్యానికి తోడైన తత్వవేత్తలు వారు!
అమరవీరులారా..మీరు కన్న కల ఇంకా మిగిలే ఉంది!
అవినీతి రహిత, అసమానతలు లేని సమసమాజం..
మీ త్యాగానికి మనం ఇచ్చే అసలైన నివాళి!
భారతదేశ దాస్య శృంఖలాలను తెంచడానికి ఎందరో వీరులు తమ రక్తాన్ని ధారపోశారు. వారిలో అగ్రగణ్యులు విప్లవ వీర కిశోరాలు భగత్ సింగ్, రాజ్ గురు సుఖ్‌దేవ్. 1931 మార్చి 23వ తేదీ రాత్రి 7:30 గంటలకు ఈ ముగ్గురు యోధులు నవ్వుతూ ఉరికొయ్యను ముద్దాడిన రోజు భారత చరిత్రలో ఒక ధవతారగా నిలిచిపోయింది. నేడు వారు మన మధ్య లేకపోయినా, వారు కన్న ‘అమరవీరుల స్వప్నం’ నేటికీ ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది.ఈ ముగ్గురు వీరులు దాదాపు ఒకే వయసు వారు కావడం గమనార్హం.గాంధీజీ అహింసా మార్గంలో సాగుతున్న ఉద్యమం ఆశించిన వేగంతో ఫలితాలను ఇవ్వడం లేదని భావించిన ఈ యువకులు, సాయుధ పోరాటమే మార్గమని నమ్మారు.
చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో 1928లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ‘హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్’ స్థాపించబడింది. కేవలం స్వాతంత్య్రం మాత్రమే కాక, కార్మికులు, రైతుల రాజ్యమే లక్ష్యంగా సోషలిస్ట్ భావజాలంతో వీరు ముందుకు సాగారు.సైమన్ కమిషన్ వ్యతిరేక పోరాటంలో బ్రిటిష్ పోలీసు అధికారి జేమ్స్ స్కాట్ జరిపిన లాఠీఛార్జిలో ‘పంజాబ్ కేసరి’ లాలా లజపతిరారు మరణించడం విప్లవకారులను తీవ్రంగా కలచివేసింది. దీనికి ప్రతీకారంగా స్కాట్‌ను చంపబోయి పొరపాటున సాండర్స్‌ను కాల్చి చంపారు.తదనంతరం, నల్ల చట్టాలను నిరసిస్తూ 1929 ఏప్రిల్ 8న ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ బాంబులు విసిరారు. అది ఎవరినీ చంపడానికి కాదు, ‘చెవిటి బ్రిటిష్ ప్రభుత్వానికి వినిపించడానికి’ మాత్రమే. ”ఇంక్విలాబ్ జిందాబాద్” నినాదాలతో వారు స్వచ్ఛందంగా లొంగిపోయారు.
జైలులో ఉన్నప్పుడు కూడా భగత్ సింగ్ పోరాటం ఆపలేదు. రాజకీయ ఖైదీల హక్కుల కోసం 116 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఆ చిన్న గదిలో ఆయన మార్క్సిజం, సోషలిజం వంటి అంశాలపై తీవ్రమైన అధ్యయనం చేశారు. ఆయన రాసిన ”నేనెందుకు నాస్తికుడిని?” (Why I am an Atheist) అనే గ్రంథం నేటికీ యువతకు తార్కిక ఆలోచనలను రేకెత్తిస్తుంది.ఉరితీసే నిమిషం ముందు కూడా భగత్ సింగ్ విప్లవకారుల ఆత్మకథలను చదువుతూ ఉండటం ఆయన ధైర్యానికి పరాకాష్ట. 23-24 ఏళ్ల ప్రాయంలోనే దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన ఈ త్రిమూర్తుల బలిదానం వధా కాలేదు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన వారి స్ఫూర్తితో నేటి తరం అవినీతి, వివక్ష లేని సమసమాజ స్థాపన కోసం పునరంకితం కావాలి. అది వారు కన్న అసలైన స్వప్నం. ”విప్లవం ఒక హక్కు, స్వేచ్ఛ ఒక వరం.” – అమర్ రహే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్!
డా.పూసపాటి వేదాద్రి
9912197694



