పాలమూరు జిల్లాలో కాలం కరువును పూయిస్తే ఆయన కలం హలమై తెలుగు నేలన సినీచరిత్రను పండించింది. భారతీయ సినిమా చరిత్రను పుక్కిటపట్టిన ఒక సినిమా ఎన్ సైక్లోపీడియా అతడు. వెండితెరపై తెలంగాణ తేజాన్ని వెలిగింపజేశాడు. తెలంగాణ సినిమా చరిత్రను పాతాళంలోంచి పైకి తెచ్చినవాడు. అతని సంపాదకత్వాలు నిత్య మందారాలు. గుట్టల నుంచి రాళ్ళను తీసుకొచ్చి గుడికట్టడం సహజం. పుస్తకాల దొంతరలలోని అక్షరాలతో చరిత్రను నిర్మించడం కేవలం అతనికే సాధ్యమైంది. అతని డాక్యుమెంటేషన్ ముందు గూగుల్, వికీపీడియాలు దిగదుడుపే. భారతీయ సినీ చరిత్రను పుక్కిట పట్టిన అతను తెలంగాణను, తెలంగాణ సినిమా చరిత్రను అవమానం చేసిన తల పొగరును నేలకు దించిన సామాన్యుడు, అనితర సామాన్య విజయుడు. అతడు హెచ్.రమేష్ బాబు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన హెచ్. రమేష్ బాబు తెలంగాణ ప్రభుత్వం 2025 గద్దర్ ఫిలిం అవార్డులలో ఉత్తమ సినిమా విమర్శకులుగా ఎంపికైన సందర్భంగా ఒక అభినందన. నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ నుంచి ఆయన రచనలు ఎన్నో ప్రశంసలను పొందుతూ అవార్డులను తెచ్చాయి. తెలంగాణ సినిమా రచనలు చేస్తున్న కొద్దిమందిలో హెచ్. రమేష్ బాబు వొకరు. కవిగా సాహిత్య జీవితాన్ని ప్రారంభించి సినీ చరిత్ర రచనలో అత్యంత ప్రతిభాశాలిగానే గాక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. జేఏసీలో బాధ్యులుగా పనిచేస్తూనే తెలంగాణ ఉద్యమ కాలంలోనే తెలంగాణ సినిమా రచనకు కొత్త దారి వెతుక్కున్నాడు.
దీని కోసం 2019లో తాను పనిచేస్తున్న పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి రాజీనామాచేసి సినిమా రచనకే అంకితమయ్యాడు. తెలంగాణ సినిమా రచన పట్ల ఆయనకున్న నిబద్ధత ఏ పాటిదో ఈ నిర్ణయం నిరూపిస్తుంది. రైతుకు నీటి విలువ ఎలాతెలుసో, రమేష్ బాబుకు అక్షరం విలువ కూడా అంతే…. సీనీ జర్నలిస్టు, రచయిత, పరిశోధకుడు హెచ్. రమేష్ బాబు. తెలంగాణాలోని వనపర్తి జిల్లా,ఏదుల గ్రామంలో 1966 జూన్ 20న హకీంకారి తులసీరామ్, సక్కుబాయి దంపతులకు జన్మించాడు. నాగార్జున యూనివర్సిటీ నుండి తెలుగులో ఎం.ఏ. చేశాడు. 35ఏండ్లు సొంత ఊరిలోనే పొస్టు మాస్టర్ ఉద్యోగం చేసాడు.ఒకచేత ఉత్తరాలు అందిస్తూనే మరోచేత వెండి వెలుగులకు అక్షరాల మెరుపులను పులిమాడు.
తండ్రి హోం లైబ్రరీ, రేడియోలో వచ్చిన కార్యక్రమాలే అతని సాహిత్యాభిరుచికి ప్రేరణలు. కవిత్వం, కథలు, సంగీతం, నాటకాలు సాంస్కతిక అంశాలతో పాటు భారతీయ సినిమా రంగంపై సాధికారికమైన రచనలు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. రాజ్ కపూర్, ప్రభాకర్ రెడ్డి గురించి రాసినా,కాంచనమాల, కన్నాంబ, మహానటి సావిత్రి గురించి రాసినా వెన్నెల వెలుగులను వెండి తెరలకు అద్దుతాడు. సినిమా జర్నలిజంలో ఆయనది అందవేసిన చేయి. గత ముప్పై సంవత్సరాలుగా తెలుగు నాట దిన, వార, మాస పత్రికలలో ఆయన వ్యాసాలు ప్రధాన శీర్షికలు, సంచలన కవర్ స్టోరీలు.
ఫాల్కే అవార్డు విజేతలు, సినీ పితామహుడు ఫాల్కే, వెంకయ్య అవార్డు వెలుగులు, కాంచనమాల జీవన చిత్రాలు, నంది అవార్డు విజేతలు, మహానటి సావిత్రి, ధ్రువతార కన్నాంబ, తొలినాటి సినిమా పాటల పుస్తకాలు, మార్గదర్శకుడు కె.వి.రెడ్డి, దర్శక చక్రవర్తి ఆదుర్తి సుబ్బారావు, తెలంగాణ తెరకు తొలి వెలుగు బి. నరసింగరావు, చిల్లరదేవుళ్ళు మాధవరావు జీవితం సినిమాలు, లోటస్ ఫిలిం కంపెనీ-హైదరాబాద్, హెచ్. ఎం. రెడ్డి తెలుగు సినిమా పితామహుడు లాంటి 20 సినిమా పుస్తకాలు ఆయన కలం నుంచి జాలువారిన సినీ చందమామలు. మహా దర్శకుడు కె.వి. రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు కాపీ టేబుల్ బుక్స్, మహనటి సావిత్రి పుస్తకం ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి.
తొలినాటి తెలుగు సినిమా పాటలు 1933- 40, 1200 పేజీలు సినిమా పాటల పుస్తకం ఎల్లకాలం నిలిచే రచనలే గాక ఒక దశాబ్ద సినిమా చరిత్రను నిక్షిప్తం చేశారు. మూకీ నిర్మాణాల చరిత్రను లోటస్ ఫిలిం కంపెనీ హైదరాబాద్ పేరుతో రాశాడు. సినిమాలో తెలంగాణ దర్శకులు ఉన్నారా? నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, ఎవరెవరి పాత్రలేఏమిటి? భారతీయ సినిమా చరిత్రలో తెలంగాణ సినిమా చరిత్రను సగౌరవంగా సజీవంగా ఉందని సాక్షాలతో నిరూపించారు. తెలంగాణ సినిమా చరిత్రకు ఆద్యుడిగా నిలిచాడు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన 2011లో రమేష్ బాబు మొదట ‘తెలంగాణ సినిమా’ అనే కాలమ్ లో రాసిన వ్యాసాలు తెలంగాణ సినీ చరిత్రకు పాదులు వేసినవి. సినిమాల గురించి రాస్తూనే ‘సుప్రభాతం’ వీక్లీకి మహబూబ్ నగర్ జిల్లా కరస్పాండెంట్‌గా పనిచేసి తెలంగాణ ఉద్యమ కాలంలో విశ్లేషణాత్మక రాజకీయ రిపోర్టులు రాసి సంచలనం సష్టించారు. 2001లో దళితుడు నామాల బాలస్వామి హత్యపై రాసిన కథనం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు వీరు మూడు వేలకు పైగా వ్యాసాలు రాశారు. వీటిలో అగ్రభాగం సినిమా రచనలే.
ప్రతి రోజు శీర్షికలే… ‘వెండితెర వెలుగులే.
‘తెలంగాణ ‘వెండి వెలుగులు శీర్షికన పైడి జయరాజ్, చంద్రశేఖర్, అజిత్, చందాల కేశవదాసు, ప్రభాకర్ రెడ్డి, టి.లలితాదేవి, ఎం.వి.రాజులను మన తెలంగాణ సినీ వెలుగులుగా చరిత్రకెక్కించాడు. భారతదేశంలో తొలి దళిత హీరోయిన్ పీ.కే. రోజి గురించి పరిశోధన చేసి తొలిసారిగా తెలుగు వారికి పరిచయం చేసిన విలక్షణ పరిశోధకుడు హెచ్. రమేష్ బాబు. తెలంగాణ చరిత్రను మూకీ శకం నుండి సాక్షాధారాలతో రాసి భారతీయ సినిమా చరిత్రలో తెలంగాణకు స్థానం కల్పించాడు. రైతు కల్లాల నుండి గింజల్ని రాల్పినట్లు రాయడం ఆయనకే సాధ్యం. కాలగర్భంలో కలిసిన చరిత్రలను వెలికితీశాడు. హిందీ తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ భాషా చిత్రాలే కాకుండా తెలంగాణ సినిమాకు కూడా మూకీల చరిత్ర ఉందని నిరూపించిన పరిశోధన అమోఘం. హైదరాబాద్ సినిమా, తెలంగాణ సినిమా, దక్కన్ సినిమా వంటి శీర్షికలు ఆయన ప్రతిభకు తార్కాణాలు.
హెచ్. రమేష్ బాబు తన సినిమా పరిశోధనలో కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చారు. అప్పటిదాక 1922లో ధీరేన్ గంగూలీతోనే హైదరాబాదులో మూకీ యుగం మొదలైందనే ప్రచారం నిజం కాదనీ, 1896లోనే హైదరాబాదు సైలెంట్ సినిమాల ప్రదర్శనలు జరిగాయని తన పరిశోధనల ద్వారా తేల్చి చెప్పిన సాహసికుడు. హైదరాబాదుకు బొంబాయితో సమాంతరంగా సైలెంట్ సినీ చరిత్ర ఉందని తన పరిశోధన ద్వారా నిరూపించారు. అతని రచనా వ్యాసాంగంలో ఇదొక మైలురాయి వంటిదని సుప్రసిద్ధ నవ్య సినిమా దర్శకుడు బి.నరసింగరావు పేర్కొన్నారు. గత ఇరవైఏళ్లుగా వీరు రాస్తున్న ”తెలంగాణ సినిమా చరిత్ర” మొదటి భాగం ”లోటస్ ఫిలిం కంపెనీ, హైదరాబాద్” పేర హైదరాబాద్ మూకీల చరిత్ర పుస్తకం 2022లో ముద్రించాడు.
హెచ్.రమేష్ బాబు సినిమా పాటలు పుస్తకాలకోసం తిరగని ప్రాంతం లేదు. ఆయన 3000కు పైగా సినిమా పాటల పుస్తకాలు, పలు సినీ పత్రికలు, గ్రంథాలు బహు భాషలలోనివి సేకరించారు. ఆయన ఇల్లు భారతీయ సినిమాకు సంబంధించిన గ్రంథాలతో నిండి ఉంటుంది. సినిమాతో బాటు వివిధ అంశాలపై వేల ఫైళ్లుగా డాక్యుమెంటు చేశారు. ఆయన ఇంటిలో పుస్తకాలే గోడలు, కిటికీలుగా దర్శనమిస్తాయి.ఎటూ చూసిన పుస్తకాల మట్టివాసన. సినిమా రంగానికి తొలినాళ్లలో పాదులు వేసిన మహనీయుల గురించి దర్శకుల గురించి,
నిర్మాతల గురించి పుస్తకాల ద్వారా వెలుగులోకి తేవడమే కాకుండా, స్థానికుల జీవిత చరిత్రలకు ప్రాణంపోశారు. కళాభారతి, ప్రజల మనిషి డా.బాలకష్ణయ్య, నందిని నాగర్ కర్నూల్ సంచిక, వైతాళికుడు పాలెం సుబ్బయ్య, నెమలీక- పురుషోత్తమరావు సంచిక, దక్కను గాంధి పల్లెర్ల హనుమంతరావు, నా జీవనయానం శ్రీనివాసరావు జీవిత చరిత్ర, స్వర్ణ వాహిని- గద్వాల సంచిక, పాలెంఏ50, అర్దళం శేషబట్టర్ నరసింహాచార్యులు ఆత్మకథ, స్థానిక చరిత్రలు, పెంటమరాజు సుదర్శన్ రావు సంచికలు ఎన్నెన్నో కళాఖండాలు ఆయన సొంతం.
పాలమూరు వెలుగులు పేరున 2008, 2009లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రముఖుల ముఖ చిత్రాలతో ”పాలమూరు వెలుగులు” పేరిట రూపొందించిన క్యాలెండర్ ఒక అపూర్వం. తెరమీద వెలిగిపోయిన, తెరమరుగుచేసిన విస్మృతికి గురైన దర్శకులు నిర్మాతలు కెమెరామెన్, సంగీత దర్శకులు, నటీనటులను టెక్నీషియన్లను కాగడా పట్టి కావ్యాలను చేసిన గొప్ప సృజనశీలి, సంపాదకుడు. హెచ్. రమేష్ బాబు 2017లో కె.సి.ఆర్.చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ రాష్ట్ర స్థాయి పురస్కారం, జిల్లా నెహ్రూ యువ కేంద్రం యువ సాహితీవేత్త అవార్డు, జయప్రకాశ్ నారాయణ్ అవార్డు, తెలంగాణ – అమెరికా అసోసియేషన్ (తేనా)వారి ప్రొఫెసర్ జయశంకర్ అవార్డు, తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం,
తెలంగాణ సినీ స్వర్ణ కమలం, తెలంగాణ సార్వస్వత పరిషత్తు పురస్కారం లాంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఈ నెల 19వ తేదిన ఉగాది పర్వదినం నాడు హైటెక్స్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉత్తమ సినీ విమర్శకులుగా గద్దర్ ఫిల్మ్ అవార్డు హెచ్.రమేష్ బాబు అందుకున్న సందర్భం తెలంగాణ సినిమాకు గర్వకారణం. చివరగా కొసమెరుపు ఏమిటంటే గత ఏడాది సెప్టెంబరు చివరి వారం నుండి డిసెంబరు వరకు నవ తెలంగాణ ఆదివారం అనుబంధం సోపతిలో ధారవాహికగా హైదరాబాద్ సినిమా అన్న శీర్షికన రాసిన వ్యాసాలకు హెచ్. రమేష్ బాబు ఉత్తమ సినీ విమర్శకుడిగా గద్దర్ పురస్కారం అందుకున్నాడు.
(ఆదివారం సోపతిలో సినీ చరిత్రపై కాలమ్ నిర్వహిస్తున్న హెచ్.రమేష్‌బాబుకు గద్దర్ అవార్డు అందుకున్న సందర్భంగా నవతెలంగాణ తరపున హృదయపూర్వక అభినందనలు)



