మార్చి 27 ప్రపంచ నాటకరంగ దినోత్సవం. నాటకం ప్రపంచమంతటా తనదైన ప్రత్యేకతతో జపాన్, స్వీడెన్, ఫ్రాన్స్ ,శాన్ ఫ్రాన్సిస్కో, లండన్, నార్వే, ఇటలీ, సిడ్నీ, షికాగో తదితర దేశాలలో అత్యంత ఆదరణతో నాటకం విలసిల్లుతుంది. నాటక ప్రదర్శన జరగడం, ఆ నాటకం చూడాలని ఉవ్విళ్ళూరడం, పరుగులు, పరుగులు పరుగులుగా టిక్కెట్టు కొని ప్రదర్శన చూడటం, ఆ పై దానిని గురించి చర్చించుకోవడం మనం గమనిస్తున్నాం.
మన దేశంలోనూ నాటకాలకు ఒక ప్రత్యేక స్థలం కేటాయించి అక్కడ నాటకాలు వేసుకునే వెసులుబాటు కలిగించి పట్టించుకునే రాష్ట్రాలూ ఉన్నాయి. కొన్ని చోట్ల కొందరికి నాటకం జీవనం . కొన్ని చోట్ల నాటకం దినదిన గండం.మరికొన్ని చోట్ల నాటకం ఏ రకంగానూ పట్టించుకోక పక్కన పెట్టేసిన పరిస్థితి . మరికొన్ని చోట్ల నాటకం నడిపేందుకు తగిన చేయూత! భిన్న పరిస్థితుల మధ్య నలిగిపోతున్నది నాటకమే!
ప్రపంచ నాటక రంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు?
1961 లో వియన్నా లో ఇంటర్ నేషనల్ థియేటర్ ఇన్స్ టిట్యూట్ వారు 9 వ కాంగ్రెస్ సభ నిర్వహించారు. అధ్యక్షులు అరవికియెవో ప్రపంచ రంగస్థల దినోత్సవం జరుపుకోవాలని ఒక ప్రతిపాదన చేసారు. ఆ సభలో కొన్ని నిర్ణయాలు తీసుకుని ప్రతి సంవత్సరం ప్రపంచ రంగస్థల దినోత్సవం జరపాలనుకున్నారు. దీనిని ITI తన కేంద్రాల ద్వారా ప్రోత్సహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాటక సంఘాలు దీనికి మద్దతు ఇస్తాయి. వియన్నాలో జరిగిన ITI తొమ్మిదవ ప్రపంచ కాంగ్రెస్‌లో, ITI ఫిన్నిష్ కేంద్రం తరపున అధ్యక్షుడు ఆర్వి కివిమా ప్రపంచ నాటక దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని జూన్ 1961లో ప్రతిపాదించిన తర్వాత,ITI ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. ఈ ప్రతిపాదనకు ITI స్కాండినేవియన్ కేంద్రాలు మద్దతు ఇచ్చాయి. దీనిని ఉత్సాహంగా ప్రచారం చేశారు.
నిర్ణయాన్ని అమలుపరిచి మరుసటి సంవత్సరం పారిస్ లో ఘనంగా ప్రపంచ రంగస్థల దినోత్సవం జరిపారు. వివిధ చర్చలు, సెమినార్లు నిర్వహించారు. ఆ సభ ప్రత్యేకత ఏమిటంటే ఎంపిక చేసుకున్న నాటక రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తిని సమన్వయ కర్తగా భావిస్తారు. ఆ సమన్వయ కర్త ప్రముఖుల మాటను ఒక సందేశంగా వినిపిస్తారు. ఈ సభ ఐక్యరాజ్య సమితి, యునెస్కో వారి ప్రాధాన్యత పొందడం. అనేక ప్రాంతాలనుంచి వచ్చిన వారితో నాటక ప్రదర్శనలు, నాటకాలపై సదస్సులు జరుగుతాయి.
వాటిపై చర్చలు కూడా. ఈ సభలో ఒక చక్కని నాటక వేదికగా నిలిచి పోవడం వల్ల ప్రపంచ నాటకరంగ దినోత్సవాన్ని ప్రతి యేటా మార్చి 27న జరుపుకుంటారు. తొలి సందేశాన్ని ఫాన్స్‌కు చెందిన జీన్ కాక్టే అందించారు. ఇదేవిధంగా మరుసటి సంవత్సరం మరో చోట స్థలం ముందుగానే నిర్ణయించుకుంటారు. కార్యక్రమాలు చర్చలు ప్రదర్శనలు జరుపుకుంటారు ఎంపిక చేసుకున్న సమన్వయ కర్త సందేశం వినిపపిస్తారు. ఈ పరంపరలో మన దేశం సమన్వయ కర్తగా పాల్గొనే అవకాశం 2002 లో లభించింది. ప్రముఖ జాతీయస్థాయి కళాకారుడు గిరీష్ కర్నాడ్‌కు తన సందేశం అందించే అద్భుత అవకాశం దక్కింది. ఆ ప్రసంగం పలువురి ప్రశంసలు అందుకుంది.

ప్రపంచ నాటక రంగ దినోత్సవం 2026 ప్రత్యేకత:
ప్రపంచ థియేటర్ డే (మార్చి 27, 2026) సందేశాన్ని ప్రఖ్యాత నటుడు విల్లెం డాఫో (Willem Dafoe) ఇస్తున్నారు. ఈ అంతర్జాతీయ సందేశం, కళాత్మక ప్రతిబింబం, నైతిక నిశ్చితార్థానికి వేదికగా థియేటర్‌ను ప్రోత్సహిస్తుంది. 2026 వేడుకలు మార్చి 25-27 తేదీలలో లక్సెంబర్గ్ నగరంలో జరుగుతాయి. ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతాయి.
ప్రపంచ నాటకరంగ దినోత్సవ లక్ష్యాలు:
-ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాలలో నాటకాన్ని ప్రోత్సహించడం
-ప్రజలకు నాటకం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కలిపించడం
-విస్తృత స్థాయిలో నాటక సంస్థలకు ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులకు అవగాహన కలిపించి వారి ద్వారా నాటకరంగాన్ని అభివృద్ధి చేయడం
-మానసిక ఉల్లాసంకోసం నాటకాన్ని ఆస్వాదింపజేయడం
-నాటకం ద్వారా పొందుతున్న మానసిక ఉల్లాసాన్ని ఇతరులతో పంచుకోవడం.
ప్రపంచంలో ఎన్నో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త పరిణామాలు కళ్ళముందు సాక్షాత్కరిస్తున్నాయి. కానీ మన తెలుగు నాటకం ఇంకా అనేక సమస్యల వలయం లో చిక్కుకుని పై లక్ష్యాలను సాధించడం అమలుచేయటంలో వెనుకంజ వేస్తుంది. లోపం ఎక్కడా అని వెతుక్కుంటే ఎవరి సమాధానం సమర్థింపులు వారు చేసుకుంటున్నారు. తగిన వసతులు, సౌకర్యాలు, వేదికలు, అవకాశాలు లేకపోవటంతో నాటకాలు ప్రజలను ఆకట్టుకొనేలా రూపొందించడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు సినిమాలు సీరియళ్ళు షార్ట్ ఫిలిం లపై చూపించే ఆసక్తి నాటకరంగం పై చూపించక పోవడం. నాటకాన్ని సమాజం స్వీకరించలేక పోవడం . అందరినీ ఆకట్టుకునేలా నాటకం రూపుదిద్దుకోవాలంటే మరికొన్ని పాత్రలను పెట్టుకోగలిగే ఆర్థిక వెసులుబాటు దర్శకుడికి లేకపోవడం.
ఆకర్షణీయంగా రకరకాల సెట్టింగులు, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తే ఖచ్చితంగా నాటకం వైపుకు ప్రజలను మరల్చుకోవచ్చు కానీ ఆర్థిక పరమైన ఇబ్బందులవల్ల ఆధునిక హంగులను జోడించలేక పోవడం, పాత్రలను పరిమితంగా తీసుకుని చెప్పాలనుకున్నది ఆ పాత్రలతోనే చెప్పించడం ఇవన్నీ ఎంతో చరిత్ర కలిగిన నాటకరంగాన్ని వెనక్కి లాగుతున్నాయి. మరికాస్త లోతుగా చర్చించుకుంటే నాటకం వేయడానికి వేదికలు పరిమితం . ప్రదర్శనకు ముందు రిహార్సల్స్ వేసుకోవడానికి నిర్దేశిత స్థలాలు లేవు. స్వంత రవాణా ఖర్చులతో దూరాలనుంచి కళాకారులు రిహార్సల్స్ చేసుకుంటారు. నాటక రచయితకు కష్టపడి నాటకం రాస్తే రచనకు తగిన పారితోషికం ఉండడంలేదు . పైగా కథల బహుమతులకే నేడు ఎక్కువ పారితోషికం లభిస్తుంది.
పరిషత్తులు వెన్నంటి నాటకరంగానికి ఆయా సందర్భాలలో రకరకాల ప్రదేశాలలో ఆహ్వాన నాటికలని, వార్షికోత్సవాలు, తదితర సందర్భాలలో నాటకాలు వేయడానికి ఆహ్వానాలు పలకడం వల్ల నాటకాలు పలు చోట్ల ప్రదర్శనలతో ప్రజలను అలరిస్తున్నాయి. మా ఊరిలో నాటకాలు ఆడిస్తాం, మా ఊర్లో ఘనంగా నిర్వహిస్తాం అంటూ ఉత్సాహంగా పోటీ పడుతూ పోటీలు పెడుతూ ఉండటం నాటకరంగానికి పెద్ద ఊరట! ఒకప్పుడు నంది నాటకోత్సవాలు జరిగి ఆ పోటీలలో నంది బహుమతిగా పొందడం ఒక గుర్తింపుగా ఉండి ఈ నాటికి ఎన్ని నందులు వచ్చాయో చెప్పుకుని మురిసిపోతుంటే.. ఆ వైభవం రెండు తెలుగు రాష్ట్రాలలో తిరిగి పునర్వైభవంగా మారాలని ఎందరో నాటకాభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఈ ప్రపంచ నాటకరంగ దినోత్సవ సందేశం నాటకం మనలో నమ్మకాన్ని కలిగిస్తుంది. మనిషిలో పరివర్తనకు దోహదం చేస్తుంది . దీనిని మనమంతా స్వీకరించి మంచి నాటికలను మన మధ్య అందించే దిశలో కృషి చేసి నాటక కళాకారులకు, సాంకేతిక నిపుణులకు చేయూతనిచ్చి నాటకం ఒక ఆయుధంగా మలుచుకుని సమాజంలోని రుగ్మతలను రూపుమాపవలసిన అవసరం ఎంతైనా ఉంది. మానవ మేధ పరిణితికి దోహదం చేసే నాటకాలను వెలికి తెచ్చి నాటకాన్ని ప్రపంచ పటంలో ఉన్నతంగా నిలబెడదాం . అందుకు తగిన కృషిని మన వంతుగా చేద్దాం.
డా. సమ్మెట విజయ
9989820215



