Sunday, March 22, 2026
E-PAPER
Homeసోపతిసహజీవనం న్యాయ, చట్ట పరిధులు

సహజీవనం న్యాయ, చట్ట పరిధులు

- Advertisement -

సహజీవన – ఇధి ఒక సామాజిక రుగ్మతా లేక నాగరికత పురోగమనమా అన్న సంశయం కలగడం సహజం. ఇటీవలి కాలంలో అవివాహితుల, వివాహితుల సహజీవనం నగర జీవనంలో ప్రస్ఫుటంగా కనిపించే అంశంగా పరిణమించింది. విద్య, ఉద్యోగాలకై యువత దూర ప్రాంతాలకు, ముఖ్యంగా పెద్ద నగరాలకు తరలివెళ్లి అక్కడి విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి, ఆధునికత పేరుతో లైంగిక స్వేచ్ఛను అనుభవించడం, దురలవాట్లకు లోనవ్వడం, ముఖ్యంగా మాదకద్రవ్యాలను సేవించడం లాంటివి తరచూ చూస్తున్నాం. అదే విధంగా గత రెండు దశాబ్దాలలో అవివాహితులైన యువతీ యువకులు వివాహేతర సంబంధాలను ఏర్పరచుకుని దంపతుల వలే సహజీవనం చేయడం సాధారణ విషయమైపోయింది.

నగర జీవనంలో గల అజ్ఞాతం, స్వేచ్ఛ, కొంతవరకు ఆర్థిక స్వావలంబన సహజీవనాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తాయి. 2019లో జరిపిన ఒక సర్వే ప్రకారం స్త్రీ పురుషుల వివాహేతర సహజీవనం గణాంకాలలో పూణే, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా నగరాలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. అలాగే స్వీడన్‌ వివాహేతర సహజీవనం విషయంలో ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉన్నది. ఆ దేశ జనాభాలో 70 శాతం మంది పెళ్ళికి పూర్వమే సహజీవన బంధంలో చిక్కుకుని అందులో పది శాతం మాత్రమే చివరి వరకూ కొనసాగుతారు. 40 శాతం మంది కొద్దికాలం అనంతరమే సహజీవన బంధాన్ని ముగిస్తారు. ఆసియా దేశాలైన జపాన్‌, దక్షిణ కొరియాలో ఇంకా సాంప్రదాయ బద్ధంగానే కుటుంబాలు, వివాహ వ్యవస్థ నడుస్తున్నాయి.

వివాహం స్త్రీ పురుషుల సంబంధాన్ని క్రమబద్ధం చేసే ఒక ఉత్కష్టమైన వ్యవస్థ. మానవ జీవితంలో ఒక ఆశ్రమానికి నాంది పలికే ఒక సామాజిక సంస్థ. భారత సమాజంలో నేటికీ తొంభై శాతం ప్రజలు వివాహ బంధానికి కట్టుబడే ఉన్నారు. వివాహ వ్యవస్థలో కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఇమిడి ఉన్నాయి. వివాహమనే క్రతువు స్త్రీ పురుష ఆరోగ్యకర సంబంధానికి దర్పణంగా భాసిల్లడమే కాకుండా కుటుంబ వ్యవస్థకు మూల సూత్రంగా పరిఢవిల్లుతుంది. మానవ సమాజంలో ఏక వివాహ పద్ధతి (మోనోగమస్‌) అత్యుత్తమమైనదిగా పరిగణిస్తారు.

ఇటీవల ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సహజీవనం చేసే జంటలు తప్పనిసరిగా తమ సంబంధాన్ని నమోదు చేసుకోవాలన్న చట్టాన్ని ప్రవేశపెట్టింది. సహజీవనం ప్రారంభించిన మూడు నెలల లోగా నమోదు చేసుకోలేకపోతే మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా పది వేల రూపాయల జరిమానా చెల్లించవలసి ఉంటుంది. మూడవ వ్యక్తి ఫిర్యాదుపై కూడా నమోదు చేసుకొని వారిపై చర్యలు చేపట్టవచ్చును. ఈ చట్టం హిందూ ఆధిక్య వాదాన్ని, చాందసత్వాన్ని బలోపేతం చేస్తున్నదన్న విమర్శ సహజంగానే తలెత్తుతుంది. అలాగే మూడవ వ్యక్తి జోక్యం కూడా విమర్శల పాలయ్యింది. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం వివాహేతర సహజీవనాన్ని తిరస్కరించలేదు. కేవలం సహజీవనం గణాంకాల సేకరణ నిమిత్తమే ఈ చట్టాన్ని తెచ్చినట్లు ప్రకటించింది.

ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై విస్తారంగా చర్చ జరుగుతున్నది. తన తీర్పులో జస్టిస్‌ వివేక్‌ కుమార్‌ వివాహేతర సహజీవనం చట్టబద్ధమైనదేనని ఉటంకిస్తూ అందులో నేరపూరితమైన అంశాలేమీ లేవని పేర్కొన్నారు. ఇరువురు వయోజనులు (వివాహానికి చట్టబద్ధంగా అర్హతను కలవారు) దంపతుల వలే జీవించవచ్చునని, వారికి రాజ్యాంగంలో పొందుపరిచిన జీవించే హక్కు (21వ అధికరణం) ప్రకారం వారికి రక్షణ కల్పిస్తూ వారి బంధాన్ని నేరంగా పరిగణించరాదని తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం సహజీవనం వివాహంతో సమానమైన హోదాను కలిగి ఉండకపోయినా దీర్ఘ కాలం కొనసాగితే ఆ జంట వివాహితులుగానే గుర్తింపబడతారు. ఆ జంటలో మహిళ గృహ హింస చట్టం ప్రకారం భరణానికి కూడా అర్హురాలు. ఆ జంట యొక్క సంతానం కూడా చట్ట సమ్మతం కలిగి ఉంటుంది. డీ వేలుసామి, డీ పిచ్చమ్మాళ్‌ కేసులో ఇవే అంశాలను అత్యున్నత న్యాయస్థానం లేవనెత్తింది.

”2013లో ఇంద్రా శర్మ ఎం కె.వి. శర్మ” వ్యాజ్యంలో సుప్రీమ్‌ కోర్టు ఈ సహజీవనం గృహ హింస చట్టంలోని సెక్షన్‌ 2(f), అనగా Domestic Relationship (వివాహ స్వభావమైన సంబంధం) పరిధిలోనికి వస్తుందా అని విశ్లేషించారు. ఒక వ్యక్తి వివాహితుడని, పిల్లలు కలవాడని తెలిసి అతనితో సంబంధం ఏర్పరచుకున్న మహిళ ఏ విధంగా సామాజిక సానుభూతి పొందవచ్చన్నది చర్చనీయాంశం. సహజీవనం చేసే వారిలో ఒకరు అప్పటికే వివాహితులైతే వారి సంబంధం వివాహ సంబంధం కాదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఆమెకు పెళ్లి చేసుకున్న భార్యతో న్యాయపరమైన, చట్టపరమైన సమానత్వం కల్పిస్తే సమాజంలో క్రమశిక్షణ లోపించి భావోద్వేగాలు అనే పేరుతో సహజీవనం కొనసాగిస్తారు. ఇదే సమయంలో భర్త వేరొకరితో సంబంధం కొనసాగిస్తూ తనని నిర్లక్ష్యం చేసినందుకు భార్య పడే మనోవేదన యొక్క వెలితి పూడ్చలేనిదిగా సుప్రీంకోర్టు పరిగణించింది.

వివాహితుడైన శర్మ ఇంద్ర శర్మ తో సహజీవనం చేయడం వలన అతని కుటుంబ సభ్యులు అతని అనురాగాన్ని, ఆత్మీయతను కోల్పోయారని పేర్కొంటూ విశ్వ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన alienation of affection (పరాయీకరణ చెందిన అనురాగం) అనే వాక్షరణిని ప్రయోగించింది. ఈ కేసులో సహజీవనం చేస్తున్న మహిళ భార్య కాదు గనుక ఆమెకు భరణం చెల్లించనవసరం లేదని ముక్తాయించింది. అదే విధంగా ఈ బంధంలోనున్న మహిళ పురుషుడి కుటుంబాన్ని అస్థిరపరిచిందని అభిప్రాయపడింది. కాబట్టి సహజీవనం చేసి బయటపడిన బాధితురాలికి సరైన చట్టం ద్వారా పరిష్కార చర్యలు తీసుకొని రావాలని న్యాయమూర్తులు సూచించారు.

కానీ సహజీవనం చేసే మహిళ యొక్క దుర్బలత్వం, అసహాయత, ఆమె యొక్క సహచరుని బాధ్యతారహితమైన ప్రవర్తన పరిగణనలోనికి తీసుకోలేదన్న విమర్శలు వచ్చాయి. ఇంకా కొంత మంది న్యాయస్థానము ఈ తీర్పు ద్వారా వెనుక దారిలో (Back Door) వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థకు గొప్పదనం, పవిత్రత ఆపాదించిందని వాపోయారు. పై తీర్పులను కూలంకుషంగా చర్చించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అపరిమితమైన స్వేచ్ఛను, విశంఖలత్వాన్ని కోరుకునే వారు సుప్రీమ్‌ కోర్టు తీర్పుకు వక్ర భాష్యం చెబుతూ సహజీవనం అనేది ఆమోదయోగ్యమైనదని వాదించడం ప్రారంభించారు. నిజానికి సుప్రీం కోర్టు తీర్పు వివాహేతర సహజీవనం యొక్క దురుపయోగాన్ని కట్టడి చేసిందని చెప్పక తప్పదు. సహజీవనం వివాహానికి ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని చెప్పకనే చెప్పింది. కోర్టులు సాధారణంగా నైతికతను ప్రస్తావించవు గనుక ఒక పరిధిని దాటి అత్యున్నత న్యాయస్థానం సహజీవనంపై విమర్శలు చేయలేదు.

కె. శైలజ
విశ్రాంత జిల్లా న్యాయమూర్తి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -