జుట్టుపోలుగాడు : ఎవడేమనుకుంటే నాకేంటెహె. నిన్న వెనుజులా నేడు ఇరాన్. రేపు క్యూబా. క్యూబా ఓ బుడ్డ దేశం. నా పక్కనే వుంటూ నాకెదురు తిరుగుద్దా. ఆఫ్ట్రాల్. అదెంత? దాని బతుకెంత? నేనేదనుకుంటే అది నే చేయగలను. క్యూబాను స్వాదీనం చేసుకుంటే నాకు అంటే ఈ మహారాజశ్రీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సామ్రాజ్యవాద అగ్రనేతకు మరింత గౌరవం. ఇక నోరుమూసుకుని కుక్కిన పేనుల్లా ప్రతి ఒక్కరూ పడుండండి. హా.. హా.. హా…
కేతిగాడు : ఒరే ట్రంప్‌గా మా క్యూబాదేశం ప్రజల్లో నేనొకడిని. నా దేశ చరిత్ర తెలిసి కూడా నీవిప్పుడు నా మీద పడ్తున్నావంటే… నీలో పెరుగుతున్న అభద్రతాభావం పట్ల నాకిప్పుడు జాలేస్తుంది. అయినా నే జాలిపడను. నీవో నరహంతకుడివి హిట్లర్‌లా. నాది బుడ్డదేశమే కావచ్చు. అమెరికాకు కేవలం 90 మైళ్ల దూరంలోనే వుండొచ్చు. మీ ఊరికి మా ఊరెంత దూరమో మా ఊరికి మీ ఊరంత దూరమే. తెలుసుకో. చిన్నా పెద్ద కాదు, మానవీయ కోణం ముఖ్యం.
జుట్టుపోలుగాడు : మానవీయ కోణమా.. అది ఏమి? మా సామ్రాజ్యవాద నిఘంటువులో లేదే..?
కేతిగాడు : ఎప్పుడూ యుద్ధాలు చేయడం, అమాయక ప్రజల్ని చంపడం, దోపిడీ లాభాల వేటలో ఇతర దేశాలను లొంగదీసుకోవడం కన్నా మీకున్న గొప్ప చరిత్ర ఏముంది? మీలాంటి నరరూప రాక్షసులకు మానవీయ కోణం ఎలా తెలస్తుంది. ప్రపంచంలో ఉత్తమోత్తమ వైద్యులను తయారు చేసే వైద్యశాస్త్రం మా వద్ద వుంది. ప్రకృతి విపత్తుల్లో, యుద్ధాల్లో దెబ్బతిన్నవారిని కాపాడేందుకు మా వైద్యులు ప్రాణాలొడ్డి ఆ దేశస్థులకు సేవలందిస్తారు. చివరకు మీ అమెరికాకు కూడా. మానవ సేవ అంటే అది. ప్రాణాలు తీయడం కాదు, పోయడం.
జుట్టుపోలుగాడు : రేరు, నన్ను రెచ్చగొట్టకు. రాజ్యం వీర భోజ్యం అనేది అనాదిగా వస్తున్నది. బలవంతుడిదే రాజ్యం. కర్రవున్నోడిదే బుర్ర. పెద్ద పెద్ద అణు ఆయుధాలున్నోదిదే పెద్దరికం. పెత్తనం.
కేతిగాడు : ఆ రోజులు మారాయి. ఎవరిలాభం వాడు చూసుకోవడం, ఎవడి స్వార్థం కోసం వాడు మూర్ఖంగా నడుచుకోవడం పాతరాతియుగం నీతి. నీవింకా ఆ యుగంలోనే వున్నావ్.
జుట్టుపోలుగాడు : అబ్బ ఛ.. మరి ఈ ఆధునిక యుగం నీతి ఏమిటో…
కేతిగాడు : శాంతి, సమభావం, సమిష్టి క్షేమం. మా దేశ ప్రజలు ఈ నీతికోసం కట్టుబడి వున్నారు. మా నాయకులు ఫైడెల్ కాస్ట్రో, చేగువేరాల సారథ్యంలో మేమలా రూపొందాం.
జుట్టుపోలుగాడు : నోర్ముయ్యెహె… కాకమ్మ కబుర్లు చెప్పొద్దు. నన్ను కాదని మీరు సరాసరి వెనుజులా నుండి పెట్రోలు తెచ్చుకునేవారు. నేనిప్పుడు వెనుజులా అధ్యక్షుడు ముదురోను, అతగాడి పెళ్లాన్ని బంధించి తెచ్చి మా జైల్లో పెట్టాం. అప్పట్నించి ఆ దేశం నుండి మీకు చమురు బందైంది. మీ కరెంటు బల్బులు వెలగాలన్నా ఆ చమురు మీకవసరం. హి.. హి.. హి.. ఇక మీ బతుకు చీకట్లోనే…
కేతిగాడు : తమసోమా జ్యోతిర్గమయా: చీకటి నుండి వెలుగుకు మా ప్రయత్నం మాకు కొత్తేమీ కాదు. మీరెన్ని సార్లు మాపై ఆంక్షలు పెట్టినా, మా నాయకుడు కాస్ట్రోను ఎన్నిసార్లు హతమార్చాలనుకున్నా మీపప్పులేం వుడకలేదు కదా… దటీజ్ క్యూబా. మా సైద్ధాంతిక బలం మాకుంది. మా వెంట ప్రపంచం వుంది. కానీ నీవెంట ఇప్పుడు నీ నాటో దేశాలు కూడా లేవు. ఇరాన్‌పై చేసే యుద్ధంలో ఒరే ట్రంప్‌గా నీవు నెంబర్1 ముద్దాయిగా తేలావు. నెంబర్ 2 నెతన్యాహు – ఇజ్రాయిల్ ప్రధాని. మీ ఇద్దరూ 21 శతాబ్దపు నరహంతకులని లోకం కోడై కూస్తుంది. ఎక్కడికక్కడ శాంతి ర్యాలీలు నడుస్తున్నాయి.
బంగారక్క : అవును యుద్ధం మొదలయ్యి మూడు వారాలు కావస్తుంది. 17 శాతం చమురు కేంద్రాలు బుగ్గయ్యాయి. కోలుకోవడానికి ఐదేళ్లు పట్టొచ్చు. వేలాదిమంది సైనికులు ప్రజలు మరణిస్తున్నారు. అయినా ట్రంప్ యుద్ధ తృష్ణ చల్లారడం లేదు. 200 బిలియన్ డాలర్లు అంటే పద్దెనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు. అర్జంటుగా కేటాయించమని ఆదేశ చట్టచభను కోరుతున్నాడు.
కేతిగాడు : వామో అంత డబ్బే.
జుట్టుపోలుగాడు : మరేమనుకున్నావ్? ట్రంపా.. మజాకా…
బంగారక్క : అసలు విషయం అదికాదు. ఇప్పటికే ఇజ్రాయిల్, అమెరికా కలసి 15 వేలకు పైగా సైనిక దాడులు చేశాయి. అయినా ఇరాన్ ప్రతి దాడులతో నిలదొక్కుగోగలుగుతున్నది. పైగా, అమెరికా భద్రతకు ఎలాంటి ముప్పు లేని ఇరాన్‌పై యుద్ధం ప్రకటించి దాడి చేయడం అనైతికమని సాక్షాత్తు అమెరికా ప్రధాన భద్రతాధికారి జోకెంట్ స్వయంగా ప్రకటించడం పెద్ద సంచలనం. దాంతో స్వదేశంలోనే ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉప్పొంగుతున్నాయి. స్వదేశీ ఉద్యమాలే నరహంతక నేతలకు ముక్కుతాడు వేస్తాయి. దాన్ని తప్పించుకునేందుకు ట్రంప్ ఇప్పుడు మళ్లీ క్యూబా పేరెత్తుతున్నాడు.
కేతిగాడు : అర్థమయిందమ్మీ. క్యూబా అనునిత్యం ప్రపంచశాంతి బాటలో ముందుంటుంది. అందుకే క్యూబాపై అక్కసు.
బంగారక్క : అవును సోషలిస్టు చైతన్యమే శాంతికి సోపానం.
- కె.శాంతారావు, 9959745723



