Sunday, March 22, 2026
E-PAPER
Homeసోపతి2026 ఆస్కార్‌ ఉత్తమ చిత్రం

2026 ఆస్కార్‌ ఉత్తమ చిత్రం

- Advertisement -

జాత్యహంకారం, ఆధిపత్య భావజాలం, అధికార దాహం సమాజాన్ని అల్లకల్లోలానికి గురి చేస్తాయి. తాత్కాలిక సౌఖ్యాల కోసం మనిషి ఆచరించే జీవన విధానం మానవ సమాజ కల్లోలిత భవిష్యత్తుకు పునాది అవుతుంది. నేడు మనం జీవిస్తున్న పరిస్థితులు, ఎదుర్కునే సమస్యలు, గతం తాలుకు తప్పిదాలకు కారణాలు. ఇప్పుడు మానవ సమాజం, ముఖ్యంగా అగ్ర దేశంగా విర్రవీగుతున్న అమెరికా అల్లకల్లోలిత జీవనానికి కారణం ఆ దేశ గతకాలపు నిర్ణయాలే. అయితే దాన్ని ఒప్పుకోవడం, విశ్లేషించుకోవడంలోనూ ఒక అహంకారపూరిత ధోరణే కనపరుస్తుంది అగ్రరాజ్యం. ఈ సంవత్సరం ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ సాధించిన ”వన్‌ బాటిల్‌ ఆఫ్టర్‌ అనథర్‌” సినిమా ఈ ధోరణికి సాక్ష్యం. నిజానికి ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అనుకున్నంత ఘనమైన విజయాన్ని సాధించకపోయినా ఆస్కర్‌ బరిలో రికార్డులు సృష్టించింది.

‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ 2025లో విడుదలైన అమెరికన్‌ ఎపిక్‌ బ్లాక్‌ కామెడీ యాక్షన్‌-థ్రిల్లర్‌. దీనిని పాల్‌ థామస్‌ అండర్సన్‌ నిర్మించి, రచించి, దర్శకత్వం వహించారు. థామస్‌ పించన్‌ రచించిన 1990 నాటి వైన్‌ల్యాండ్‌ నవల కథాంశం నుండి ప్రేరణ పొందారు ఆండర్సన్‌. వైన్‌ల్యాండ్‌ 1984 నాటి ఉత్తర కాలిఫోర్నియా నేపథ్యంలో సాగే నవల. ఇది రీగన్‌ పరిపాలనలో 1960ల నాటి ప్రతిసంస్కృతి దీర్ఘకాలిక ప్రభావాన్ని అన్వేషిస్తుంది. జార్డు వీలర్‌ అనే మాజీ హిప్పీ, అతని కుమార్తె ప్రేరీ, ప్రభుత్వ ఫెడరల్‌ ప్రాసిక్యూటర్‌ బ్రాక్‌ వాండ్‌ ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ కథ ద్వారా 1960ల కాలంలో అమెరికాలో సాగిన సాంస్కృతిక విప్లవం విప్లవకారుల నడుమ అహం, సంఘీభావ లోపం, అంతర్గత కలహాలు, కనికరం లేని ప్రభుత్వ అణచివేత కారణంగా విఫలమైందని చర్చిస్తుంది.

అలాగే ఆ కాలంలో ప్రజల జీవితాలలోకి చొచ్చుకు వచ్చిన టెలివిజన్‌ వారిని మొద్దుబార్చి, నిజమైన రాజకీయ కార్యాచరణ స్థానంలో వినియోగదారు కేంద్రీకృత నిష్క్రియాత్మకతను నింపే ప్రభుత్వ నియంత్రణ సాధనంగా మారిందని కూడా నిరూపిస్తారు రచయిత. రీగన్‌ శకం మాదకద్రవ్యాలపై యుద్ధం నేపథ్యంలో, ప్రభుత్వం మాజీ రాడికల్స్‌ను ఎలా తనవైపుకు తిప్పుకుందో, నిఘాను రోజువారీ జీవితంలోకి ఎలా విస్తరించిందో కూడా ఈ పుస్తకం చర్చిస్తుంది. అలాగే, కుటుంబం, సమాజం యొక్క పునరుద్ధరణ శక్తి గురించి కూడా ఈ నవల చర్చిస్తుంది. విచ్చిన్నమైన కుటుంబం తమ రహస్యాలను, తమ జీవితాన్ని ప్రభావితం చేసిన పరిస్థితులను అర్ధం చేసుకుని ఒకటి అవడం అనే ఆశాజనకమైన ముగింపును ఈ నవల అందిస్తుంది.

కథలోని ఈ మార్మికతను అర్ధం చేసుకున్నవారంతా ఈ నవలను ఎంతో ఇష్టపడతారు. అందుకే ఆండర్సన్‌ కూడా దీన్ని ప్రస్తుత పరిస్థితులకు ఆపాదిస్తూ సినిమాగా తీయాలని నిశ్చయించుకున్నారు. లియోనార్డో డికాప్రియో, సీన్‌ పెన్‌, బెనిసియో డెల్‌ టోరో, రెజీనా హాల్‌, టెయానా టేలర్‌, చేజ్‌ ఇన్ఫినిటీ వంటి ప్రముఖులతో పటిష్టమైన తారాగణాన్ని ఎంచుకున్నారు. ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ 98వ అకాడమీ అవార్డులలో పదమూడు నామినేషన్లను పొంది, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు (పెన్‌), ఉత్తమ కాస్టింగ్‌ విభాగాలతో సహా ఆరు ఆస్కార్‌ అవార్డులను గెలుచుకుంది, ఉత్తమ కాస్టింగ్‌ విభాగం ఈ సంవత్సరమే కొత్తగా ఆస్కార్‌ బరిలోకి చేర్చారు. అలా ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి చిత్రంగా నిలిచింది ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’.

అంతే కాక ఇది 32వ యాక్టర్‌ అవార్డులలో రికార్డు స్థాయిలో ఏడు నామినేషన్ల నుండి ఒక విజయాన్ని, 31వ క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డులలో ఉత్తమ చిత్రంతో సహా మూడు విజయాలను, 83వ గోల్డెన్‌ గ్లోబ్స్‌లో ఉత్తమ చలనచిత్రం — మ్యూజికల్‌ లేదా కామెడీతో సహా నాలుగు విజయాలను, 79వ బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డులలో ఉత్తమ చిత్రంతో సహా ఆరు విజయాలను కూడా ఈ చిత్రం అందుకుంది. ఈ చిత్రాన్ని అమెరికన్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 2025 సంవత్సరపు టాప్‌ టెన్‌ చిత్రాలలో ఒకటిగా పేర్కొంది. ఇది నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ రివ్యూ నుండి ఉత్తమ చిత్రంతో సహా ఐదు అవార్డులను గెలుచుకుంది. పాల్‌ థామస్‌ ఆండర్సన్‌ రెండు కోణాలలో ఈ చిత్ర స్క్రీన్‌ ప్లే ని ఊహించుకున్నారు. ఒకటి ”యాక్షన్‌ కార్‌-చేజ్‌ సినిమా” మరొకటి ”మహిళా విప్లవకారిణి జీవిత కథ” కాని చివరకు ఆ రెండు కథలను కలుపుకుని కథనాన్ని నడుపుతూ తండ్రీ-కూతుళ్ల సంబంధానికి పెద్ద పీట వేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఫ్రెంచ్‌ 75 అనే ఒక విప్లవకారుల బందం మెక్సికో-అమెరికా సరిహద్దులో ఒక ఆపరేషన్‌ను ప్రారంభిస్తుంది. అక్కడ వారు అధికారులను బందీలుగా పట్టుకుని, ప్రాసెసింగ్‌ కోసం ఎదురుచూస్తున్న వలసదారులందరినీ విడుదల చేస్తారు. ఈ బృందానికి నాయకురాలు పెర్ఫిడియా బెవర్లీ హిల్స్‌. ప్రభుత్వ బృంద నాయకుడైన కల్నల్‌ స్టీవెన్‌ జె. లాక్‌జాను ఆమె లైంగికంగా రెచ్చగొడుతుంది, ఆపై అవమానిస్తుంది. దీనితో లాక్‌జా ఆమెపై విపరీతమైన మోహాన్ని పెంచుకుంటాడు. లైంగికంగా ఆమెను పొందడమే తన విజయంగా భావిస్తాడు. సాధారణంగా తమ కన్నా తక్కువ వర్గానికి చెందిన స్త్రీ తమపై పై చేయి తీసుకోవడం అధికార స్థానంలో ఉన్న పురుషుడు భరించలేడు. ఇక్కడ పెర్ఫిడియా నల్లజాతీయురాలు. లాక్‌జా తెల్ల దురహంకారి. అందుకే పెర్ఫిడియా అవమానానికి బదులుగా ఆమెని లైంగికంగా పొందడమే తన విజయమని ఆ జాత్యహంకార అహంకారి భావిస్తాడు.

పెర్ఫిడియా తన భాగస్వామి బాబ్‌ ఫెర్గూసన్‌ తో కలిసి ప్రతిఘటనకు నాయకత్వం వహిస్తుండగా, అతను ఆమెను వెంబడిస్తాడు. బాంబు దాడికి పాల్పడబోతున్న ఆమెను పట్టుకుంటాడు. ఆమె తనకు లొంగిపోతే ఆమెను వదిలేస్తానని చెప్తాడు. ఫెర్ఫిడియా ఆ సమయంలో అతనికి లైంగికంగా లొంగిపోతుంది. అతని అహానికి తృప్తి కలుగుతుంది. కొన్నాళ్లకు పెర్ఫిడియా చార్లీన్‌ అనే అమ్మాయికి జన్మనిస్తుంది. పాట్‌ పూర్తిగా ఆ బిడ్డ ప్రేమలో మునిగిపోతాడు. ఇక తాము స్థిరపడాలని, బిడ్డ కోసం ఒక కుటుంబంగా ఉద్యమాలకు దూరంగా జీవించాలని అతను కోరుకుంటాడు. కానీ పెర్ఫిడియా దానికి ఒప్పుకోదు. తన విప్లవ కార్యకలాపాలను కొనసాగించడానికి కుటుంబాన్ని వదిలేస్తుంది. ఒక సాయుధ బ్యాంకు దోపిడీ సమయంలో అక్కడి సెక్యూరిటీ గార్డును హత్య చేసి అరెస్టు అవుతుంది.

కల్నల్‌ స్టీవెన్‌ జె. లాక్‌జా ఆమెను మరణం నుండి రక్షించడానికి అప్రూవర్‌ గా మార్చుకుంటాడు. ఫ్రెంచ్‌ 75 దళంలోని కీలక సభ్యుల గురించిన ఆమె అతనికి సమాచారం ఇస్తుంది. స్టీవెన్‌ ఆమె జైలుకు వెళ్లకుండా ఉండేలా ఏర్పాటు చేసి ఓ రక్షణ భవనంలో తన అధీనంలో ఉంచుకుంటాడు. ఆమె అందించిన సమాచారం ఆధారంగా ఆమె సహచరులను పట్టుకుని ఉరితీస్తాడు. ఫ్రెంచ్‌ 75 సభ్యుడు హోవార్డ్‌ సోమర్‌విల్లే, పాట్‌ అతని కూతురు చార్లీన్‌లకు బాబ్‌, విల్లా ఫెర్గూసన్‌ పేర్లతో దొంగిలించబడిన గుర్తింపు కార్డులను ఇచ్చి మరో ప్రదేశానికి పంపేస్తాడు. పాట్‌ కూతురు కోసం ఈ మారు పేర్లతో కొత్త జీవితాన్ని మొదలెడతాడు. పెర్ఫిడియా స్టీవెన్‌ లాక్‌జా నుండి మెక్సికోకు పారిపోతుంది.

16 సంవత్సరాల తర్వాత, టీనేజ్‌ లో ఉన్న విల్లా దగ్గర కథ మళ్ళీ మొదలవుతుంది. బాబ్‌ ఒంటరి తండ్రిగా, విప్లవం కోసం తన వంతు కషి చేస్తూనే, కూతురి బాగోగులు చూసుకోవడం గురించి ఆందోళన చెందుతూ ఉంటాడు. తాగుడు, మత్తుపదార్దాలు, కూతురు విల్లా భద్రత ఇవే అతని జీవితం అవుతాయి. తండి తాగుడిని విల్లా భరించలేకపోతుంది. తన తల్లి ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసిన వీర వనిత అని ఆమె భావిస్తూ ఉంటుంది. కూతురు బాధపడకూడదని అసలు నిజాన్ని బాబ్‌ ఆమెకు చెప్పడు. ఈ పదహారు సంవత్సరాలలో స్టీవెన్‌ యు.ఎస్‌. భద్రతా సంస్థలలో ఒక ప్రముఖ వ్యక్తిగా ఎదిగుతాడు. శ్వేతజాతి ఆధిపత్య రహస్య సంఘమైన ‘క్రిస్మస్‌ అడ్వెంచరర్స్‌ క్లబ్‌’లో సభ్యుడిగా చేరమని స్టీవెన్‌కు ఆహ్వానం అందుతుంది. దానికి అతను ఎంతో గర్వపడతాడు. కాని పెర్ఫిడియాతో అతని పాత సంబంధం గురించి ఆ సంఘానికి తెలుస్తుంది.

పైగా ఈ సంబంధంతో అతనికో కూతురు ఉందని సంఘ సభ్యులు తెలుసుకుంటారు. ఇది స్టీవెన్‌ ను ఆలోచనలలో పడేస్తుంది. తన గతాన్ని తుడిచేయడానికి విల్లా గురించి తెలుసుకుని ఆమె తన కూతురు కావచ్చేమో అన్న అనుమానంతో ఆమెను అపహరించే ప్రయత్నాలు మొదలెడతాడు. అవంతి క్యూ అనే వ్యక్తిని ఈ పని కోసం నియమించుకుంటాడు, ఇది ఫ్రెంచ్‌ 75 దళానికి తెలుస్తుంది.
వలస, మాదకద్రవ్యాల నిరోధక ఆపరేషన్‌ను ఉపయోగించుకుంటూ, స్టీవెన్‌ సైనికులను విల్లా కోసం పంపుతాడు. ఫ్రెంచ్‌ 75 సభ్యురాలు డియాండ్రా, విల్లాను రక్షించి, ఓ కాన్వెంట్‌ లో ఆమెను దాచి పెడుతుంది. అక్కడ తన తల్లి ఉద్యమానికి చేసిన ద్రోహం గురించి విల్లా తెలుసుకుంటుంది. కూతురు కిడ్నాప్‌ అయిందని తెలిసిన బాబ్‌ ఆమెను రక్షించుకోవడానికి ప్రయత్యాలు మొదలెడతాడు. ఎన్నో ఏళ్లుగా మరచిపోయిన ఉద్యమ పోరాట నియమాలను గుర్తు తెచ్చుకోవడానికి అవస్తపడతాడు. బాబ్‌కు, విల్లా కరాటే గురువు, కమ్యూనిటీ నాయకుడైన సెర్గియో సెయింట్‌ కార్లోస్‌ సహాయం చేస్తాడు.

బాబ్‌ పాత్రలో డికాప్రియో చాలా బాగా నటించాడు. ఉద్యమానికి విధేయతతో ఉంటూనే కుటుంబం తనకు ప్రధానమని కూతురు తర్వాతే ఏదైనా అనే తండ్రితనాన్ని ప్రతి సీన్లో అద్భుతంగా పండించాడు. కాని వీరందరినీ మరపిస్తుంది జాత్యాహంకారి స్టీవెన్‌ గా సీన్‌ పెన్‌ నటన. చూడడానికి జోకర్‌ లా ఉంటూ తన చుట్టూ ఉన్న ప్రతిదాన్నీ చివరకు చరిత్రనే నాశనం చేయడానికి తపించే అతని మూర్ఖత్వం మనకు కొందరు నియంతలను, అధ్యక్షులను గుర్తుకు తెస్తుంది. కూతురిని చివరకు పట్టుకుని ఆమె ముందే డీ.ఎన్‌.ఏ పరీక్ష చేస్తాడు స్టీవెన్‌. తానే విల్లా తండ్రిని అని తెలుసుకుంటాడు. సెర్గియో, బాబ్‌ తప్పించుకోవడానికి ఏర్పాట్లు చేసి, అతన్ని కాన్వెంట్‌కు తీసుకువెళ్తాడు. విల్లాను చంపడానికి నియమించిన వారు ఆమెను కాపాడాలనుకునే వారి మధ్య పోరు మొదలవుతుంది. విల్లా అవంతి కారు, పిస్టల్‌తో అక్కడి నుండి తప్పించుకుంటుంది. ఇక్కడ ఓ గొప్ప కార్‌ చేస్‌ ని సృష్టించాడు దర్శకుడు.

ఈ క్రమంలో విల్లా తనలోని విప్లవకారిణికి వెలికితీస్తుంది. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ తుపాకి ఉపయోగిస్తూ తనను కాపాడుకోవడానికి శతవుతో పోరాడుతుంది. చివరకు బాబ్‌ ఆమెను చేరతాడు. స్టీవెన్‌ అప్పటికి గాయాలపాలైనా ప్రాణాలతో తప్పించుకుంటాడు. కొంతకాలం తర్వాత ముఖంపై తీవ్రమైన గాయపు మచ్చలతో ఉన్న స్టీవెన్‌ను క్రిస్మస్‌ అడ్వెంచరర్స్‌ క్లబ్‌లోకి స్వాగతిస్తారు సభ్యులు. కానీ కొద్దిసేపటికే విషవాయువుతో అతన్ని హత్య చేస్తారు. విల్లాతో ఇంటికి తిరిగి వచ్చిన బాబ్‌, ఆమెకు పెర్ఫిడియా నుండి వచ్చిన ఒక లేఖను అందిస్తాడు. తన చర్యలకు క్షమాపణలు చెబుతూ, ఎప్పటికైనా తన కుటుంబంతో తిరిగి కలుస్తానని ఆమె ఆ లేఖలో ప్రమాణం చేస్తుంది. ఓక్‌లాండ్‌లో నిరసన ప్రదర్శనకు విల్లా బయలుదేరుతుండగా బాబ్‌ ఆమెకు తన ఆమోదాన్ని అందిస్తుండగా సినిమా ముగుస్తుంది.

విప్లకకారుల జీవితంలో ఘర్షణ, వారి తప్పిదాలు, అంతర్గత సంఘర్షణ ఇవన్నీ చిత్రంలో మనకు కనిపించే ఇతర అంశాలు. కాని వీటన్నిటికి మించి పవిత్రమైన జాతి పేరుతో మిశ్రమ జాతి సంతానాన్ని అంతం చేయాలనే భయంకర మనస్థత్వంతో నిండి ఉన్న జాత్యాహంకార ఆలోచనలను సైతం ఈ సినిమా చర్చిస్తుంది. అమెరికాలో నల్లజాతీయులు, వలసవాదులు ఎదుర్కునే వివక్ష, అధికారబలాల అహం వీటి మధ్య పుట్టుకోచ్చే ఉద్యమాలు, ఉద్యమకారుల జీవితాలు, ఆదర్శాలు – ప్రాణ రక్షణ మధ్య సాగే అంతర్యుద్దాన్ని ఈ చిత్రం చర్చించింది. స్టీవెన్‌ పాత్ర మాత్రం ప్రపంచ రాజకీయ చరిత్రపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది. జాత్యాహంకార అహంతో జీవించే అధికారుల మానసిక ప్రవృత్తిని ఆ క్రూరత్వంలో చూపుతూనే హాస్యాస్పదంగా కదలాడే ఆ శరీర భాషతో ఆ ఆహం చరిత్రలో, రాబోయే తరాల దృష్టిలో వారిని ఎలా నిలుపుతుందో ప్రత్యక్ష్యంగా శీన్‌ పెన్‌ ఒకేసారి స్క్రీన్‌ పై అత్యద్భుతంగా ప్రదర్శించగలిగారు. అందుకే ఆయనకు ఇంత మంది దిగ్గజాల నడుమ ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్‌ లభించింది.

పి.జ్యోతి,
98853 84740

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -