సినిమా అనేది కేవలం వినోదానికి మాత్రమే పరిమితమయ్యే మాధ్యమం కాదు. అది సమాజాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన సాధనం. అలాంటి మాధ్యమంలో చారిత్రక వ్యక్తుల పేర్లు ఉపయోగించినప్పుడు బాధ్యత మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మొన్న విడుదలైన ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా ఒక సాధారణ వాణిజ్యచిత్రంగా కాకుండా, ఒక పెద్ద చర్చకు దారి తీసే అంశంగా మారింది. భగత్‌సింగ్ అనే పేరు భారత స్వాతంత్య్ర పోరాటంలో త్యాగం, ధైర్యం, సమానత్వానికి ప్రతీక. ఆయన మత రాజకీయాలకు దూరంగా ఉండి, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారుడు. ఆయన ఎక్కడా మతాల మధ్య విభేదాలను ప్రోత్సహించలేదు. అలాంటి మహానుభావుడి పేరును ఉపయోగిస్తూ రూపొందించిన ఈ సినిమాలో మాత్రం పూర్తిగా విరుద్ధమైన కోణం కనిపించడం ఆలోచించాల్సిన విషయమే.
సినిమా కథలో స్పష్టత లేకపోవడం ఒక సమస్య అయితే, దానికంటే పెద్ద సమస్యగా కనిపించేది మత, రాజకీయ కోణం. టీ గ్లాసులు, గాజు గ్లాస్ వంటి సూచికల ద్వారా ఒక రాజకీయ పార్టీ గుర్తును ప్రతిఫలించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. ”గాజు అంటే సైజు కాదు… గట్టి సైన్యం” వంటి సంభాషణలు కేవలం సినిమా డైలాగులు కాకుండా, రాజకీయ సందేశాలుగా వినిపిస్తున్నాయి.అలాగే ”జై శ్రీరామ్” వంటి నినాదాల వినియోగం నేపథ్యంలో, ఈ చిత్రం ఒక నిర్దిష్ట భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నదా అనే సందేహం కలుగుతోంది. ఇది కేవలం కథలో భాగమా? లేక ప్రజలపై ఒక రాజకీయ ప్రభావాన్ని చూపే ప్రయత్నమా? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి.ఇంకా ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే, సినిమా ఒకవైపు హిందువులను సంతోషపరిచే విధంగా సాగుతుండగా, మరోవైపు ముస్లింలను దేశద్రోహులు లేదా ఉగ్రవాదులుగా చూపించినట్టుగా అనిపించడం. ఈ విధమైన చిత్రీకరణ సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే సున్నితమైన సామాజిక పరిస్థితుల్లో ఇలాంటి కథనాలు మరింత విభజనకు దారి తీసే అవకాశం లేకపోలేదు.
ఒక సినీ హీరో అనేది అన్ని వర్గాల ప్రజలకు అభిమాన పాత్ర కావాలి. కానీ ఈ సినిమాలో ప్రధాన పాత్రను ఒక మతానికి మాత్రమే దగ్గరగా చూపించడం, ఇతర వర్గాల ప్రేక్షకులను దూరం చేసే సూచనలుగా కనిపిస్తోంది. ఇది కేవలం ఒక సినిమా కథ పరిమితిలో ఉండే విషయం కాదు, ఒక పెద్ద సామాజిక సందేశంగా మారే ప్రమాదం ఉంది.భగత్‌సింగ్ పేరుతో వచ్చిన ఈ చిత్రం, ఆయన అసలు భావజాలాన్ని ప్రతిబింబించాల్సిన బాధ్యతను మరిచి పోయిందా? అనే ప్రశ్న ఇక్కడ ప్రధానంగా నిలుస్తోంది. ఆయన ఎప్పుడూ మతాలను ఆధారంగా చేసుకుని ప్రజలను విభజించలేదు.
ఆయన పోరాటం సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం. అలాంటి వ్యక్తి పేరుతో మతపరమైన కోణాలను బలంగా చూపించడం ఆయన ఆలోచనలకు విరుద్ధంగా ఉందని చెప్పక తప్పదు.సినిమా స్వేచ్ఛ అనే పేరుతో ఏదైనా చూపించవచ్చు. కానీ ఆ స్వేచ్ఛ సమాజంలో విభేదాలను పెంచే దిశగా వెళ్తే, దానిపై చర్చ తప్పనిసరి అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇప్పుడు అలాంటి చర్చకు కారణమవుతోంది. మొత్తంగా చూస్తే, ఇది కేవలం ఒక సినిమా విమర్శ మాత్రమే కాదు. చరిత్ర, సమాజం, మరియు సినిమా బాధ్యతల మధ్య ఉన్న సంబంధంపై ఆలోచింపజేసే ఉదాహరణగా నిలుస్తోంది.
- బి. రామారావు, 9030715343



