Sunday, March 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకేటాయింపులు ఘనం-నిధులపై మౌనం

కేటాయింపులు ఘనం-నిధులపై మౌనం

- Advertisement -

ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులపై దృష్టి సారించని సర్కార్‌
మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఎలా సాధ్యం?

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ‘అంకెల్లో ఘనం.. ఆచరణలో ఎలా సాధ్యం…’ అన్నట్టుగా ఉంది. మొత్తం రూ.3,24,234 కోట్లతో పద్దును ప్రతిపాదించగా… అంత మేర నిధులను ఎలా సమకూరుస్తారనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఉమ్మడి రాష్ట్రంలో 2014లో చివరి బడ్జెట్‌ రూ.లక్ష కోట్లకు చేరుకోగా అప్పుడే ఆర్థిక నిపుణులు…’ఇంత భారీ బడ్జెట్‌ ఎలా సాధ్యం…?’ అంటూ ప్రశ్నలు సంధించారు. అప్పుడున్నది 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌. ఆ తర్వాత పది జిల్లాలతో ఏర్పడిన తెలంగాణకు (ఇప్పుడు 33 జిల్లాలు అయినా, భౌగోళిక విస్తీర్ణం మారదు) రూ.2 లక్షల కోట్లు, రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ల చొప్పున పద్దులను పెంచు కుంటూ పోవటం గమనార్హం. పోనీ ప్రభుత్వం వేసుకున్న అంచనాలను చేరుకుంటున్నారా అంటే అదీ లేదు. అయినా ప్రతీయేటా కేటాయింపులు పెంచుకుంటూ పోవటం, ఆ తర్వాత నిధుల్లేవంటూ వివిధ రంగాలకు కోతలు పెట్టటం షరా మామూలైపోయింది.

2025-26లో మొత్తం రూ.3.05 లక్షల కోట్లతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే అప్పుడు వేసుకున్న ఆదాయ అంచనాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి కేవలం 60 శాతం ఆదాయం మాత్రమే ఖజానాకు చేరింది. మిగతా 40 శాతం నిధులు రాకపోవటంతో ఆ మేరకు సంక్షేమ రంగానికి కోతలు విధించారు. ఈ వాస్తవాన్ని విస్మరించి, మళ్లీ ఇప్పుడు రూ.3,24,234 కోట్లతో పద్దును ప్రతిపాదించటం గమనార్హం. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో పన్నుల వాటాలు, గ్రాంట్లు, ఇతర సాయాలు రాకపోవటం, సొంత ఆదాయ వనరులు పెరగకపోవటం, వాటిపై దృష్టి సారించకపోవటం తదితర కారణాల రీత్యా ఖజానా నానాటికీ కుదేలవుతోంది. రూ.8.50 లక్షల కోట్ల అప్పులు, వాటికి ఏడాదికి రూ.13 వేల కోట్ల వడ్డీలు, ఇతర చెల్లింపులు… వెరసి సర్కారుకు గుదిబండగా మారాయి. అయినా వాటిని ఖాతరు చేయకుండా మళ్లీ బాహుబలి బడ్జెట్‌ను ఎందుకు రూపొందించారో అర్థం కావటం లేదని ఆర్థిక నిపుణులు పెదవి విరుస్తున్నారు.

ఒకవైపు అంకెలు భారీగా ఉంటున్నా.. కేటాయింపుల్లో కోతలు బడ్జెట్‌ను వెక్కిరిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే సాగునీటి రంగానికి 20 శాతం కోత పెట్టారు. ఎస్సీల అభివృద్ధికి పోయినసారితో పోలిస్తే భారీ మొత్తంలో కోతలు విధించి రూ.11,784 కోట్లకు తగ్గించారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.15,000 చెల్లించాలంటే రూ.25,000 కోట్లు కావాలి. కానీ ప్రభుత్వం ఆ పథకానికి కేటాయించింది రూ.18 వేల కోట్లే. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం చేస్తామని చెప్పినప్పటికీ దానికి స్పష్టమైన కేటాయింపులేమీ లేవు. కేవలం గ్యాస్‌ సబ్సిడీ కోసం రూ. 723 కోట్లు విదిల్చి చేతులు దులుపుకున్న సర్కార్‌… మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మాత్రమే గొప్పగా చెప్పుకుంటోంది.

ఇందిరమ్మ ఇండ్ల కోసం కేటాయించిన రూ.5,500 కోట్లలో అందరికీ ఇండ్లు ఎలా సాధ్యమో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. తెలంగాణ రైజింగ్‌ ప్రోగ్రాం కింద ‘విజన్‌ డాక్యుమెంట్‌-2047’ను రూపొంది ంచిన సర్కారు…అందులో భాగంగా వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమం, మహిళా సాధికారిత, యువ వికాసానికి పెద్ద పీట వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ లక్ష్యాల సాధన కోసం ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తామని ప్రకటించింది. తద్వారా తెలంగాణను మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామంటూ పేర్కొంది. కానీ ఆయా ఉరంగాలకు గత కేటాయింపులు, ఖర్చు, ప్రస్తుత కేటాయింపులను పరిశీలిస్తే సర్కారు తన లక్ష్యాన్ని చేరుకుంటుందా? లేదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. మొత్తం మీద ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, బడ్జెట్‌ కూర్పు… ‘ఊపర్‌ షేర్వాణీ.. అందర్‌ పరేషానీ…’ అనే విధంగా ఉందని చెప్పక తప్పదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -