ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై దృష్టి సారించాలి : టీఎస్‌యూటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కొద్ది మంది ధనవంతుల కోసం విదేశీ విద్యాలయాలను ఆహ్వానించడం కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలల బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర ఆఫీసు బేరర్స్ సమావేశం శనివారం హైదరాబాద్‌లోని ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు చావ రవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రవి మాట్లాడుతూ రాష్ట్రంలో యుకె పాఠశాలల ఏర్పాటు కోసం ఆయా యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చర్చలు జరిపి ఆహ్వానించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ పాఠశాలలను ఆహ్వానిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ప్రజలందరికీ సమానమైన, నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యతను విస్మరించి, కొందరికే నాణ్యమైన విద్యను పరిమితం చేయాలనే ఆలోచన సరికాదని సూచించారు. గత ప్రభుత్వం కొన్ని వందల గురుకులాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలలను గాలికొదిలేసిందని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే ఆకర్షణీయమైన పేర్లతో ప్రభుత్వ రంగంలో నాణ్యమైన విద్యను కొందరికే పరిమితం చేస్తోందని తెలిపారు. బడ్జెట్ కేటాయింపులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలంటే ప్రాథమిక పాఠశాలల్లో నర్సరీ, కెజి తరగతులు ప్రారంభించాలనీ, పర్యవేక్షణ అధికారుల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలనీ, జీఓ 25ను సవరించి ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, 50 మంది విద్యార్థులు మించి ఉన్న పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేశారు.
ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ మాట్లాడుతూ పీఆర్సీ రిపోర్టు విడుదల చేసి 1.07.2023 నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలు, పెండింగ్ బిల్లుల మంజూరు, వివిధ యాజమాన్యాల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికీ జేఏసీ ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధం కావాలనీ, లేని పక్షంలో టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో స్వతంత్రంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. మార్చి 29న జోగులాంబ జిల్లా గద్వాల జిల్లా ఆలంపూర్లో జరిగే టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశంలో కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గాభవాని, రాజశేఖర్ రెడ్డి, కోశాధికారి లక్ష్మారెడ్డి, కార్యదర్శులు సత్యానంద్, రాజు, రంజిత్ కుమార్, రవి ప్రసాద్ గౌడ్, మల్లారెడ్డి, రవి కుమార్, శ్రీధర్, సింహాచలం, జ్ఞాన మంజరి, వెంకటప్ప, వెంకటేశం, సోమయ్య, విశాలి, యాకయ్య, కొండలరావు పాల్గొన్నారు.



