Sunday, March 22, 2026
E-PAPER
Homeజాతీయంనిలిచిన మసాలా ఎగుమతులు

నిలిచిన మసాలా ఎగుమతులు

- Advertisement -

అమెరికాకు ఆర్డర్లు లేక ఎగుమతిదారుల్లో ఆందోళన
న్యూఢిల్లీ : అమెరికా సామ్రాజ్యవాదంతో పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధోన్మాదం భారత ఎగుమతులను తీవ్ర ప్రభావితం చేస్తోంది. భారత సుగంధ ద్రవ్యాల ఎగుమతులు స్తంభించాయి. భారత్‌ నుంచి ఏటా సుమారు 500 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.4700 కోట్లు) విలువైన మసాలా దినుసులు అమెరికాకు ఎగుమతి అవుతుండగా.. ప్రస్తుత అనిశ్చితి వల్ల అక్కడి కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లు ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు. సాధారణంగా ప్రతి ఏటా నవంబర్‌ నెలలో ఎగుమతిదారులు, కొనుగోలుదారులు ప్రాథమిక ఒప్పందాలు చేసుకున్నప్పటికీ, ప్రస్తుతం షిప్పింగ్‌ మార్గాల్లో అంతరాయం, పెరిగిన బీమా ప్రీమియంలు, యుద్ధ రిస్క్‌ సర్‌ఛార్జీల కారణంగా కొనుగోలుదారుల నుండి ఎటువంటి స్పందన రావడం లేదని ఎగుమతిదారులు వాపోతున్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో మసాలా దిగుమతుల సాగు విస్తీర్ణం 5.09 మిలియన్‌ హెక్టార్లకు లేదా 1.4శాతం పెరిగి ఉత్పత్తి 12.99 మిలియన్‌ టన్నులకు చేరుకున్నప్పటికీ, ఎగుమతులు నిలిచిపోవడంతో దేశీయంగా మిగులు నిల్వలు పెరిగి ధరలు పడిపోయే ప్రమాదం ఉందని ఈ రంగం నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మిరియాలు, యాలకులు, మిరపకాయలు, ధనియాలు, కరివేపాకు పొడి వంటి ఉత్పత్తుల ఎగుమతులపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణా ఖర్చులు భారీగా పెరగడం, కంటైనర్ల కొరతతో ఎగుమతిదారులు ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ”యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా కొనుగోలుదారుల నుంచి ఎటువంటి ఆర్డర్లు లేవు. ఇది ఎగుమతిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అనిశ్చితి, రవాణా ఇబ్బందుల వల్ల రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించక ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి” అని ఓ ఎగుమతిదారు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -