2025-26లో 236.87 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి
గడిచిన ఏడాది కంటే 4.77లక్షల మెట్రిక్ టన్నులు అధికం
స్వల్పంగా తగ్గిన పప్పు ధాన్యాల ఉత్పత్తి
2026-27 సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఆహార ఉత్పత్తుల్లో వెలిగిపోతోందని 2026-27 తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. వ్యవసాయ ఉత్పత్తి, ఆహార ధాన్యాల రంగంలో రాష్ట్రం స్థిరమైన వృద్ధిని ప్రతి ఏటా నమోదు చేస్తూనే ఉందని తెలిపింది. 2025-26లో ఖరీఫ్ సీజన్ ముగిసే సరికి ఆహార ఉత్పత్తులు 236.87 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంటాయని తెలిపింది. గతేడాది 2024-25లో 232.10 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఒక్క ఏడాదిలోనే 4.77 లక్షల మెట్రిక్ టన్నుల పెరుగుదల నమోదవుతుందని పేర్కొంది. ఇదే కాలంలో పప్పుధాన్యాల ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఇది 2023-24లో 3.61 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 2024-25లో 3.99 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది, కానీ 2025-26 నాటికి 3.48 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గుతుందని అంచనా వేయబడింది.
మొత్తమ్మీద, తెలంగాణ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్థిరమైన వృద్ధిని సాధించినప్పటికీ, పప్పుధాన్యాల ఉత్పత్తి స్వల్పంగా తగ్గనుంది. రాష్ట్రంలో పప్పుధాన్యాల సాగు విస్త్రీర్ణం పెంచడం, సాంకేతికతను మరింతగా జోడించడం ద్వారా ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందని సర్వే తెలిపింది. తెలంగాణలో ప్రధాన పంటలు వరి, పత్తి, మొక్కజొన్న అయినప్పటికి మెజార్టీ పంటగా భవిష్యత్‌లో కూడా వరి కొనసాగనుందని నివేదిక పేర్కొంది. వరి సాగు విస్త్రీర్ణం కూడా ప్రతి ఏటా పెరుగుతోంది. 2023-24లో 118.09 ఎకరాల నుంచి 2025-26లో 132.01 ఎకరాలకు చేరుకుందని వెల్లడించింది. మొత్తంగా గడిచిన మూడేండ్లల్లో వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటల్లో స్వల్ప వ్యత్యాసాలు నమోదవుతున్నప్పటికి ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల నమోదవుతోంది.
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్) 2026 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక నివేదిక ప్రకారం, తెలంగాణ గ్రామీణ జనాభాలో 62.01శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు. రాష్ట్ర స్థూల విలువ జోడింపు (జీఎస్‌వీఏ)లో వ్యవసాయ, అనుబంధ రంగాల ఆర్థిక వాటా 2025-26 నాటికి రూ. 213.799 కోట్లకు పెరిగింది. మెరుగైన విత్తనాలు అందించడం, వాతావరణ మార్పులను తట్టుకునే సాంకేతికత ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, వ్యవసాయ ఉపాధిని సృష్టించడంతో పాటు ప్రోత్సాహకాలను అందించడం ఉత్పత్తి పెరుగుదలకు కారణమని తెలిపింది. రైతు భరోసా, రైతు భీమా,కనీస మద్దతు ధరతో పాటు సన్న రకం వడ్డకు రూ.500 బోనస్, ఉచిత విద్యుత్ మొదలగు సబ్సీడీలు రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని స్థిరంగా ఉంచడానికి దోహదపడిందని సోషియో ఎకనామిక్ సర్వే 2026-27 వెల్లడించింది.




