ప్రారంభించనున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ : భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరనుంది. అధునాతన టెక్నాలజీ నీలగిరి శ్రేణి స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్‌ఎస్ తారగిరి (ఎఫ్ 41)ని అధికారికంగా నౌకదళంలో చేరేందుకు సిద్ధమవుతోంది. దీనిని ఏప్రిల్ 3న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. ప్రాజెక్ట్ 17ఏ తరగతికి చెందిన నాలుగో ఫ్రిగేట్ యుద్ధనౌక తారగిరి. ముంబయిలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) ఈ యుద్ధనౌకను నిర్మించింది. 75 శాతం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు 6,670 టన్నుల బరువుతో దీనిని తయారు చేశారు. దీనిని మునుపటి నౌకల కంటే మరింత ఆధునిక సాంకేతికతతో రూపొందించారు. ఇందులో ఆధునిక డిజైన్‌తో తక్కువ రాడార్ గుర్తింపు ఉంది. భారత్‌లో నిర్మాణం కోసం ఏర్పాటైన దాదాపు 200 సూక్ష్మ, చిన్న, మధ్యపరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) సాయంతో ఈ తారగిరి నిర్మాణం జరిగింది.
తారగిరి ముఖ్య లక్షణాలు
కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ (సీఓడీఓజీ) ఇంజిన్ వ్యవస్థతో తారగిరి నడుస్తోంది. హై-స్పీడ్, హై- ఎండ్యూరెన్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. బహుళ సముద్ర కార్యకలాపాలను అనుకూలంగా దీనిని రూపొందించారు. ఈ నౌకలో శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ ఉంది. అందులో ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే సూపర్ సోనిక్ క్షిపణులు, మధ్యశ్రేణి ఉపరితలం నుంచి గగనతాలనికి ప్రయోగించే క్షిపణులు, యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్(ఏఎస్‌డబ్ల్యూ) వ్యవస్థ ఉంది. ఇవన్నీ అత్యాధునిక కంబాట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా సమన్వయం చేశారు. దీని వల్ల సిబ్బంది అత్యంత కచ్చితత్వంతో ముప్పులకు ప్రతిస్పందించగలరు. తారగిరి కేవంల యుద్ధ నౌకగా మాత్రమే కాదు. దీనిని మానవతా సాయం, విపత్తు సహాయక చర్యలు, అంతర్జాతీయ సముద్ర దౌత్య కార్యక్రమాల కోసం నిర్మించారు. తారగిరి భారత నౌకాదళాన్ని మరింత శక్తివంతంగా మార్చడమే కాకుండా, దేశ సముద్ర సరిహద్దులను రక్షించే కీలక బలంగా నిలవనుంది.



